Begin typing your search above and press return to search.

టీఆర్ ఎస్ మూసేసింది..కాంగ్రెస్ ఇస్తుందా.?

By:  Tupaki Desk   |   22 Sep 2018 11:13 AM GMT
టీఆర్ ఎస్ మూసేసింది..కాంగ్రెస్ ఇస్తుందా.?
X
దానం నాగేందర్ లాగే టీఆర్ ఎస్ లో చేరి గోషామహల్ నుంచి పోటీచేద్దామని చూసిన కాంగ్రెస్ సీనియర్ నేత ముఖేష్ గౌడ్ ఆశలు ఆవిరైనట్టు ప్రచారం జరుగుతోంది.. దానంను పార్టీలోకి సాదరంగా ఆహ్వానించిన కేసీఆర్.. తాజాగా ముఖేష్ గౌడ్ వస్తానన్నా పట్టించుకోవడం లేదని వార్తలొస్తున్నాయి. ఇప్పటికే కారులో సీట్ల గోల మొదలైంది. అభ్యర్థులను సర్దుబాటు చేయలేక కేసీఆర్ తలపట్టుకుంటున్నారు. ఇప్పుడు ముఖేష్ గౌడ్ వస్తే ఆయనకు టికెట్ ఎక్కడ కేటాయించాలన్నది పెద్ద సమస్యేనని టీఆర్ ఎస్ భావిస్తున్నట్టు తెలిసింది. అందుకే ముఖేష్ వద్దామని ప్రయత్నించినా కేసీఆర్ స్పందించలేదనే వార్తలు గుప్పుమన్నాయి. అయితే దానంతోపాటు వద్దామని చూసిన ముఖేష్ టీఆర్ఎస్ లో చేరడంలో చేసిన జాప్యమే ఆయన కొంప ముంచిందనే గుసగుసలు వినిపిస్తున్నాయి.

ముఖేష్ గౌడ్ తనకు టీఆర్ ఎస్ లో రెండు టికెట్లు కావాలని తనతో పాటు తన కొడుకు విక్రమ్ గౌడ్ కు కూడా టికెట్ కావాలని డిమాండ్ చేశారట.. దీనికి టీఆర్ ఎస్ అధిష్టానం నిరాకరించినట్టు సమాచారం. నిజానికి దానంతో పాటు ముఖేష్ గౌడ్ కూడా చేరితే దానంకు ఖైరతాబాద్ - ముఖేష్ కు గోషామహల్ సీటు ఇద్దామని టీఆర్ ఎస్ ప్రతిపాదన పెట్టిందట.. కానీ ముఖేష్ రెండు సీట్లు కోరడమే పెద్ద ముప్పుగా మారిందని అంటున్నారు.

కాగా ఇప్పుడు ముఖేష్ టీఆర్ ఎస్ లో చేరకపోవడంతో దానం నాగేందర్ ను గోషామహల్ బరిలో దింపి.. సీఎల్పీ మాజీ నేత జనార్ధన్ రెడ్డి కూతురు విజయారెడ్డిని ఖైరతాబాద్ నుంచి పోటీ చేయించాలని కేసీఆర్ భావిస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది. దీంతో హైదరాబాద్ బ్రదర్స్ దానం - ముఖేష్ ల మధ్య టీఆర్ ఎస్ పోటీ పెట్టడం ఖాయంగా కనిపిస్తోంది.

కాంగ్రెస్ లో ఇప్పుడు ముఖేష్ ఏ డిమాండ్ చేయడం లేదట.. టీఆర్ ఎస్ తో సంప్రదించినట్టు వార్తలు లీక్ కావడంతో ఆయన కాంగ్రెస్ అధిష్టానాన్ని ధైర్యంగా కోరని పరిస్థితిని తెచ్చుకున్నారు. అందుకే మిన్నకుండిపోతున్నట్టు తెలిసింది. అయితే ఈ పరిణామాల నేపథ్యంలో కాంగ్రెస్ క్షమించి ముఖేష్ గౌడ్ కు గోషామహల్ టికెట్ ఇస్తుందా లేదా అన్నది హాట్ టాపిక్ గా మారింది.