Begin typing your search above and press return to search.

హమ్మయ్యా... కాంగ్రెస్ కు సారథి దొరికారండీ

By:  Tupaki Desk   |   9 Aug 2019 1:56 PM GMT
హమ్మయ్యా... కాంగ్రెస్ కు సారథి దొరికారండీ
X
కాంగ్రెస్ పార్టీ... దేశంలోనే గ్రాండ్ ఓల్డ్ పార్టీగా ఘన చరిత్ర కలిగిన పార్టీనే. అయితే ప్రధాని నరేంద్ర మోదీ దెబ్బకు వరుసగా రెండు సార్వత్రిక ఎన్నికల్లో బక్కచిక్కి - చిక్కి శల్యమై అత్యంత ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొంటున్న ఆ పార్టీకి ప్రస్తుతం సారథే లేరు. తాజా సార్వత్రిక ఎన్నికల్లో పార్టీ ఘోర పరాజయానికి బాధ్యత వహిస్తూ రాహుల్ గాంధీ పార్టీ అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు. ఇది జరిగి ఇప్పటికే నెల రోజులకు పైగానే అవుతున్నా.. పార్టీకి కొత్త సారథి మాత్రం దొరకడం లేదు. ఎవరిని అడిగినా... తమతో కాదని ముఖం మీదే చెప్పేస్తున్నారు. తాజాగా ఆ యత్నాలు ఓ కొలిక్కి వచ్చాయట. సోనియా గాంధీకి అత్యంత సన్నిహితుడిగా ముద్ర పడిన పార్టీ సీనియర్ నేత - కేంద్ర మాజీ మంత్రి ముకుల్ వాస్నిక్ పార్టీకి కొత్త అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టేందుకు సరేనన్నారట.

ఈ మేరకు శుక్రవారం మధ్యాహ్నం సోనియా నివాసంలో పార్టీ సీనియర్లు ప్రత్యేకంగా భేటీ అయి... పార్టీ అధ్యక్ష బాధ్యతలు చేపట్టేందుకు ఏ ఒక్క నేత ముందుకు రావడం లేదని.. ఈ క్రమంలో మహారాష్ట్రకు చెందిన పార్టీ సీనియర్ ముకుల్ వాస్నిక్ ను మించిన ప్రత్యామ్నాయం లేదని, ముకుల్ కూడా విముఖంగానే ఉన్నా సోనియా మాటను జవదాటే నేత కాదని ఓ నిర్దారణకు వచ్చారట. వారందరి అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకున్న సోనియా కూడా ముకుల్ తో మాట్లాడి పార్టీ సారథ్య బాధ్యతలు చేపట్టాలని - తామంతా అండగా ఉంటామని చెప్పారట. స్వయంగా సోనియానే చెప్పిన తర్వాత ముకుల్ కాదని చెప్పే రకం కాదు కదా. అందుకే కొంత అయిష్టత ఉన్నా... పార్టీ అధ్యక్షుడిగా చేపట్టేందుకు ముకుల్ సరేనన్నారట. అంతా సవ్యంగానే సాగుతున్న క్రమంలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ముకుల్ పేరును శనివారం అధికారికంగా ప్రకటించే అవకాశాలున్నాయన్న వార్తలు వినిపిస్తున్నాయి.

ఈ క్రమంలో అధ్యక్ష ఎంపికకు సంబంధించి గడచిన కొంతకాలంగా నానా పాట్లు పడుతున్న కాంగ్రెస్ పెద్దలకు ఇప్పుడు కాస్తంత ఉపశమనం లభించినట్టేనని చెప్పక తప్పదు. ఇక ముకుల్ ప్రస్థానం గురించిన విషయానికి వస్తే... సోనియాకు అత్యంత సన్నిహితుడుగానే కాకుండా నమ్మకస్తుడిగానే ముకుల్ కు పేరుంది. పీవీ నరసింహా రావు హయాంలో మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించిన ముకుల్... 2009 లో రాంటేక్ నియోజకవర్గం నుంచి ఎంపీగా గెలుపొంది మన్మోహన్ సింగ్ కేబినెట్‌లో కూడా మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. అంతేకాకుండా పార్టీ ప్రధాన కార్యదర్శిగా, సోనియా గాంధీకి కార్యదర్శిగా కూడా కొనసాగారు.