Begin typing your search above and press return to search.

మ‌మ‌త మీద 'రాయి' పడిపోయిందే!

By:  Tupaki Desk   |   25 Sep 2017 10:00 AM GMT
మ‌మ‌త మీద రాయి పడిపోయిందే!
X
తృణ‌మూల్ కాంగ్రెస్ అధినేత్రి - ప‌శ్చిమ బెంగాల్ సీఎం మ‌మ‌తా బెన‌ర్జీకి నిజంగానే గ‌ట్టి ఎదురు దెబ్బ త‌గిలింది. దీదీకి కుడిభుజంగా ప‌రిగ‌ణిస్తున్న తృణ‌మూల్‌ లో కీల‌క నేత ముకుల్ రాయ్ ఆ పార్టీకి రాజీనామా చేసేశారు. ఓ వైపు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి ఎదురొడ్డి పోరాడుతున్న మ‌మ‌త‌... ప‌శ్చిమ బెంగాల్ రాజ‌ధానిలో బీజేపీకి షాకుల మీద షాకులిస్తున్న సంగ‌తి తెలిసిందే. బీజేపీ సైద్ధాంతిక సంస్థ‌గా పేరున్న ఆరెస్సెస్... కోల్ క‌తాలో స‌మావేశాలు ఏర్పాటు చేసుకునేందుకు కూడా మ‌మ‌త అనుమ‌తించ‌డం లేదు. త‌న‌దైన వ్యూహాల‌ను అమ‌లు చేస్తున్న దీదీ... బీజేపీకి నిజంగానే కొర‌క‌రాని కొయ్య‌గా ప‌రిణ‌మించార‌నే చెప్పాలి. అయితే ఎప్ప‌టిక‌ప్పుడు త‌న‌కు అడ్డు వ‌స్తున్న మ‌మ‌త‌ను దారికెలా తెచ్చుకోవాలా? అన్న కోణంలో బీజేపీ మ‌ల్ల‌గుల్లాలు ప‌డుతోంద‌న్న వాద‌న కూడా లేక‌పోలేదు. ఈ క్ర‌మంలోనే బీజేపీ అధిష్ఠానం చాలా తెలివిగా పావులు క‌దిపిన‌ట్లుగా తెలుస్తోంది. స‌ద‌రు పావుల ఫ‌లితంగానే ఇప్పుడు దీదీని కోలుకోలేని దెబ్బ త‌గిలింద‌న్న వాద‌న వినిపిస్తోంది.

ముకుల్ రాయ్ విష‌యానికి వ‌స్తే... తృణమూల్‌ ఆవిర్బావం నుంచి ఆ పార్టీకీ సీనియర్‌ నేతగా - ఢిల్లీలో పెద్ద దిక్కుగా ఉన్న ముకుల్‌ రాయ్ వ్య‌వ‌హ‌రిస్తున్నారు. దేశ రాజ‌ధానిలో పార్టీ త‌ర‌ఫున బ‌ల‌మైన గొంతుక‌ను వినిపిస్తున్న నేత‌గానూ రాయ్‌కి పేరుంది. అలాంటి రాయ్ ఉన్న‌ప‌ళంగా పార్టీకి రాజీనామా చేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించ‌డంతో ఇప్పుడు తృణ‌మూల్‌ లో పెను తుఫానే రేగింది. తృణమూల్‌ కాంగ్రెస్‌ కు రాజీనామా చేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించిన రాయ్‌... పార్టీ పదవులకు - రాజ్యసభ సభ్యత్వానికి దుర్గా పూజల అనంతరం రాజీనామా చేస్తానని ప్రకటించారు. దుర్గా పూజల అనంతరం భవిష్యత్‌ కార్యాచరణ ప్రకటిస్తానని ఆయన చెప్పారు. శారదా చిట్‌ ఫండ్‌ స్కామ్‌ బయటకు వచ్చాక ముకల్‌ రాయ్‌ ని మమతా బెనర్జీ పార్టీ జనరల్‌ సెక్రెటరీ పదవి నుంచి తప్పించారు. అప్పటినుంచి ముకుల్‌ రాయ్‌ ని మమతా బెనర్జీ నెమ్మదిగా పక్కనపెడుతూ వస్తున్నారు.

ఇదిలా ఉంటే... తృణమూల్‌ కు రాజీనామా చేసిన అనంతరం ఆయన బీజేపీలో చేరతారనే ప్రచారం జరుగుతోంది. రాజీనామా తరువాత మీరు బీజేపీలో చేరే అవకాశం ఉందా? అన్న మీడియా ప్ర‌శ్న‌కు సమాధాన మిస్తూ.. *5 రోజులు ఆగండి.. మీకే తెలుస్తుంది* అని రాయ్‌ చెప్పారు. ఒకవేళ ముకుల్‌ రాయ్‌ బీజేపీలో చేరితే.. ఆ పార్టీకి పెద్ద ఊపు వస్తుందని రాజకీయ వేత్తలు అంచనా వేస్తున్నారు. ముఖ్యంగా బెంగాల్లో పాగా వేయాలని ప్రయత్నిస్తున్న బీజేపీకి ఈ ప‌రిణామం బాగా కలిసి వస్తుందనే అంచనాలున్నాయి.