Begin typing your search above and press return to search.

సింగపూర్ ప్లానుకు ఫ్లైఓవర్లతో చెక్ !

By:  Tupaki Desk   |   25 July 2015 8:31 AM GMT
సింగపూర్ ప్లానుకు ఫ్లైఓవర్లతో చెక్ !
X
రాష్ట్ర విభజన తరువాత ఏపీ, తెలంగాణల మధ్య స్పర్థ వాతావరణం నెలకొన్న సంగతి తెలిసిందే... అయితే.. స్పర్థయా వర్థతే విద్య అన్నట్లుగా ఈ స్పర్థలు ఒక్కోసారి మంచి చేస్తుండగా కొన్నిసార్లు మాత్రం అనవసర పోటీకి తెరతీస్తూ అనాలోచిత నిర్ణయాలకు, ప్రజాధనం వృథాకు కారణమవుతున్నాయి. తెలంగాణ ప్రభుత్వ తాజా నిర్ణయాలు చూస్తుంటే అనవసర పోటీ ప్రస్ఫుటంగా కనిపిస్తోంది. ఆంధ్రప్రదేశ్ కొత్త రాజధాని మాస్టర్ ప్లాను ఇచ్చిన సింగపూర్ ప్రభుత్వం ఏపీ కొత్త రాజధాని అమరావతి ఊహాచిత్రాలను విడుదల చేసిన సంగతి తెలిసిందే... ఆ చిత్రాలను చూసినవారంతా అమరావతి అంతర్జాతీయ స్థాయి అత్యున్నత శ్రేణి నగరం కావడం ఖాయమని అర్థం చేసుకుంటున్నారు. దీంతో తెలంగాణ ప్రభుత్వ కూడా ఇప్పటికే ఉన్న తమ రాజధాని హైదరాబాద్ ను మరింత అభివృద్ధి చేయడానికి మల్టీ లెవల్ ఫ్లైఓవర్లు ఎక్కడికక్కడ నిర్మిస్తామంటూ కొన్ని చిత్రాలను వెలుగులోకి తెచ్చింది. ఇది పాత ప్రకటనే అయినప్పటికీ, అభివృద్ధి పరంగా మంచి నిర్ణయమే అయినప్పటికీ సరైన ప్రణాళిక లేకుండా హడావుడి నిర్ణయాలు అనవసర పోటీతో వీటి నిర్మాణానికి పూనుకొంటే మాత్రం అది ప్రజలకు సౌకర్యం కలిగించకపోగా మరింత ఇబ్బందికరంగా మారే ప్రమాదముందంటున్నారు నిపుణులు. ముఖ్యంగా తెలంగాణ ప్రభుత్వం చెబుతున్న పలుచోట్ల మల్టీలెవల్ ఫ్లై ఓవర్ల అవసరం కనిపించకపోగా.. ఇంకొన్ని చోట్ల వాటి వల్ల ట్రాఫిక్ సమస్యలు మరింతగా పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి. అదే సమయంలో అవసరమైన కొన్ని చోట్ల వాటి నిర్మాణం ప్రస్తావనే లేదు.

ఏపీని, అమరావతిని సింగపూర్ చేస్తానని చంద్రబాబు తరచూ చెబుతుంటారు.. అదేమాదిరిగా కేసీఆర్ కూడా కొద్దికాలంగా హైదరాబాద్ ను డల్లాస్ చేస్తామంటున్నారు. ఆ క్రమంలో కేసీఆర్ ఇప్పుడు కీలక నిర్ణయం తీసుకున్నారు. హైదరాబాద్ లో మొదటి దశలోనే 20 చోట్ల మల్టీలెవల్ ఫ్లై ఓవర్లు జంక్షన్ల నిర్మాణానికి ప్రభుత్వం తరఫున అనుమతులు మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఇందుకోసం రూ.2630 కోట్లు ఖర్చు చేయనున్నారు. అమరావతి నిర్మాణంలో మొదటి దశ పదేళ్లలో పూర్తి చేస్తారు... ఈ ఏడాదే పనులు ప్రారంభం కానున్నాయి.. 2018 కల్లా కొంత రూపం రానుంది.. ఈ నేపథ్యంలో హైదరాబాద్ లో మల్టీ లెవల్ ఫ్లై ఓవర్లను కేసీఆర్ రెండున్నరేళ్లలోనే పూర్తి చేస్తామంటున్నారు. ఇది ఎంతవరకు సాధ్యమో చూడాలి. హైదరాబాద్ లో ప్రస్తుతం సాగుతున్న మెట్రో పనులే ఇంకా కొలిక్కి రాలేదు. ఈ సమయంలో నగర వ్యాప్తంగా ఫ్లై ఓవర్ట నిర్మాణం మొదలుపెడితే నగరవాసులు ఇక ఇంట్లోంచి బయటకు కాలు పెట్టడం కూడా కష్టమవుతుందేమో. ఒక చోటి నుంచి ఇంకో చోటికి వెళ్లాంటే రోజులు పట్టేటంతటి ట్రాఫిక్ ఇబ్బందులు వచ్చే ప్రమాదమూ ఉంది.

