Begin typing your search above and press return to search.
బాబూ... ముద్రగడ ప్రశ్న విన్నారా?
By: Tupaki Desk | 13 Aug 2017 7:58 AM GMTకాపు ఐక్య వేదిక నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం నిర్వహించతలపెట్టిన అమరావతి పాదయాత్రకు ఎక్కడికక్కడ బ్రేకులు పడిపోతూనే ఉన్నాయి. వరుసగా 18 రోజుల పాటు తూర్పుగోదావరి జిల్లా కిర్లంపూడిలోని తన స్వగృహం నుంచి ముద్రగడ పాదయాత్రకంటూ బయటకు రావడం, అక్కడే మకాం పెట్టిన పోలీసులు ఆయనను అడ్డుకోవడం నిత్యకృత్యంగా మారిపోయింది. నిన్న కూడా ఆయన పాదయాత్రకు సిద్ధం కాగా... అనుమతి లేదంటూ పోలీసులు ఆయనకు అడ్డు పడ్డారు. ఈ సందర్భంగా పోలీసులు, ఏపీ ప్రభుత్వ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తూనే... ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడికి సూటి ప్రశ్నలు సంధించారు.
కాపులను బీసీల్లో చేర్చి రిజర్వేషన్లు కల్పిస్తామంటూ గడచిన ఎన్నికల సందర్భంగా టీడీపీ ఇచ్చిన హామీ ఆ పార్టీ నేతృత్వంలోని ప్రభుత్వానికి గుర్తు చేసేందుకే తానీ పాదయాత్ర చేస్తున్నానని పేర్కొన్నారు. అయినా రాష్ట్రంలో ప్రజాస్వామ్య పాలన సాగుతోందా?, నియంతృత్వ పాలన సాగుతోందా? అని ముద్రగడ ప్రశ్నించారు. పౌరులు అడిగే ప్రశ్నలకు ప్రభుత్వం సమాధానం ఇవ్వాల్సిన అవసరం లేదా? అని కూడా ముద్రగడ కాస్తంత సూటిగానే ప్రశ్నించారు. తమ జాతికి ఇచ్చిన హామీలను గుర్తు చేయడం కోసం శాంతియుతంగా పాదయాత్ర చేపడితే.. కేసులు నమోదు చేశారని.. ఆ కేసులను కోర్టుకు అప్పగిస్తే అక్కడైనా బాధలు చెప్పుకుంటామని ఆవేదన వ్యక్తం చేశారు. ఎంత కాలం అడ్డుకున్నా పాదయాత్రను ఆపే ప్రసక్తే లేదన్నారు. రాష్ట్రంలో గుడ్డిపాలన కొనసాగుతోందని, దానికి నిరసనగా తలకు నల్ల ముసుగులు ధరించి నిరసన తెలియజేశారు.
జేఏసీ నాయకుల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున చంద్రబాబుకు వ్యతిరేకంగా, ముద్రగడకు మద్దతుగా నినాదాలు చేశారు. పాదయాత్రకు తక్షణమే అనుమతి ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ముద్రగడ సంధించిన ప్రశ్నలు జనాన్ని నిజంగానే ఆలోచనలో పడేశాయన్న వాదన వినిపిస్తోంది. ప్రజలెన్నుకున్న ప్రభుత్వం పౌరులు సంధించే ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సిన బాధ్యతను ఎలా విస్మరిస్తుందన్నది ఇప్పుడు ముద్రగడ లేవనెత్తిన అంశం. మరి ఈ ప్రశ్నలకు టీడీపీ సర్కారు ఏం సమాధానం చెబుతుందో చూడాలి.