Begin typing your search above and press return to search.

త్వరలో ముద్రగడ పాదయాత్ర?

By:  Tupaki Desk   |   20 Sept 2016 12:25 PM IST
త్వరలో ముద్రగడ పాదయాత్ర?
X
కాపులను బీసీలలో చేర్చాలన్న డిమాండ్‌ తో ఉద్యమం నిర్వహిస్తున్న మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం మరోసారి చంద్రబాబు ప్రభుత్వానికి సవాల్ విసరడానికి సిద్ధమవుతున్నట్లుగా తెలుస్తోంది. అందుకోసం ఆయన తెలుగు రాష్ట్రాల్లో హిట్ ఫార్ములాగా ప్రసిద్ధి చెందిన పాదయాత్రను ఎంచుకుంటున్నట్లు సమాచారం. నవంబర్‌లో ఆంధ్రప్రదేశ్‌ లోని అన్ని జిల్లాల్లోనూ పాదయాత్ర నిర్వహించేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. ఆలోగా నియోజకవర్గ స్థాయిలో కాపు జేఏసీ(జాక్) కమిటీలను పూర్తి చేయాలని నిర్ణయించారు.

రాజమండ్రిలో ఇటీవల ముద్రగడ నిర్వహించిన ఏపి కాపు జేఏసీ నేతల సమావేశంలో కొన్ని కీలక సూచనలు వ్యక్తమయ్యాయి. కాపులను బీసీల్లో చేర్చేందుకు ఏం చేయాలో సూచించాలంటూ ఒక ఫార్మేట్‌ ను అందించారు. దానికితోడు - నేతల నుంచి కూడా సలహాలు స్వీకరించారు. సమావేశంలో పాల్గొన్న ఐదారువేల మంది కాపు జిల్లా ప్రతినిధులు ముద్రగడ పాదయాత్ర చేయటం ద్వారానే అనైక్యతతో ఉన్న కాపులను కదిలించడం సాధ్యమవుతుందన్న సూచనలు చేశారు. జాక్ అగ్రనేతలు సైతం దానినే బలపరుస్తున్నారు. మరోవైపు ప్రధానంగా తెదేపాకు మద్దతునిస్తూ - ముద్రగడపైనా - ఇతర కాపు నేతలపైనా విమర్శలు చేస్తున్న వారిని కులబహిష్కరణ చేయాలని జాక్ భావిస్తోంది.

పాదయాత్ర సందర్భంగా ప్రతి వారం ఒక వినూత్న నిరసన కార్యక్రమం రూపొందించేలా ప్రణాళిక రచిస్తున్నారు. అధికారులు - ప్రజాప్రతినిధులకు వినతిపత్రాలు - సత్యాగ్రహం - కంచాలతో శబ్దాలు వంటి శాంతియుత కార్యక్రమాలు నిర్వహించాలని యోచిస్తున్నారు. ప్రధానంగా తెదేపాలో అసంతృప్తిగా ఉన్న కాపు నేతలను కూడా ఉద్యమంలోకి తీసుకురావాలని భావిస్తున్నారు. ఇప్పటివరకూ తెదేపా మినహా అన్ని పార్టీల నేతలూ జాక్ సమావేశాలకు హాజరవుతున్నారు. ముద్రగడ పాదయాత్ర మొదలైతే కాపు ఉద్యమం చంద్రబాబు మరింత ఇరుకునపెట్టే అవకాశం ఉంది.