మరోవైపు ఈ ఫ్లై ఓవర్ట మొదటి దశ ప్రతిపాదనల్లో ఉన్న ప్రాంతాలను పరిశీలిస్తే కేబీఆర్ పార్కు కూడలి... కామినేని ఆసుపత్రి, చింతల్ కుంట చెక్ పోస్టు వంటి ప్రాంతాల్లో వీటి అవసరం కనిపించడం లేదు. ఎల్బీ నగర్ కూడలి వద్ద మల్టీ లెవల్ ఫ్లై ఓవరు వచ్చినప్పుడు అది రెండు దిశల్లో కనీసం కిలోమీటరున్న దూరం వరకు విస్తరిస్తుంది. అంటే ఇదే ప్రతిపాదనల్లో ఉన్న కామినేని ఆసుపత్రి... చింతల్ కుంట చెక్ పోస్టు వరకు ఇది ఉంటుంది. అలాంటప్పుడు ఆ రెండు ప్రాంతాల్లో మళ్లీ మల్టీ లెవల్ ఫ్లై ఓవర్ల అవసరం... నిర్మాణపరమైన అనుకూలత ఎలా ఉంటుందని నిపుణులు అంటున్నారు. మరోవైపు నగరంలో రద్దీపరంగా కీలక ప్రాంతమైన పంజాగుట్ట వంటి ప్రాంతాలకు ఈ ప్రతిపాదనల్లో స్థానం కల్పించలేదు. అంతేకాదు.. ప్రస్తుతం గోతులతో నిండిపోయిన హైదరాబాద్ రోడ్లను ఏమాత్రం మెరుగుపరచకుండా మల్టీ లెవల్ ఫ్లై ఓవర్లంటూ మాయ చేస్తున్నారని విమర్శలొస్తున్నాయి. పంజాగుట్ట చౌరస్తానే తీసుకుంటే సిగ్నల్ దాటగానే తెలియనివారెవరైనా చూడకుండా బండినడిపితే బండికి, డ్రైవరుకు కూడా నడుం విరిగిపోయేటంతటి గోతులున్నాయి. ఇక రాత్రి వేళల్లోనైతే వారంలో కనీసం నలుగురైదులు ఈ గోతుల్లో పడుతున్నారు. తొలుత వాటిని సరిదిద్దకుండా ఆర్భాటాలెందుకని నగరవాసులు గుసగుసలాడుతున్నారు.

చూడ్డానికి ఇదంతా హైదరాబాద్ అభివృద్ధి కోసమే అన్నట్లుగా ఉన్నా లోలోపల మాత్రం ఏపీతో పోటీ కోసం పడుతున్న పాట్లు.. తీసుకుంటున్న హడావుడి, అనాలోచిత నిర్ణయాలన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇదంతా చూస్తుంటే అప్పుడెప్పుడో వచ్చిన శుభలగ్నం సినిమాలోని 'పొరుగింటి మంగళగౌరి వేసుకున్న గొలుసు చూడు... ఎదురింటి పిన్నిగారి కాసులపేరు చూడు' అన్న పాట గుర్తొస్తుందంటునట్నారు అంతా.. ఎందుకోమరి..!!