Begin typing your search above and press return to search.

ముద్ర‌గ‌డ చెప్పిన‌ట్లే బాబుకు ఆ స‌మ‌స్య ఉందా?

By:  Tupaki Desk   |   20 Jun 2017 4:02 PM GMT
ముద్ర‌గ‌డ చెప్పిన‌ట్లే బాబుకు ఆ స‌మ‌స్య ఉందా?
X
తెలుగుదేశం పార్టీ అధ్య‌క్షుడు - ఏపీ ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు గురించి కాపు రిజ‌ర్వేష‌న్ల పోరాట స‌మితి నాయ‌కుడు - మాజీ మంత్రి ముద్ర‌గ‌డ ప‌ద్మ‌నాభం ఆస‌క్తిక‌ర‌మైన వ్యాఖ్య‌లు చేశారు. త్వ‌ర‌లో పాద‌యాత్ర చేసేందుకు సిద్ధ‌మ‌వుతున్న ముద్ర‌గ‌డ తాజాగా త‌న సామాజిక‌వ‌ర్గం నేత‌ల‌తో స‌మావేశం అయ్యారు. ఈ సంద‌ర్భంగా ఆస‌క్తిక‌ర‌మైన వ్యాఖ్య‌లు చేశారు. బాబుకు మ‌తిమ‌రుపు ఉంద‌ని ముద్ర‌గ‌డ వ్యాఖ్యానించారు. త‌న మ‌తిమ‌రుపుతో ఇచ్చిన హామీల‌ను ప‌క్క‌న‌పెట్టేసిన చంద్ర‌బాబుకు వాటిని గుర్తుచేసేందుకు పాద‌యాత్ర చేస్తున్న‌ట్లు వివ‌రించారు.

కాపు రిజర్వేషన్లపై ప్రభుత్వంతో తాడోపేడో తేల్చుకునేందుకు సన్నద్ధమవుతున్న ముద్ర‌గ‌డ ఇందులో భాగంగా వచ్చేనెల 26వ తేదీన తూర్పుగోదావరి జిల్లా కిర్లంపూడి నుంచి రాజధాని అమరావతికి పాదయాత్ర నిర్వహిస్తున్నారు. ఇప్పటి వరకు రెండుసార్లు తలపెట్టిన పాదయాత్రను ప్రభుత్వం అడ్డుకున్న నేపథ్యంలో ఈ సారి శాంతియుతంగా పూర్తిచేయాలనే పట్టుదలతో ఉన్నారు. ఈ క్ర‌మంలో తాజాగా త‌నతో క‌లిసివ‌చ్చే నేత‌ల‌తో స‌మావేశం అయ్యారు. ఈ సంద‌ర్బంగా ముద్ర‌గ‌డ మాట్లాడుతూ రిజ‌ర్వేష‌న్ల‌ పై చంద్ర‌బాబు మోసం చేశార‌ని మండిప‌డ్డారు. టీడీపీ అధినేత చంద్ర‌బాబు ఎన్నిక‌ల స‌మ‌యంలో హామీ ఇచ్చిన కాపులకు బీసీ రిజ‌ర్వేష‌న్‌ విష‌యంలో మాట నిల‌బెట్టుకోలేద‌ని ముద్ర‌గ‌డ ఆరోపించారు. కాపుల‌కు బీసీ కోటా క‌ల్పించాల‌నే మాట‌ను విస్మ‌రించిన బాబుకు ఆ హామీని గుర్తు చేసేందుకు యాత్ర చేప‌ట్టిన‌ట్లు తెలిపారు. అన్ని పార్టీల‌ను క‌లుపుకొని పోరాటం చేయ‌నున్న‌ట్లు ముద్ర‌గ‌డ ప్ర‌క‌టించారు. ప్రభుత్వం ఏర్పాటై ఇప్పటికి మూడేళ్లు పైబడినా కాపు రిజర్వేషన్‌ కు సంబంధించి ఎలాంటి ప్రకటన చేయలేదని, కార్పొరేషన్‌ తోనే సరిపెడుతున్నారనే వ్యాఖ్యానించారు. రాజధానికి పాదయాత్ర చేయటం ద్వారా ఇక ప్రభుత్వంతో తాడోపేడో తేల్చుకోనున్న‌ట్లు వెల్ల‌డించారు.

ఈ సంద‌ర్భంగా పాద‌యాత్ర‌కు సంబందించిన రూట్‌మ్యాప్ కూడా ఇప్పటికే సిద్ధమైంది. జిల్లాల వారీగా ముఖ్యనేతలతో మంతనాలు జరుపుతున్నారు. ఈ క్ర‌మంలో ముందుగా ఉభయగోదావరి జిల్లా నేతలతో సమావేశమై చర్చించారు. అనంత‌రం కృష్ణా - గుంటూరు జిల్లాల నేతలతో సమావేశం అయ్యారు. జిల్లాకు 20 మంది చొప్పున 13 జిల్లాల నుంచి పాదయాత్రకు జేఏసీ నేతలను కూడగట్టి 450 కిలోమీటర్ల మేర పాదయాత్ర జరపాలని నిర్ణయించారు. కిర్లంపూడి నుంచి భీమవరం - తణుకు - తాడేపల్లిగూడెం - తదితర ముఖ్యపట్టణాలు - కాపు గ్రామాలను కలుపుకుంటూ పాదయాత్రకు సమాయత్తమవుతున్నారు. రావులపాలెం నుంచి అంతర్వేది వరకు పాదయాత్రకు పిలుపు ఇచ్చిన నేపథ్యంలో ప్రభుత్వం గృహనిర్బంధం చేయటంతో అప్పట్లో యాత్రను వాయిదా వేసుకున్నారు. మ‌రోవైపు మ‌ద్ద‌తు కూడ‌గ‌ట్ట‌డంతో భాగంగా ఇటీవల ప్రజా గాయకుడు గద్దర్‌ ను కూడా ముద్రగడ కలిసి మద్దతు కోరారు. బీసీ సంఘాల నేతలతో సమన్వయ సమావేశాలు నిర్వహిస్తున్నారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/