Begin typing your search above and press return to search.

లేటుగా అయినా లేటెస్టుగా.... అంబేద్కర్ గ్రేట్ అంటూ !

By:  Tupaki Desk   |   8 Aug 2022 3:30 PM GMT
లేటుగా అయినా లేటెస్టుగా.... అంబేద్కర్ గ్రేట్ అంటూ !
X
ఆయన పేరు ముద్రగడ పద్మనాభం. ఆయనకు పెద్దగా రాజకీయ అపేక్ష లేదు. ఉంటే ఈ పాటికి సీఎం కాకపోవచ్చు కానీ రేసులో మాత్రం కచ్చితంగా ఉండేవారు. ఆ తరువాత పొజిషన్ కి ఏనాడో వచ్చేవారు. ఆయన మనిషిగా మంచివారు. లాజిక్ తోనే మాట్లాడుతారు. నిజాయతీగా ఉంటారు. మొండి మనిషి అని కూడా పేరు. అయితే ముద్రగడ కొన్నిసార్లు సకాలంలో స్పందించాల్సిన చోట సైలెంట్ అవుతారు. అది వ్యూహం అనుకుంటారు కానీ ఆయన్ని చూస్తే ఎందుకో ఆ మాట అనబుద్ధి వేయదు.

ఆయనకు అలాంటి వ్యూహాలు ఉంటే ముందే చెప్పుకున్నట్లుగా కెరీర్ ఎక్కడో ఉండేది. అయితే ఆయన మనసులో భావాలను మాత్రం ఏదోనాడు బయటపెట్టుకుంటారు. తాను స్వేచ్చాజీవిని అని చెప్పడమే కాదు ఆ స్వేచ్చను ఆయన అనుభవిస్తూ అమలులో కూడా పెడతారు. ఇక ముద్రగడ పద్మనాభం కోనసీమ జిల్లాకు అంబేద్కర్ పేరు కానీ అక్కడ పుట్టి లోక్ సభ స్పీకర్ గా పనిచేసిన జీఎంసీ బాలయోగి పేరు కానీ పెట్టమని చాలాకాలం క్రితమే వైసీపీ ప్రభుత్వానికి ఒక లేఖ రాశారు.

అయితే ఆ లేఖకు రియాక్షన్ అనుకోవాలో లేక వైసీపీ నేతల వత్తిడి కూడా ఉందో లేక వైసీపీ మరే విధంగా ఆలోచించిందో కానీ కొన్ని నెలల క్రితం కోనసీమకు అంబేద్కర్ జిల్లాగా చేరుతూ నోటిఫికేషన్ ఇచ్చింది. జనాభిప్రాయాన్ని కూడా కోరింది. అయితే ఈ పేరుతో ఒక్కసారిగా కోనసీమలో మంటలు లేచాయి. ఒక విధంగా ఘర్షణ పెద్ద ఎత్తున సాగింది. ఒక మంత్రిగారి ఇల్లు తగలబడింది. మరో అధికార పార్టీ ఎమ్మెల్యే గారి ఇంటికీ అదే గతి పట్టింది.

పరిస్థితి ఎంతదాకా వచ్చింది అంటే చాలా రోజుల పాటు 144 సెక్షన్ విధించాల్సి వచ్చింది. మొత్తానికి ఈ వివాదం సర్దుమణిగింది. గొడవలు ఎవరు చేసినా వాటి వెనక ఏ రాజకీయ పార్టీలు ఉన్నా ఇపుడు అంతా గమ్మున ఉన్నారు. తాజాగా ప్రభుత్వం కూడా అంబేద్కర్ పేరునే కోనసీమ జిల్లాకు ఖరారు చేస్తూ గెజిట్ లో కూడా అఫీషియల్ గా పెట్టేసింది. మొత్తానికి కోనసీమ అంతా ఇపుడు చల్లగానే ఉంది.

సడెన్ గా ముద్రగడ పద్మనాభం ఒక లేఖ రాశారు. కోనసీమకు అంబేద్కర్ పేరు పెడితే తప్పేంటి సోదరులారా అంటూ ఆయన ఈ లేఖలో అనడం విశేషం. దేశానికి రాజ్యాంగాన్ని ఇచ్చి, ఈ రోజు అందరూ ఆయన రాజ్యాంగం ప్రకారమే బతుకుతున్న వేళ అంతటి మహనీయుడి పేరు మన జిల్లాకు ఉంటే గర్వకారణమే కదా అంటూ ఆయన చెప్పుకొచ్చారు. ఇది నా అభిప్రాయం, నాకే స్వార్ధం లేదు అని చెబుతూనే ఆయన చాలా చెప్పారు.

కులాల కుంపట్లు వద్దు, మనమంతా సోదరభావంతో ఉండాలని కూడా ముద్రగడ సూచించారు. అంతే కాదు తాను మేధావిని కానని, పెద్దగా చదువుకోలేదని కూడా ఆయన అంటున్నారు. తన మాటలో తప్పులు పొరపాట్లు ఉంటే మన్నించాలని చెబుతూనే అంతా కలసిమెలసి ఉండాలని ఒక మంచి భావనతోనే ఈ లేఖను సంధించారు.

జిల్లాలకు పెద్దల పేర్లు పెట్టుకున్నది వారికి ఆ జిల్లాలను దారాదత్తం చేయడానికి కాదు, వారికి అవి ఆస్తులు కూడా కాదు, మన గౌరవాన్ని పెంచే చర్యలు మాత్రమే అని ముద్రగడ అనడం విశేషం. నాకు అయితే అంబేద్కర్ పేరు కోనసీమకు పెట్టడం గర్వంగా ఉంది అని కూడా అన్నారు. మంత్రి విశ్వ‌రూప్‌, ఎమ్మెల్యే పొన్నాడ స‌తీష్‌, కుడుపూడి సూర్య‌నారాయ‌ణ‌రావు, క‌ల్వ‌కొల‌ను తాతాజీ వంటి పెద్దలు ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూడాలని కూడా ఆయన కోరారు.

సరే ఇవన్నీ ఇలా ఉన్నా ఇపుడు అయితే కోనసీమలో ఏ గొడవలూ జరగడంలేదు. అంతా ప్రశాంతంగానే ఉంది. అదే టైమ్ లో ముద్రగడ రాసిన లేఖ మీద కూడా రాజకీయంగా చర్చ సాగుతోంది. ఇపుడు ఆయన ఈ లేఖ ఎందుకు రాశారు అన్న వారూ ఉన్నారు. మరో వైపు చూస్తే ముద్రగడ గతంలోనే ఇలాంటి లేఖ రాస్తే బాగుండేది కదా అన్న భావన కూడా వ్యక్తం అవుతోంది. ఎందుకంటే ఈ పేరుని మొదట సూచించినది ఆయనే. తానే చెప్పానూ అంటే ఒక సామాజికవర్గం ఎంతో కొంత శాంతించేది కదా. అంతా అయిపోయాక ఆయన ఇపుడు లేఖ రాయడం వల్ల ఏమిటి లాభం అని అన్నవారూ ఉన్నారు. లేట్ అయినా లేటెస్ట్ గా నాలుగు మంచి మాటలు పెద్దాయన చెప్పారు కాబట్టి ఆలకించడంలో తప్పు లేదు అనే వారూ ఉన్నారు.