Begin typing your search above and press return to search.

‘అంబానీ బాంబు’ కేసుపై మరో బాంబు

By:  Tupaki Desk   |   9 March 2021 5:30 AM GMT
‘అంబానీ బాంబు’ కేసుపై మరో బాంబు
X
దేశంలోనే నంబర్ 1 ధనవంతుడు, అపర కుబేరుడు అయిన ముఖేష్ అంబానీ ఇంటికి బాంబు బెదిరింపు కేసులో అనూహ్య పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. అంబానీ ఇంటి వద్ద పేలుడు పదార్థాలను నిలిపిన వాహనం యజమాని అనుమానాస్పద స్థితిలో చనిపోవడం సంచలనంగా మారింది.

ఇప్పుడు ఈ కేసులను నేరుగా కేంద్రప్రభుత్వమే దర్యాప్తు చేస్తుండడంపై సాక్ష్యాత్తూ మహారాష్ట్ర సీఎం ఉద్దవ్ ఠాక్రే అనుమానాలు వ్యక్తం చేయడం మరింత సంచలనంగా మారింది.

రియలన్స్ అధినేత ముఖేష్ అంబానీ ఇంటి వద్ద బాంబులతో కూడిన వాహనం కేసును కేంద్రం తన ఆధీనంలోకి తీసుకోవడం అనుమానాలు రేకెత్తిస్తోంది. ఈ కేసును ఎన్ఐఏకు అప్పగిస్తూ కేంద్ర హోంశాఖ ఆదేశాలు జారీ చేయడం సంచలనమైంది.

ఇప్పటివరకు ఈ కేసును మహారాష్ట్ర ఉగ్రవాద వ్యతిరేక స్వ్కాడ్ (ఏటీఎస్) దర్యాప్తు చేసింది. ఆ వాహన యజమాని మన్ సుఖ్ హిరెన్ అనుమానాస్పద మరణంపై కూడా తామే దర్యాప్తు చేస్తామని ఎన్ఐఏ అధికారులు తెలపడంపై మహారాష్ట్ర సీఎం ఉద్దవ్ ఠాక్రే అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

తాజాగా అంబానీ బాంబు కేసుపై మహారాష్ట్ర సీఎం ఉద్దవ్ ఠాక్రే సంచలన వ్యాఖ్యలు చేశారు. కేంద్రం తీరు చూస్తుంటే ఏదో తెలియని కుట్ర దాగున్నట్లుగా అనిపిస్తోందని ఆయన అనుమానం వ్యక్తం చేశారు. కేసును ఎన్ఐఏ తీసుకున్నంత మాత్రాన ముంబై ఏటీఎస్ దీన్నుంచి తప్పుకోదని.. సమాంతర దర్యాప్తు కొనసాగుతుందని సంచలన ప్రకటన చేశారు.

ముంబైలో చనిపోయిన దాద్రానగర్ ఎంపీ మోహన్ కేసులో కేంద్రం నోరు మెదపడం లేదని.. అంబానీ కేసును అనూహ్యంగా తీసుకుందని.. కాబట్టి దీనిపై ముంబై పోలీసులు కూడా దర్యాప్తు చేస్తామని మహారాష్ట్ర సీఎం స్పష్టం చేశారు.

ఫిబ్రవరి 25న పేలుడు పదార్థాలతో నిండిన వాహనం.. అందులో ఒక లేఖ అంబానీ ఇంటి వద్ద కలకలం రేపింది. ఆ వాహనం యజమాని చనిపోవడం కేసును జఠిలం చేసింది. ఎఫ్ఐఆర్ కూడా దాఖలు చేశారు. సోమవారం కేంద్రం ఈ కేసును తీసుకోవడంపై మహారాష్ట్ర ప్రభుత్వం అనుమానాలు వ్యక్తం చేసింది.