Begin typing your search above and press return to search.

స్మార్ట్​ విద్యుత్​ మీటర్లు .. అంబానీ మరో కొత్త వ్యాపారం

By:  Tupaki Desk   |   14 Oct 2020 12:10 PM GMT
స్మార్ట్​ విద్యుత్​ మీటర్లు .. అంబానీ మరో కొత్త వ్యాపారం
X
రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ మరో కొత్త వ్యాపారంలోకి అడుగుపెట్టబోతున్నాడు. ఇప్పటికే మొబైల్ నుంచి చమురు రంగం వరకు అన్నిరకాల వ్యాపారాల్లో ప్రవేశించిన అంబానీ తాజాగా స్మార్ట్ ఎలక్ట్రిసిటీ మీటర్ వ్యాపారంలోకి అడుగు పెట్టనున్నారు. అడ్వాన్స్డ్ మీటరింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వ్యాపారంపై రిలయన్స్​ సంస్థ దృష్టి సారించింది. నారో బ్యాండ్ ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ ద్వారా సేవలు అందించాలని రిలయన్స్​ భావిస్తున్నది. దేశవ్యాప్తంగా ప్రస్తుతం 25 కోట్ల సంప్రదాయ మీటర్లు ఉన్నాయి. అయితే వీటి స్థానంలో స్మార్ట్​ మీటర్లను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఈ ప్రభుత్వ ప్రాజెక్ట్​ను దక్కించుకోవాలని రిలయన్స్ ప్రయత్నిస్తున్నది.

స్మార్ట్ ఎలక్ట్రిసిటీ మీటర్ మార్కెట్ పైన రిలయన్స్ తమ అనుబంధ సంస్థ జియో సాయంతో మీటర్ డేటా సేకరణ, కమ్యూనికేషన్ కార్డులు, టెలికం, క్లౌడ్ హోస్టింగ్ సేవల్ని విద్యుత్ పంపిణీ కంపెనీలకు/డిస్కంలకు అందించాలని భావిస్తోంది. రిలయన్స్ అందించే సేవల్లో మీటర్ డేటా కలెక్షన్, కమ్యూనికేషన్ కార్డ్స్, టెలికం, క్లౌడ్ హోస్టింగ్ వంటి సేవలు ఉన్నాయని చెబుతున్నారు. స్మార్ట్ మీటర్ల ద్వారా మీటరింగ్, బిల్లింగ్, కలెక్షన్ వ్యవస్థలో మానవ జోక్యాన్ని తగ్గిస్తాయి. లాస్ పాకెట్స్ గుర్తించడం ద్వారా నష్ట నివారణ చర్యలను తగ్గిస్తాయి.

వినియోగదారుల విద్యుత్ వినియోగాన్ని ప్రతిరోజు వేర్వేరు సమయాల్లో రికార్డ్ చేస్తాయి. ఓవర్ ది ఎయిర్ కమ్యూనికేషన్ టెక్నాలజీ ద్వారా ఈ సమాచారాన్ని ఇంధన సరఫరాదారుకు పంపిస్తాయి. విద్యుత్ వినియోగంపై మరింత సమాచారం తెలుస్తుంది. ముఖేష్ అంబానీ వివిధ రంగాల్లోకి అడుగు పెడుతుండటంతో రిలయన్స్ స్టాక్ గణనీయంగా పెరుగుతోంది. మంగళవారం స్టాక్​ విలువ రూ.2,280 వద్ద క్లోజ్ అయింది. బుధవారం రూ.2300 చేరుకుంది.