Begin typing your search above and press return to search.

టపాసులు అలా కాల్చొద్దన్నాడు.. అతడ్ని చంపేసిన ముగ్గురు మైనర్లు

By:  Tupaki Desk   |   25 Oct 2022 4:31 AM GMT
టపాసులు అలా కాల్చొద్దన్నాడు.. అతడ్ని చంపేసిన ముగ్గురు మైనర్లు
X
దీపావళి వేడుకల సందర్భంగా ఒక వ్యక్తి తన ప్రాణాల్ని కోల్పోయిన వైనం షాకింగ్ గా మారింది. ఇంతకు అతగాడు చేసిన పని తెలిస్తే.. ఆ మాత్రం దానికే చనిపోవాల్సి వచ్చిందా? అంటూ షాక్ తినటం ఖాయం.

దీపావళి పర్వదినాన.. ఆనందోత్సాహాల మధ్య కాల్చే టపాసులకు సంబంధించి చోటు చేసుకున్న చిన్న వివాదం.. నిండు ప్రాణాల్ని పోయేలా చేసింది. ఈ దారుణానికి పాల్పడిన ముగ్గురు మైనర్లు కావటం గమనార్హం. ఇంతకూ ఈ దారుణ ఉదంతం ముంబయిలో చోటు చేసుకుంది. అసలేం జరిగిందంటే..

ముంబయిలోని శివాజీ నగర్ లో 12 ఏళ్ల బాలుడు గ్లాసు బాటిల్ లో టపాసులు కాలుస్తున్నాడు. గాజు బాటిల్ లో టపాసులు ఉంచి కాల్చటం ద్వారా.. గాజు సీసా పగిలి.. గాజు పెంకులు ఎవరికైనా గుచ్చుకునే ప్రమాదం జరుగుతుందన్న ముందస్తు జాగ్రత్తల్లో భాగంగా.. ఆ కుర్రాడ్ని టపాసులు కాల్చకుండా అడ్డుకున్నాడు 21 ఏళ్ల సునీల్ శంకర్ నాయుడు. దీంతో ఈ ఇద్దరి మధ్య వాదన సాగింది.

దీన్ని గమనించిన కుర్రాడి అన్న (వీడికి పదిహేనేళ్లు ఉంటాయి).. అతని స్నేహితుడు (వాడికి పద్నాలుగేళ్లు ఉంటాయి) వచ్చి 21 ఏళ్ల యువకుడిపై దాడి చేశారు. తన వద్ద ఉన్న కత్తితో సునీల్ శంకర్ ను పొడిచాడు. ఈ ఉదంతాన్ని గుర్తించిన స్థానికులు గాయాల బారిన పడిన సునీల్ ను హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. తీవ్ర గాయాల బారిన పడిన ఆ వ్యక్తి.. చికిత్స పొందుతూనే మరణించాడు.

ఈ ఉన్మాద ఘటన గురించి సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. సునీల్ శంకర్ మరణానికి కారణమైన బాలుడి అన్న.. అతడి స్నేహితుడ్ని అరెస్టు చేయగా.. బాలుడు పరారీ అయ్యాడు. అతని కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.

దీపావళి పర్వదినాన చోటు చేసుకున్న ఈ ఉదంతం షాకింగ్ గా మారింది. మంచి చెప్పటాన్ని జీర్ణించుకోకుండా ఉండటమే కాదు.. ప్రాణాలు తీసేందుకు సైతం వెనుకాడకపోవటమా? అన్న మాట పలువురి నోట వినిపిస్తోంది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.