Begin typing your search above and press return to search.

ముద్రగడ వైసీపీలో చేరకుంటే బెటర్...?

By:  Tupaki Desk   |   26 Jun 2023 7:00 AM GMT
ముద్రగడ వైసీపీలో చేరకుంటే బెటర్...?
X
ముద్రగడ పద్మనాభం గురించి కొత్తగా చెప్పాల్సింది లేదు. ఆయన కాపుల కోసం దశాబ్దాలుగా పోరాడుతున్న నాయకుడుగా ఉన్నారు. పైగా మాజీ మంత్రి, ఎంపీగా పనిచేశారు. ఇదిలా ఉంటే కాపులను బీసీల్లో చేర్చాలన్న దాని మీద ముద్రగడ ఉద్యమం చేసినపుడు నాటి సీఎం టీడీపీ అధినేత చంద్రబాబుతో వైరం పెరిగింది. దాంతో పాటు టీడీపీతో బాబుతో సన్నిహితంగా జనసేన ఉంటుందన్న దాంతో పవన్ కళ్యాణ్ మీద కూడా ముద్రగడకు ఆగ్రహం ఉంది అని అంటున్నారు.

గోదావరి జిల్లాలలో వారాహి యాత్ర సందర్భంగా పవన్ ముద్రగడల మధ్య ఒక స్థాయిల రగడ రాజకీయ రచ్చ చోటు చేసుకుంది. ఇదిలా ఉంటే పవన్ కళ్యాణ్ తో పోటీ పడడానికి నేను రెడీ అని ముద్రగడ సవాల్ చేశారు పిఠాపురం నుంచి తాను పోటీకి దిగుతాను అని పవన్ సిద్ధమేనా అని ముద్రగడ చాలెంజ్ చేశారు.

దీని మీద పవన్ నుంచి ఇప్పటిదాకా అయితే ఏ రకమైన రెస్పాన్స్ రాలేదు. ఇదిలా ఉంటే ముద్రగడ పిఠాపురం నుంచి పోటీ అంటున్నారు అంటే ఆయన పార్టీ ఏది అన్న చర్చ కూడా వస్తోంది. ఆయన వైసీపీ నుంచి పోటీ చేస్తారన్న ప్రచారం కూడా సాగుతోంది. ఆయనను తమ పార్టీలో చేర్చుకునేందుకు వైసీపీ కూడా సిద్ధంగా ఉందని అంటున్నారు.

అయితే ముద్రగడ వైసీపీలో చేరడం వల్ల లాభమా నష్టమా అన్న చర్చ వస్తోంది. ముద్రగడ ఎటూ బాబుకు వ్యతిరేకంగా ఉంటారని తెలుసు. ఇపుడు పవన్ తో సవాల్ చేసి జనసేనకు ఆయన యాంటీ అని చెప్పకనే చెప్పారు. అందువల్ల గోదావరి జిల్లాల్లో ముద్రగడ వర్గం అంతా ఎటూ వైసీపీ వైపే ఉంటారని అంటున్నారు. కాపుల ఓట్లలో చీలిక వస్తే ముద్రగడ వర్గం ఓట్లు కచ్చితంగా వైసీపీకి ఎటూ పడతాయి.

అందువల్ల ఆయన పార్టీలో చేరడం వల్ల ప్రత్యేకంగా లాభం ఏమైనా ఉంటుందా అన్నదే పాయింట్. ముద్రగడ న్యూట్రల్ గా ఉంటేనే వైసీపీకి ఎంతో మేలు అని అంటున్నారు. ఇప్పటికే జనసేన వర్గాలు ముద్రగడను పట్టుకుని పద్మనాభ రెడ్డి అని పేరు మార్చేశారు. ఆయన కాపులను వైసీపీకి తాకట్టు పెట్టేశారు అని కూడా ఘాటైన విమర్శలు చేశారు.

దాన్ని నిజం చేసేలా ముద్రగడ వైసీపీలో చేరితే ఆయన వర్గం ఓట్లు పడినా కాపుల్లో తటస్థుల ఓట్లు మాత్రం వైసీపీకి కాకుండా పోతాయని అంటున్నారు. ఇప్పటిదాకా ముద్రగడ వైసీపీ మనిషే అని విపక్షాలు చేస్తున్న ప్రచారం వాస్తవం అని చెప్పినట్లు అవుతుంది అని అంటున్నారు. అది ఏ రకంగానూ ముద్రగడకు కానీ వైసీపీకి కానీ మంచిది కాదనే వారూ ఉన్నారు.

మరో విషయం తీసుకుంటే సీనియర్ మోస్ట్ లీడర్ గా ఉన్న ముద్రగడ పద్మనాభం వైసీపీలో ఇమడగలరా అన్న చర్చ కూడా ఉంది. ఆయనకు మంత్రి పదవి ఇచ్చినా ఆయన స్వతంత్రంగానే ఉంటారు. ఆయనకు ఏ మాత్రం ఇబ్బంది అనిపించినా రాజీనామా అస్త్రాన్ని ప్రయోగిస్తారు ఆయన పట్టుదల అలాంటిది. అందువల్ల ముద్రగడను హ్యాండిల్ చేయడం ఒక పార్టీ చట్రంలో ఉంచడం వైసీపీ వల్ల కాదనే వారు కూడా ఉన్నారు.

అయితే వైసీపీ మాత్రం ముద్రగడ రాజకీయం కంటే ఆయన మద్దతు తీసుకుని ఆయన కుమారుడిని తమ పార్టీలో చేర్చుకుంటే రెండిందాల లాభం కలుగుతుంది అని ఆలోచిస్తోంది అని అంటున్నారు. అపుడు విపక్షాల్కు కూడా నేరుగా ముద్రగడను ఏమీ అనలేని పరిస్థితి ఉంటుందని అంటున్నారు. ముద్రగడ కూడా పవన్ పోటీ చేస్తేనే తాను పిఠాపురం నుంచి బరిలో ఉంటాను అని అంటున్నారు. పవన్ పోటీ చేయకపోతే ఆయన రాజ్కేఎయాల్లో ఉండరనే అంటున్నారు. మొత్తం మీద చూస్తే ముద్రగడ కూడా తన తటస్థ విధానాన్నే కొనసాగిస్తారు అనే అంటున్నారు.