Begin typing your search above and press return to search.

అంబానీ లేచారు.. అదానీ పడిపోయారు

By:  Tupaki Desk   |   5 April 2023 9:00 PM GMT
అంబానీ లేచారు.. అదానీ పడిపోయారు
X
సరిగ్గా ఏడాది, ఏడాదిన్నర కిందటి వరకు ముఖేశ్ అంబానీ పేరుకు ముందు భారత అపర కుబేరుడు, ప్రపంచ ధనవంతుల్లో ఒకరు అనే విశేషణాలు ఉండేవి. కానీ, ఈ మధ్యకాలంలో చాలా మార్పులు చోటుచేసుకున్నాయి. ఈయన పోటీదారు గౌతమ్ అదానీ అనూహ్యంగా ముందుకు దూసుకొచ్చారు. రెండు, మూడు దశాబ్దాలుగా ఎవరికీ సాధ్యంకాని దానిని ((అంబానీని ఓడించడం)) చేసి చూపారు. ఈ క్రమంలో అదానీ ప్రపంచ ధనవంతుడు, భారత అపర కుబేరుడు ట్యాగ్ లను కొట్టేశారు.

అయితే, రెండు నెలలుగా అదానీ సామ్రాజ్యం ఒడిదొడుకులకు లోనవుతోంది. ముఖ్యంగా హిండెన్ బర్గ్ రీసెర్చి సంస్థ ఇచ్చిన నివేదిక అదానీ గ్రూప్ ను అతలాకుతలం చేసింది. రూ.లక్షల కోట్ల సంపద ఆవిరైపోయింది. కానీ, అంబానీ మాత్రం తనదైన శైలిలో ముందుకుసాగారు.

ఆసియా కిరీటం ఆయనదే..

రిల‌య‌న్స్ సంస్థల అధినేత ముఖేశ్ అంబానీ మళ్లీ పైకి లేచారు. ఆసియా ధ‌నవంతుల జాబితాలో టాప్ లో నిలిచారు. ఫోర్బ్స్ పత్రిక ధ‌న‌వంతుల తాజా జాబితా ప్ర‌కారం ఆయన సంపద 83.4 బిలియ‌న్ డాల‌ర్లు. ఇక ప్ర‌పంచ ధ‌న‌వంతుల జాబితాలో అంబానీ 9వ స్థానంలో నిలిచారు.

గమనార్హం ఏమంటే.. ఆసియా దేశాల ధ‌న‌వంతుల జాబితాలో అదానీ గ్రూప్ సంస్థల ఛైర్మన్ గౌతమ్ అదానీ 24వ స్థానానికి ప‌డిపోయారు. అయితే, భారతీయ ధ‌న‌వంతుల్లో ముఖేశ్, గౌతమ్ 1, 2 స్థానాల్లో ఉన్నారు. హెచ్సీఎల్ అధినేత శివ్ నాడార్ 3వ స్థానం, ఫార్మా సంస్థ సీరం అధినేత సైర‌స్ పూనావాలా 4వ స్థానం, ల‌క్ష్మీ మిత్తల్ 5వ స్ధానం దక్కించుకున్నారు.

70 రోజుల కిందట అలా..

పైన చెప్పుకొన్నట్లు జనవరి వరకు గౌతమ్ అదానీకి ఎదురు లేకుండా పోయింది. జనవరి 24 నాటికి ప్రపంచ అత్యంత సంపన్నుల జాబితాలో ఆయనది 3వ స్థానం. అదానీ ఆస్తుల నికర విలువ 126 బిలియన్‌ డాలర్లు. కానీ, హిండెన్‌బర్గ్ రిపోర్టు త‌ర్వాత అది 47.2 బిలియన్‌ డాలర్లకు పడిపోయింది.

అంటే.. మూడో వంతు తగ్గింది. ఫోర్బ్స్ జాబితా ప్రకారం ప్రపంచంలోని 25 మంది ధనికుల మొత్తం సంపద 2100 బిలియన్ డాలర్లు. ఇది 2022లో 2300 బిలియన్ డాలర్లు. ఇక గత సంవ‌త్స‌రంతో పోలిస్తే ప్రపంచంలో బిలియనీర్ల సంఖ్య తగ్గింది. అయినప్పటికీ భారత్‌ నుంచి బిలియనీర్ల సంఖ్య పెరిగింది. 2022లో ఈ నంబరు 166 కాగా.. ఈ ఏడాది 169 కావడం విశేషం. ఇక అత్యధిక బిలియనీర్లు అమెరికాలో ఉండ‌గా, త‌రువాత చైనా, భార‌త్ లో ఉన్నారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.