Begin typing your search above and press return to search.

అఖిలేశ్ పై ములాయాం.. అలా అనేశారేంటి!

By:  Tupaki Desk   |   16 Aug 2016 3:50 AM GMT
అఖిలేశ్ పై ములాయాం.. అలా అనేశారేంటి!
X
ఉత్తరప్రదేశ్‌ లో వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో అధికారపక్షం సమాజ్‌ వాదీ పార్టీలో విభేదాలు రోజురోజుకీ ముదిరి పాకాన పడుతున్నాయి. తాజాగా జరిగిన స్వాతంత్ర వేడుకల్లో ఇవి తారాస్థాయికి చేరాయనే చెప్పాలి. ఇప్పటికే పార్టీలో మొదటి రెండుస్థానాల్లో ఉన్న అధ్యక్షుడు ములాయం సింగ్‌ యాదవ్ - ఆయన కుమారుడు - యూపీ ముఖ్యమంత్రి అఖిలేశ్‌ యాదవ్‌ ల మధ్యే ఈ విభేదాలు కనిపించడంతో.. రాజకీయంగా ఈ విషయం హాట్ టాపిక్ అయ్యింది. అఖిలేష్ ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న ములాయం సోదరుడు శివ్‌ పాల్‌ యాదవ్‌ తాజాగా తీసుకొచ్చిన ఒక ప్రతిపాదనే ఈ తండ్రీకొడుకుల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి తీసుకొచ్చింది. దీంతో బహిరంగంగానే అఖిలేష్ పై ములాయాం చిర్రుబుర్రులాడుతున్నారు.

ఉత్తరప్రదేశ్ లో జరిగిన స్వాతంత్ర వేడుకలకు ములాయాం సింగ్ - అఖిలేశ్ లు కలిసి హాజరయ్యారు. ఆ సందర్బంగా మాట్లాడటానికి మైక్ అందుకున్న ములాయాం... "నేను కానీ రంగంలోకి దిగితే.. ప్రభుత్వానికి అసలు సంగతి అర్ధమవుతుంది" అని వ్యాఖ్యలు చేశారు. తన కుమారుడు ముఖ్యమంత్రిగా ఉన్న ప్రభుత్వంపై ములాయాం ఈ స్థాయిలో విమర్శలు చేయడమేమిటి - హెచ్చరించడమేమిటి... అది కూడా బహిరంగ వేదికపై అని చాలామంది ఆలోచనలో పడ్డారు. కారణం ఏమై ఉంటుందా అని ఆలోచిస్తే.. అసలు విషయం తెలిసింది.

వచ్చే ఏడాది యూపీలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో అఖిలేశ్‌ యాదవ్‌ కేబినెట్‌ లో మంత్రిగా ఉన్న ములాయం సోదరుడు శివపాల్‌ యాదవ్‌.. ఓ ప్రాంతీయ పార్టీతో పొత్తు కుదుర్చుకుందామని ప్రతిపాదన పెట్టారు. అయితే ఈ నిర్ణయాన్ని అఖిలేశ్‌ కాదన్నారు. ఇదే సమయంలో ములాయం మరో తమ్ముడు రామ్‌ గోపాల్‌ కూడా శివపాల్‌ నిర్ణయాన్ని వ్యతిరేకించి - అఖిలేశ్ కు మద్దతుగా నిలిచారు. దీంతో వారి మధ్య అభిప్రాయభేదాలు ఏర్పడటమే గాక.. రాజీనామా కూడా చేస్తానని శివపాల్‌ ప్రకటించారు. ఈ విషయం కాస్తా అటుతిరిగి ఇటుతిరిగి ములాయం వరకూ వెళ్లింది. దీంతో శివపాల్‌ కు మద్దతిస్తూ.. కుమారుడు అఖిలేశ్‌ పై బహిరంగంగా మండిపడ్డారు ములాయం. ఈ వ్యవహారంపై ములాయం బహిరంగంగానే కొడుకు ప్రభుత్వంపై విమర్శలు చేశారు. దీంతో పార్టీ గొడవ కాస్తా.. అన్నదమ్ములు - తండ్రీ కొడుకుల తగువుగా మారింది.