Begin typing your search above and press return to search.

వెంకయ్యనాయుడు ప్లేస్ లోకి ఆయన.. మరి రాష్ట్రపతిగా...?

By:  Tupaki Desk   |   17 Jun 2022 4:30 AM GMT
వెంకయ్యనాయుడు ప్లేస్ లోకి ఆయన.. మరి రాష్ట్రపతిగా...?
X
దక్షిణాది రాష్ట్రాలలో రాజకీయాన దిగ్గజ నేతగా ముప్పవరపు వెంకయ్యనాయుడుని చెప్పుకోవాలి. ఆయన దేశంలో అగ్ర నేతలలో ఒకరిగా ఎదిగారు. ఒక సామాన్య రైతు కుటుంబం నుంచి వచ్చిన వెంకయ్యనాయుడు ఈ రోజు దేశానికి ఉప రాష్ట్రపతిగా ఉన్నారు. దేశ ప్రధమ పౌరుడి పదవిని అందుకోవడానికి చాలా దగ్గరలో కూడా ఆయన ఉన్నారు.

కేంద్రంలోని బీజేపీ పెద్దలు ఆయన పేరు ఓకే చేస్తే కనుక వెంకయ్యనాయుడు కొత్త రాష్ట్రపతి అవడం ఖాయం. దాదాపుగా నాలుగు దశాబ్దాల తరువాత నీలం సంజీవరెడ్డి తరువాత తెలుగోడి సత్తా చాటిన వారు అవుతారు. ఒక విధంగా వెంకయ్యనాయుడు రాష్ట్రపతి కావాలని ప్రతి తెలుగు వారూ కోరుకుంటున్నారు. అలాగే దక్షిణాదికి కేంద్ర పదవులలో ముఖ్యమైన రంగాలలో ప్రాధాన్యత లేదని భావించే వారు సైతం ఈ విధంగా అయినా కొంత న్యాయం జరిగితే బాగుంటుంది అని ఆలోచిస్తున్నారు.

వెంకయ్యనాయుడు రాష్ట్రపతి అవుతారా అంటే వివిధ సమీకరణలను బట్టి చూడాల్సిందే. బీజేపీ అయితే ఈసారి ఒక మహిళను అందునా గిరిజన తెగకు చెందిన ద్రౌపది ముర్ముని రాష్ట్రపతి అభ్యర్ధిగా ప్రకటించాలని చూస్తోంది అంటున్నారు. ఆమె జార్ఖండ్ కి గవర్నర్ గా పనిచేశారు. ఇప్పటిదాకా ఈ వర్గానికి రాష్ట్రపతి పదవి దక్కలేదు. దాంతో ఆ లోటుని తామే భర్తీ చేయాలని బీజేపీ వ్యూహకర్తలు ఆలోచన చేస్తున్నట్లుగా వినికిడి.

అదే విధంగా వెంకయ్యనాయుడు ప్లేస్ లో ఉప రాష్ట్రపతిగా ముస్లిం మైనారిటీ సామాజిక వర్గానికి చెందిన ముక్తార్ అబ్బాస్ నఖ్వీని ఎంపిక చేశారు అని తెలుస్తోంది. నఖ్వీ సీనియర్ మోస్ట్ లీడరు. ఆయన జనతా పార్టీ ద్వారా తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించారు. ఆయన తరువాత కాలంలో బీజేపీలో చేరి ఉన్నత పదవులు అలంకరించారు.

అదే విధంగా వాజ్ పేయ్ ప్రధానిగా ఉండగా కేంద్ర మంత్రిగా పనిచేశారు. ఇక మోడీ రెండు టెర్ముల పాలనలో కూడా కేంద్ర మంత్రిగా ఉంటూ వస్తున్నారు. తాజాగా రాజ్యసభ ఖాళీలను బీజేపీని పూర్తి చేసింది. అందులో నఖ్వీకి సీటు ఇస్తారని అనుకున్నారు. కానీ ఇవ్వకపోవడంతో ఆయన ఉప రాష్ట్రపతి అవుతారనే అలా చేశారని భావిస్తున్నారు.

ఉత్తరప్రదేశ్ కి చెందిన నఖ్వీ ఎంపిక వెనక కూడా సామాజిక సమీకరణలు ఉన్నాయని అంటున్నారు. రానున్న రెండేళ్ళలో ఎన్నికలు ఉన్నాయి. దాంతో మైనారిటీలను ఒక సందేశం ఇచ్చేందుకు బీజేపీ నఖ్వీని ముందుకు తెస్తోంది అంటున్నారు. ఈ మధ్య బీజేపీ అధికార ప్రతినిధి నుపూర్ శర్మ ముస్లిం ల గురించి చేసిన అనుచిత వ్యాఖ్యల హోరు అలాగే ఉంది. ఈ కీలకమైన సమయంలో ఆ వర్గం అండ కోసం కూడా బీజేపీ ఇలా చేస్తోంది అంటున్నారు.

మొత్తం మీద వెంకయ్యనాయుడు ఆగస్టులో ఖాళీ చేసే ఉప రాష్ట్రపతి పదవికి అయితే భర్తీకి నఖ్వీని రెడీ చేసి ఉంచారు అంటున్నారు. అదే విధంగా వెంకయ్యనాయుడుకు ప్రమోషన్ ఇస్తారా లేదా అన్నదే తెలియడంలేదు. సౌతిండియా మీద బీజేపీ కన్ను ఉందని, ఇక్కడ రాజకీయంగా లాభపడాలని చూస్తోందని అంటున్నారు. అదే కనుక నిజమైతే ఆ సెంటిమెంట్ కనుక పండితే మాత్రం కొత్త రాష్ట్రపతి వెంకయ్యనాయుడు అవుతారు అని అంటున్నారు. అన్ని పదవులూ మీకేనా అన్న వారికి జవాబుగా వెంకయ్యనాయుడు రాష్ట్రపతి భవన్ లో అడుగుపెడతారు అని అంటున్నారు. అయితే ఈ రోజుకీ బీజేపీ రాష్ట్రపతి ఎవరో బయటకు రానందువల్ల ఏ క్షణాన ఏమైనా జరగవచ్చు.