Begin typing your search above and press return to search.

బిచ్చ‌గాళ్ల‌కు అలా చేయ‌డ‌మంటే.. ప‌నిచేయ‌ని జ‌నాభాను పెంచ‌డ‌మేః హైకోర్టు

By:  Tupaki Desk   |   4 July 2021 2:30 AM GMT
బిచ్చ‌గాళ్ల‌కు అలా చేయ‌డ‌మంటే.. ప‌నిచేయ‌ని జ‌నాభాను పెంచ‌డ‌మేః హైకోర్టు
X
రోడ్డు వెంట భిక్ష‌మెత్తుకునే వారు మ‌న‌కు నిత్యం తార‌స‌ప‌డుతూనే ఉంటారు. అయితే.. వారిలో ఏ ప‌నీ చేసుకోలేని వృద్ధులు, విక‌లాంగులే కాకుండా.. అంతా బాగానే ఉన్న‌వారు కూడా క‌నిపిస్తుంటారు. ఇలాంటి వారిని దృష్టిలో పెట్టుకొని బాంబే హైకోర్టు కీల‌క వ్యాఖ్య‌లు చేసింది.

బ్రిజేష్ ఆర్య అనే వ్య‌క్తి ప్ర‌జాప్ర‌యోజ‌న వ్యాజ్యం దాఖ‌లు చేశారు. ఇందులో.. ముంబైలోని నిరాశ్ర‌యులు, బిచ్చ‌గాళ్లు, ఇత‌ర పేద‌ల‌కు రోజుకు మూడు పూట‌లా పోష‌క విలువ‌ల‌తో కూడిన ఆహారాన్ని అందించాల‌ని ముంబై న‌గ‌ర పాల‌క సంస్థ‌ను ఆదేశించాల‌ని కోరారు. అంతేకాకుండా.. సుర‌క్షిత‌మైన నీటిని అందించాల‌ని, వారికి ఆశ్ర‌యాన్ని, ప‌రిశుభ్ర‌మైన మ‌రుగుదొడ్ల‌ను అందుబాటులోకి తేవాల‌ని పిటిష‌నర్ కోరారు.

దీనికి బృహ‌న్ ముంబై న‌గ‌ర పాల‌క సంస్థ.. కోర్టుకు స‌మాధానం ఇచ్చింది. స్వ‌చ్ఛంద సంస్థల స‌హ‌కారంతో స‌మాజంలోని ఇటువంటి వారికి ఆహార పొట్లాల‌ను అందిస్తున్నామ‌ని, మ‌హిళ‌ల‌కు శానిట‌రీ నాప్ కిన్స్ కూడా అందిస్తున్న‌ట్టు తెలిపింది. దీనిపై కోర్టు సంతృప్తి వ్య‌క్తం చేసింది. అనంత‌రం పిటిష‌న‌ర్ ను ఉద్దేశిస్తూ కీల‌క వ్యాఖ్య‌లు చేసింది.

నిరాశ్ర‌యుల‌కు, భిక్ష‌గాళ్ల‌కు, పేద‌ల‌కు ప్ర‌భుత్వం అన్నీ అందివ్వ‌లేద‌ని స్ప‌ష్టం చేసింది. వాళ్ల ప్ర‌తీ అవ‌స‌రాన్ని స‌ర్కారు తీర్చ‌డం సాధ్యం కాద‌ని తెలిపింది. ఇలాంటి జ‌నాభాను మీరు పెంచుతున్నార‌ని పిటిష‌న‌ర్ ను ఉద్దేశించి వ్యాఖ్యానించింది. మీరు పిటిష‌న్లో కోరిన‌వ‌న్నీ వారికి మంజూరు చేయ‌డం అంటే.. ఏ ప‌నీ చేయ‌కండి అని ప్ర‌జ‌ల‌కు చెప్ప‌డ‌మే అవుతుంద‌ని తేల్చి చెప్పింది.