Begin typing your search above and press return to search.

సచిన్ కు మార్గదర్శిగా మారిన ముంబై ఆటోవాలా

By:  Tupaki Desk   |   26 Nov 2020 5:55 PM GMT
సచిన్ కు మార్గదర్శిగా మారిన ముంబై ఆటోవాలా
X
ఈ టెక్ జమానాలో స్మార్ట్ ఫోన్లు, కంప్యూటర్లు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వంటి ఎన్నో అధునాతన ఆవిష్కరణలు మన నిత్యజీవితంలో అంతర్భాగమైపోయాయి. రోజువారీ పనుల కోసం గూగుల్ పే మొదలు గూగుల్ మ్యాప్స్ వంటి టెక్నాలజీపైనే చాలామంది ఆధారపడుతున్నారు. టెక్నాలజీ మనిషి జీవితంలో అంతర్భాగమైందనడంతో ఎటువంటి సందేహం లేదు. అయితే, టెక్నాలజీనే సర్వస్వం కాదని....మనిషి తన మేథస్సుతో సృష్టించిన విచక్షణ లేని రోబోలు, ఏఐ మెషీన్లు వంటి వస్తువులు తర్కంతో, విచక్షణతో ఆలోచించే మనిషి స్థానాన్ని భర్తీ చేయలేవన్నది జగమెరిగిన సత్యం. సాటి మనిషికి సాయం చేసే విషయంలో మనిషితో రోబోలు పోటీ పడలేవన్న సంగతి ఇండియన్ లెజెండరీ క్రికెటర్, మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ విషయంలో నిరూపితమైంది. ముంబైలో కారు నడుపుతున్న తనకు దారి చూపడంలో నావిగేషన్ యాప్ విఫలమవడంతో....ఓ ఆటో డ్రైవర్ తనకు మార్గదర్శి అయ్యాడని సచిన్ వెల్లడించాడు. కరోనా విపత్తుతో పాటు పలు సందర్భాల్లో టెక్నాలజీ మనకు ఎంతగానో ఉపయోగపడిందని, కానీ, మనిషికి మనిషికి మధ్య ఉన్న సంబంధాన్ని టెక్నాలజీ భర్తీ చేయలేదని సచిన్ చెప్పాడు. ఈ ఏడాది జనవరిలో జరిగిన ఆ ఘటనకు సంబంధించిన వీడియోను సచిన్ తన సోషల్ మీడియా ఖాతాలో తాజాగా పోస్ట్ చేయడంతో అది వైరల్ అయింది.

ఈ ఏడాది జనవరిలో ముంబైలోని కండివలిలో కారు నడుపుతుండగా దారితప్పానని సచిన్ చెప్పాడు. తన కారులోని నావిగేషన్ యాప్ కూడా సరైన రూట్ చూపలేకపోయిందని, ఆ సమయంలో తనకు ఆటో డ్రైవర్ మంగేష్ దారి చూపాడని అన్నాడు. తన ఆటోను ఫాలో కావాల్సిందింగా మంగేష్ సూచించాడని, తనకోసం రెండు కిలోమీటర్ల దూరం ప్రయాణించిన మంగేష్ తనకు సరైన దారి చూపించాడని చెప్పాడు. ఆ సమయంలో మంగేష్ తో మరాఠీలో మాట్లాడుతున్న వీడియోను సచిన్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఈ విపత్తు సమయంలో టెక్నాలజీ మనకెంతో ఉపయోగపడిందని, కానీ, సాటి మనిషికి సాయం చేయడంలో మనిషి స్థానాన్ని వేరెవరూ భర్తీ చేయలేరని సచిన్ చెప్పాడు. ఈ గడ్డురోజులు పోయి త్వరలోనే సాధారణ పరిస్థితులు రావాలని సచిన్ ఆకాంక్షించాడు.