Begin typing your search above and press return to search.

ముంబై సెషన్స్ కోర్టు కీలక వ్యాఖ్యలు

By:  Tupaki Desk   |   25 Aug 2021 2:30 PM GMT
ముంబై సెషన్స్ కోర్టు కీలక వ్యాఖ్యలు
X
ఇద్దరు వ్యక్తుల మధ్య లైంగిక సంబంధం ఉన్నంత మాత్రాన వారు పెళ్లి చేసుకోవడం తప్పనిసరి ఏమీ కాదంటూ ముంబై సెషన్స్ కోర్టు తాజాగా కీలక వ్యాఖ్యలు చేసింది. ఓ అత్యాచారం కేసులో విచారణ సందర్భంగా న్యాయస్థానం చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. ఇద్దరు వ్యక్తులు శృంగారంలో పాల్గొన్న అంతమాత్రాన వారు ఖచ్చితంగా పెళ్లి చేసుకోవాలని రూలేమీ లేదని కోర్టు వెల్లడించింది. తనపై అత్యాచారం చేశాడని ఓ మహిళ ఓ వ్యక్తిపై కేసు నమోదు చేసిన నేపథ్యంలో ఆ కేసుకు సంబంధించిన వివరాలని పరిశీలించిన కోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది.

ఈ ఏడాది జనవరిలో తనకు పెళ్లి అయిందని పెళ్లి తర్వాత తాను అత్తవారింట్లో రెండు నెలల పాటు ఉన్నానని తన భర్త, మామ, భర్త స్నేహితుడు నిత్యం తనను వేధింపులకు గురి చేస్తున్నారని ఓ మహిళ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. ఈ క్రమంలో పోలీసులు గృహహింస చట్టంతో పాటుగా, వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. భర్తను ప్రధాన ముద్దాయిగా పేర్కొని అతని తండ్రిని రెండో ముద్దాయిగా, స్నేహితుడిని మూడో ముద్దాయిగా ఎఫ్ ఐ ఆర్ నమోదు చేశారు. ఇది జరిగిన కొన్ని రోజుల తర్వాత సదరు మహిళ మళ్లీ పోలీస్ స్టేషన్ మెట్లెక్కింది. తనను అతడు పెళ్లి చేసుకోలేదని, పెళ్లి పేరుతో తనను లోబర్చుకొని తనకు దగ్గరయ్యాడు అంటూ, ఆ తర్వాత తనను మోసం చేశాడంటూ ఫిర్యాదు చేసింది.

ఈ క్రమంలో పోలీసులు మరికొన్ని సెక్షన్లను జోడించి కేసు నమోదు చేశారు. అయితే ఈ కేసును విచారించిన కోర్టు నిందితుడిపై తొలి ఎఫ్ ఐ ఆర్ నమోదు అయ్యేవరకు ఆమె ఆ వ్యక్తి తో కలిసి అనేక చోట్లకి వెళ్లిందని, ఎఫ్ ఐ ఆర్ నమోదు అయిన తర్వాత కూడా థానే లోని ఓ హోటల్ లో వారు కలిసి ఉన్నట్లుగా చెప్పిన వివరాలను బట్టి వారిద్దరికీ ఎఫైర్ ఉందని, ఆమె ఇష్టపూర్వకంగానే అతనితో లైంగిక సంబంధాన్ని కొనసాగించినట్లు అభిప్రాయపడ్డారు. ఆ తర్వాత ఏదో కారణంతో వారి బంధం తెగిపోయింది ఉండొచ్చని భావించిన కోర్టు ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.

నిందితుడిపై ఫిర్యాదు చేసిన మహిళ మేజర్ అని, విద్యావంతురాలు కూడా అని పేర్కొన్న కోర్టు పెళ్లికి ముందు శృంగారంలో పాల్గొంటే కలిగే పర్యవసానాల గురించి ఆమెకు తెలుసు అని, ఇక ఆ వ్యక్తితో తనకు చాలా కాలంగా పరిచయం ఉందని చెప్పిన కారణంగా పెళ్లి పేరుతో అతను ప్రలోభ పెట్టాడు అని భావించడానికి వీలు లేదని అభిప్రాయం వ్యక్తం చేసింది. . ఇలాంటి ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిని అరెస్ట్ చేస్తే వారి స్వేచ్ఛకు భంగం కలిగించినట్టు అవుతుందని పేర్కొంది. నిందితులు కస్టడీలో ఉండాల్సిన అవసరం లేదని అభిప్రాయపడిన కోర్టు ముందస్తు బెయిల్ పొందే హక్కు నిందితులకు ఉందని స్పష్టం చేసింది. ప్రస్తుతం న్యాయస్థానం ముందుకు వచ్చిన బెయిల్ దరఖాస్తుకు మాత్రమే ఈ వ్యాఖ్యలు పరిమితమని సూచించింది. ప్రేమించుకోవడం, పెళ్లికి ముందు లైంగిక సంబంధాలను కొనసాగించడం, ఆ తర్వాత వివిధ కారణాలతో రిలేషన్ దెబ్బతింటే రచ్చ చేయడం అలవాటుగా మారింది అని , ఇలాంటి వ్యవహార విషయాల్లో కొంచెం జాగ్రత్తగా ఉండాలని కోర్టు తెలిపింది.