Begin typing your search above and press return to search.

నానావతి ఆసుపత్రికి వరవర రావు.. ఆ భాద్యత మాదేనన్న ఉద్దవ్ ప్రభుత్వం!

By:  Tupaki Desk   |   18 Nov 2020 4:43 PM GMT
నానావతి ఆసుపత్రికి వరవర రావు.. ఆ భాద్యత మాదేనన్న ఉద్దవ్ ప్రభుత్వం!
X
భీమా కోరేగావ్ ఎల్గార్ పరిషత్ కేసులో అరెస్ట్ అయిన తెలుగు విప్లవ రచయిత, విరసం మాజీ అధ్యక్షుడు వరవర రావుకు ముంబై హైకోర్టు ఊరటనిచ్చింది. తీవ్ర అస్వస్థతకు గురైన ఆయనకు ఆసుపత్రిలో చికిత్స చేయించుకోవచ్చని తెలిపింది. 15 రోజుల పాటు ఆసుపత్రిలో వైద్య చికిత్స తీసుకోవచ్చని, ఆ సమయంలో వరవర రావును చూడటానికి ఆయన కుటుంబ సభ్యులకు అనుమతి ఇచ్చింది. వరవర రావు వైద్య ఖర్చులకు అయ్యే ఖర్చును భరిస్తామని మహారాష్ట్ర ప్రభుత్వం బోంబే హైకోర్టుకు వెల్లడించింది.

మావోయిస్టులతో సంబంధాలు ఉండటం, మోడీ హత్యకు కుట్ర పన్నారనే కారణంతో రెండేళ్ల క్రితం వరవర రావును జాతీయ దర్యాప్తు సంస్థ అధికారులు అరెస్టు చేశారు. ప్రస్తుతం ఆయన ముంబైలోని తలోజా కేంద్ర కారాగారంలో ఉంటున్నారు. కొద్దిరోజుల కిందటే ఆయన తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. అదే సమయంలో కరోనాపాజిటివ్ గా తేలింది. దీనితో మూడు వారాల వరకు వరవర రావు ముంబైలోని లీలావతి ఆసుపత్రిలో చికిత్స పొందారు. ఆ తర్వాత మళ్లీ జైలుకు తరలించారు. అయితే, ఆ తర్వాత జైలుకు తరలించినప్పటి నుంచీ ఆయన ఆరోగ్య పరిస్థితి ఏ మాత్రం మెరుగు పడలేదు. మూత్రనాళ సంబంధ సమస్యలను ఆయన ఎదుర్కొంటున్నారు. నడవడానికి వీల్లేని పరిస్థితుల్లో ఆయన ఉన్నారు. తలోజా జైలు అధికారులు వరవర రావుకు అరకొరగా వైద్య సహాయాన్ని అందిస్తున్నారని, ఆసుపత్రిలో అడ్మిట్ చేయడానికి అనుమతి ఇవ్వాలంటూ మానవ హక్కుల కార్యకర్తలు బోంబే హైకోర్టులో పిటీషన్ దాఖలు చేశారు.

ఈ పిటీషన్ బుధవారం బోంబే హైకోర్టు సమక్షానికి విచారణకు వచ్చింది. వరవర రావు తరఫున న్యాయవాది ఇందిరా జైసింగ్ వాదనలను వినిపించారు. నడవలేని స్థితికి ఆయన చేరుకున్నారని, మంచానికి పరిమితం అయ్యారని చెప్పారు. మూత్రం సజావుగా రావడానికి వీలుగా అమర్చిన క్యాథెటర్‌ను మూడు నెలలుగా మార్చలేదని, ఫలితంగా- ఇతర అనారోగ్య సమస్యలకు అది దారి తీస్తుందని ఇందిరా జైసింగ్ ఆందోళన వ్యక్తం చేశారు. మానవతా దృక్పథంతోనైనా వరవర రావుకు మెరుగైన చికిత్సను అందించాల్సిన అవసరం ఉందని వాదించారు. ఆ వాదనలతో ముంబై హైకోర్టు న్యాయమూర్తులు ఏకీభవించి, ఆసుపత్రికి తరలించడానికి అనుమతి ఇచ్చారు. నానావతి ఆసుపత్రిలో చికిత్స తీసుకోవడానికి అంగీకరించారు. 15 రోజుల పాటు ఆయన ఆసుపత్రిలో చికిత్స చేయించుకోవచ్చని, అలాగే చికిత్స తీసుకుంటోన్న కాలంలో కుటుంబ సభ్యులు ఆయనను చూడొచ్చని, పరామర్శించవచ్చని అన్నారు. ఆయన చికిత్సకు అయ్యే ఖర్చను భరిస్తామని మహారాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకు సమాచారం ఇచ్చింది.