Begin typing your search above and press return to search.

కనక దుర్గ ఫ్లైఓవర్ ప్రారంభోత్సవానికి ముహూర్తం ఖరారు..ఎప్పుడంటే?

By:  Tupaki Desk   |   5 Sep 2020 5:00 AM GMT
కనక దుర్గ ఫ్లైఓవర్ ప్రారంభోత్సవానికి ముహూర్తం ఖరారు..ఎప్పుడంటే?
X
బెజవాడలో కనక దుర్గమ్మ గుడి ఫ్లైఓవర్ ప్రారంభోత్సవానికి ముహూర్తం ఫిక్స్ అయింది. ఈ నెల 18న కనక దుర్గ ఫ్లైఓవర్‌ని ప్రారంభించబోతున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. ఈ ఫ్లై ఓవర్ ను రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, కేంద్ర ఉపరితల రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ కలిసి ప్రారంభించబోతున్నారు. ‌క‌రోనా మహమ్మారి నేప‌థ్యంలో ఢిల్లీ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా‌ కేంద్రమంత్రి గడ్కరీ ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. అయితే, ఈ దుర్గ గుడి ఫ్లై ఓవర్ ప్రారంభోత్సవానికి తొలుత ఈ నెల 4న ముహూర్తం ఖరారు చేశారు. కానీ, అనుకోని రీతిలో అనారోగ్యం కారణంగా మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ మరణించడంతో.. ప్రభుత్వం సంతాప దినాలను ప్రకటించారు. ఈ రోజుల్లో ఎలాంటి కొత్త పనులు, ప్రారంభోత్సవాలు చేయకూడదు. దీంతో ఈ ఫ్లైఓవర్ ప్రారంభోత్సవం వాయిదా పడిన సంగతి తెలిసిందే.

కాగా 2015లో అప్పటి టీడీపీ ప్రభుత్వం హయాంలోనే కేంద్ర ప్రభుత్వ నిధులతో కనకదుర్గ ఫ్లైఓవర్ నిర్మాణం ప్రారంభమైంది. తాజాగా వైసీపీ ప్రభుత్వం ఈ ఫ్లై ఓవర్ పనులని పూర్తి చేసింది. ఇక అదే రోజు రూ. 7,584 కోట్ల విలువైన 16 ప్రాజెక్టులకు భూమి పూజతో పాటు 887 కిలోమీటర్లు రోడ్ల నిర్మాణానికి ఈ ఇద్దరు శంకుస్థాపనలు చేయనున్నారు. రూ. 8,083 కోట్ల విలువైన 10 ప్రాజెక్టులను కేంద్రమంత్రి గడ్కరీతో క‌లిసి సీఎం వైఎస్ జగన్ జాతికి అంకితం చేయనున్నారు