Begin typing your search above and press return to search.

చంద్రబాబూ... వారికి పాఠాలు చెప్పండి

By:  Tupaki Desk   |   3 Feb 2016 7:38 AM GMT
చంద్రబాబూ... వారికి పాఠాలు చెప్పండి
X
ఏపీ సీఎం చంద్రబాబు నాయుడును విపక్ష వైకాపా అధినేత జగన్, ఆ పార్టీ నేతలు పదేపదే అబద్ధాల కోరుగా అభివర్ణిస్తుంటారు. నిజానికి చంద్రబాబు మరీ అంత అబద్ధాలకోరు కాదని జనానికి తెలుసు కానీ... టీడీపీ నేతల చేస్తున్న ప్రకటనలు ఒక్కోసారి ఆ పార్టీ అబద్ధాల పార్టీయేనని అనేలా చేస్తున్నాయి. ఇటీవల కాలంలో అతిశయోక్తులు, అత్యుత్యాహం.. అదిగో పులి అంటే ఇదిగో తోక అనే తీరుతో టీడీపీ నేతలు కొందరు మాట్లాడుతుండడంతో అదంతా చంద్రబాబుకు చెడ్డపేరు తెస్తోంది. ముఖ్యంగా టీడీపీ అధికార ప్రతినిధుల ఎంపిక సరిగా లేదన్న వాదన ఒకటి బలంగా వినిపిస్తోంది. వారికి పెద్దగా అవగాహన లేకపోవడంతో తోచినట్లు మాట్లాడేసి ఇబ్బందులు తెచ్చిపెడుతున్నారు. అది చివరకు చంద్రబాబుకు మచ్చ తెస్తోంది.

తాజాగా టీడీపీ అధికార ప్రతినిధి ముళ్లపూడి రేణుక ఇదిగో పులి అంటే అదిగో తోక అంటూ విమర్శల పాలయ్యారు. రేణుక తాజాగా ప్రెస్ మీట్ పెట్టి ఒక ప్రకటన చేశారు. అందులో విశాఖ భాగస్వామ్య సదస్సు వివరాలు చెప్పొకొస్తూ ఇంతకు అంత చెప్పారు. ప్రభుత్వం ఒక రకంగా చెబుతుంటే రేణుక మరోలా చెప్పారు. సమ్మిట్‌ లో వివిధ కంపెనీలతో రూ. 5లక్షల కోట్ల ఒప్పందాలు చేసుకున్నామని ప్రభుత్వం స్పష్టంగా ఎలాంటి అతిశయోక్తులు లేకుండా చెబుతోంది. ముళ్లపూడి రేణుక మాత్రం ఆ రూ. 5 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చేశాయి అని చెప్పేస్తున్నారు. అంతేకాదు రాజధాని నిర్మాణం ఒక కొలిక్కి వచ్చేసిందనీ చెప్పేశారు. అక్కడితో ఆగకుండా ప్రత్యేకహోదాపైనా తన నాలెడ్జిని ప్రదర్శించుకున్నారు. ప్రత్యేక హోదా ఉన్న 11 రాష్ట్రాలకు వెళ్లాల్సిన నిధులన్నింటినీ చంద్రబాబు ఏపీ తీసుకొచ్చారని ప్రకటించారామె. దీంతో... చాలామంది టీడీపీ మేలుకోరేవారు కంగారుపడ్డారు. అధికార ప్రతినిధులు ఇలాగే అవగాహన రాహిత్యంతో మాట్లాడితే నష్టమేర్పడుతుందని.. వారికి అవగాహన అయినా కల్పించాలి లేదంటే నాలెడ్జి ఉన్నవారిని ఆ పదవిలో పెట్టుకోవాలని చంద్రబాబుకు సూచిస్తున్నారు. ఒప్పందాలకు, పెట్టుబడులకు తేడా తెలియకుండా ఏదేదో మాట్లాడి ప్రభుత్వం , ముఖ్యమంత్రిని అబద్దాల కోరులన్న పేరు తేరాదని అంటున్నారు.