Begin typing your search above and press return to search.

13 నెలల వ్యవధిలో ఏకంగా మూడుసార్లు కరోనా.. ఆ డాక్టరమ్మ ఎవరంటే?

By:  Tupaki Desk   |   28 July 2021 4:02 AM GMT
13 నెలల వ్యవధిలో ఏకంగా మూడుసార్లు కరోనా.. ఆ డాక్టరమ్మ ఎవరంటే?
X
ఒకసారి కరోనా వస్తేనే కిందామీదా పడిపోయే పరిస్థితి. అలాంటిది ఏకంగా మూడుసార్లు కరోనా రావటం ఇప్పటివరకు విన్నది లేదు. అలాంటిది తాజాగా బయటకు వచ్చిన ఉదంతం ఇప్పుడు సంచలనంగానే కాదు.. కొత్త భయాన్ని కలిగించే పరిస్థితి. ఒకరే రెండు సార్లు కరోనా బారిన పడిన ఉదంతాల గురించి తెలిసిందే. అందుకు భిన్నంగా కేవలం పదమూడు నెలల వ్యవధిలో ఏకంగా మూడుసార్లు కరోనా బారిన పడిన ఉదంతం తాజాగా బయటకు వచ్చింది.

ముంంయికి చెందిన డాక్టర్ సృష్టి హళ్లారి వీర్ సావర్కర్ ఆసుపత్రిలో పని చేస్తుంటారు. కొవిడ్ విధుల్ని ఆమె నిర్వర్తిస్తుంటారు. ఇందులో భాగంగా మొదటి వేవ్.. అంటే గత ఏడాది జూన్ 17న మొదటిసారి మహమ్మారి బారిన పడ్డారు. 26ఏళ్ల ఈ వైద్యురాలు మొదటిసారి కరోనా కోరల నుంచి కాస్తంత సేఫ్ గా బయటపడ్డారు. ఆ సందర్భంలో ఆమెకు స్వల్ప లక్షణాలు కనిపించాయి. ఆ తర్వాత ఆమె.. ఆమె కుటుంబ సభ్యులంతా కలిసి ఈ ఏడాది మార్చి.. ఏప్రిల్ లో రెండు డోసుల టీకా తీసుకున్నారు.

ఇక్కడి వరకు కథ అంతా రోటీన్ గా జరిగేదే. ఆ తర్వాత రోటీన్ కు భిన్నమైన స్టోరీ మొదలైంది. రెండు డోసుల వ్యాక్సిన్ వేయించుకున్న నెల రోజులకు రెండోసారి కరోనా బారిన పడ్డారు. దీంతో ఆమె ఇంట్లో ఉండి తనకు తాను వైద్యం చేసుకున్నారు. ఎట్టకేలకు ఆమె కరోనా బారి నుంచి బయటపడ్డారు. ఇదిలా ఉంటే.. జులై 11న ఆమె మరోసారి కరోనా బారిన పడటం షాకింగ్ గా మారింది. ఈ మధ్యనే వైరస్ బారిన పడిన ఆమె.. అనుమానం వచ్చి తన కుటుంబ సభ్యుల మొత్తానికి పరీక్షలు జరపగా.. వారంతా కరోనా బారిన పడినట్లుగా చెబుతున్నారు.

తనకు మూడోసారి కరోనా సోకిన నేపథ్యంలో తన అనుభవాన్ని షేర్ చేసుకున్నారు. ఆమె అనుభవాన్ని వింటే భయంతో వణుకు పుట్టటం ఖాయం. ఇంతకూ ఆమె ఏం చెప్పారంటే.. ‘మూడోసారి కరోనా బారిన పడ్డా. ఈసారి వైరస్ తీవ్రంగా ఇబ్బంది పెడుతోంది. నాతో సహా ఫ్యామిలీ మొత్తం ఆసుపత్రిలో చేరాల్సి వచ్చింది. మా అందరికి రెమిడెసివర్ వాడాల్సిన పరిస్థితి వచ్చింది. మా మామయ్య (అమ్మ సోదరుడు)కు షుగర్ ఉంది. నాన్నకు బీపీ.. కొలెస్ట్రాల్ సమస్య ఉంది. నా సోదరుడికి శ్వాసలో ఇబ్బంది తలెత్తటంతో రెండు రోజుల పాటు ఆక్సిజన్ అందించాల్సి వచ్చింది’ అంటూ ఆమె ప్రకటన ఇప్పుడుకొత్త గుబులు రేపుతోంది.

వ్యాక్సిన్ వేయించుకున్న తర్వాత కూడా కరోనా బారిన పడటం కొత్తేం కాకున్నా.. ఒకే వ్యక్తి మూడుసార్లుకరోనా బారిన పడటం మాత్రం అంత మామూలు విషయం కాదు. టీకా తీసుకున్న తర్వాత కూడా వైరస్ బారిన పడొచ్చని.. మామూలు వాళ్లతో పోలిస్తే.. వ్యాక్సిన్ వేయించుకున్న వారిలో తీవ్రత తక్కువగా ఉంటుందన్న మాట చెప్పేవారు. కానీ.. అందుకు భిన్నంగా తాజా ఉదంతం ఉండటం షాకింగ్ గా మారింది. రానున్న రోజుల్లో కరోనా మహమ్మారి ఇలాంటి మరెన్ని సిత్రాల్ని తెర మీదకు తెస్తుందో చూడాల్సి వస్తుందో అన్న మాట వినిపిస్తోంది.