Begin typing your search above and press return to search.

ముందైతే దీక్ష..తర్వాతే బాబు ప్రతిపాదనలపై దృష్టి

By:  Tupaki Desk   |   5 Feb 2016 2:29 AM GMT
ముందైతే దీక్ష..తర్వాతే బాబు ప్రతిపాదనలపై దృష్టి
X
కాపుల్ని బీసీల్లోకి చేర్చాలన్న ప్రధాన డిమాండ్ తో కాపునేత.. మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం తన కుటుంబ సభ్యులతో ఆమరణదీక్షకు సిద్ధమవుతున్నారు. కాపుల్ని బీసీల్లోకి చేర్చటం.. కాపుల సంక్షేమానికి రూ.2వేల కోట్లు ఇవ్వాలన్న ప్రధాన డిమాండ్లతో తాను నిరసనదీక్ష చేపట్టనున్నట్లు తేల్చేశారు. తూర్పుగోదావరి జిల్లా కిర్లంపూడిలో తన భార్యతో కలిసి ఉదయం 9 గంటలకు ముద్రగడ దీక్షకు కూర్చోనున్నారు. ఈ నేపథ్యంలోభారీ భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు.

దీక్ష హింసాత్మకంగా మారకుండా ఉండేలా ముందస్తు జాగ్రత్తలు చేపట్టారు. తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా 114సెక్షన్ విధింపు.. పలు పట్టణాల్లో దాదాపు 10వేల మంది పోలీసుల్ని మొహరించారు. ముద్రగడ దీక్షకు సంఘీభావం తెలుపుతూ పలుచోట్ల కాపు సామాజిక వర్గ నేతలు దీక్షలు చేపట్టనున్నారు. ముద్రగడ చేత దీక్ష విరమించేందుకు ఏపీ సర్కారు చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి.

మరోవైపు.. తమకు సంఘీభావంగా ఎవరూ కిర్లంపూడి వద్దకు రావద్దని.. తమ ఇళ్ల వద్దే మధ్యాహ్న భోజనం మానేయాలని పిలుపునిచ్చారు. ఉద్యమంలో అసాంఘిక శక్తులు చొరబడేందుకు సిద్దంగా ఉన్నాయని.. అందుకే తన ఇంటి వద్దకు రావొద్దని కోరుకుంటున్నట్లు పేర్కొనటం గమనార్హం. ముద్రగడ చేత దీక్ష విరమించేలా చేయటం కోసం టీడీపీ నేతల బృందం ఆయన వద్దకు వచ్చింది. గురువారం రాత్రి 9 గంటల పరాంతంలో కిర్లంపూడిలో ముద్రగడను కలిసి.. 2 గంటల పాటు ఆయనతో చర్చించారు. అయినప్పటికీ.. ముద్రగడ సానుకూలంగా స్పందించలేదు.

తాను ముందు చెప్పినట్లు దీక్ష స్టార్ట్ చేస్తానని.. ముఖ్యమంత్రి చంద్రబాబు నుంచి వచ్చిన ప్రతిపాదనలు తనకు సమ్మతమని తనకు సంతృప్తి కలిగిస్తే దీక్ష విరమిస్తానని ముద్రగడ పేర్కొనటం గమనార్హం.