Begin typing your search above and press return to search.

అరుదైన క్లబ్ లోకి ఎంట్రీ ఇచ్చిన ముకేశ్ అంబానీ

By:  Tupaki Desk   |   10 Oct 2021 5:53 AM GMT
అరుదైన క్లబ్ లోకి ఎంట్రీ ఇచ్చిన ముకేశ్ అంబానీ
X
రికార్డుల మీద రికార్డుల్ని క్రియేట్ చేస్తూ.. భారత దేశంలో తాను తప్పించి మరెవరికీ సాధ్యం కాదన్నట్లుగా వ్యవహరిస్తున్నారు ఆసియా కుబేరుడు.. రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ లిమిటెడ్‌ ఛైర్మన్ గా వ్యవహరిస్తున్న ముకేశ్ అంబానీ మరో అరుదైన రికార్డును తన సొంతం చేసుకున్నారు. ప్రపంచంలో వంద బిలియన్ డార్లు.. అంతే మన రూపాయిల్లో చెప్పాలంటే ఏకంగా రూ.7.50లక్షల కోట్ల ఆస్తి ఉన్న వారు అతి కొద్దిమందే.

మరింత స్పష్టంగా చెప్పాలంటే ఇంతటి ఆస్తి ఉన్న వారు మహా అయితే ఒక డజను మంది ఉంటారేమో? అలాంటి డజను మందిలో ముకేశ్ అంబానీ ఒకరు కావటం వివేషం. బ్లూంబర్గ్ బిలియనీర్స్ రియల్ టైం లిస్టు ప్రకారం శుక్రవారం నాటికి ముకేశ్ నెట్ వర్త్ 10,100 కోట్ల డాలర్లకు చేరుకున్నట్లుగా చెబుతున్నారు. దీంతో ఆయన 100 బిలియన్ డాలర్ల క్లబ్ లోకి ఎంట్రీ ఇచ్చినట్లైంది.

కరోనా కారణంగా పలువురు తీవ్రంగా దెబ్బ తిని.. పలు దేశాలు ఆర్థికంగా దెబ్బ తిన్న వేళ.. అందుకు భిన్నంగా ముకేశ్ అంబానీకి మాత్రం కలిసి వచ్చింది. కరోనా టైంలో ఆయన ఆస్తి విలువ పెరగ్గా.. ఈ ఏడాది వరకు చూస్తే.. ఇప్పటివరకు ఆయన ఆస్తి రూ.2380 కోట్లకు పెరగటం గమనార్హం. తాజాగా విడుదల చేసిన 100 బిలియన్ డాలర్ల క్లబ్ లో పదకొండు మంది ఉండగా.. పదకొండో వ్యక్తి ముకేశ్ అంబానీనే. ఇక.. టెస్లా కార్ల కంపెనీ అధినేత ఎలాన్ మస్క్ 22,200 కోట్ల డాలర్ల సంపదతో ప్రపంచంలో అత్యంత సంపన్నుడిగా కొనసాగుతున్నారు. అంతే.. ముకేశ్ అంబానీ ఆస్తికి దాదాపు రెట్టింపు సంపద అన్నమాట.

మరో ఆసక్తికరమైన విషయం ఏమంటే.. 20వేల కోట్ల డాలర్ల నెట్ వర్త్ ఉన్న ఏకైక సంపన్నుడు మస్క్ మాత్రమే. ఎలన్ మస్క్ తర్వాత రెండో స్థానంలో ఉన్న అమెజాన్ అధిపతి ఆస్తి 19,100 కోట్ల డాలర్లు. అంటే.. 20వేల కోట్ల డాలర్ల క్లబ్ లోకి ఆయన ఎంట్రీ ఇవ్వాలంటే మరో 900 కోట్ల డాలర్ల మేర ఆయన ఆస్తి పెరగాల్సి ఉంటుంది.