Begin typing your search above and press return to search.

బాబు.. పెద్ద హాస్పిట‌ల్ లో చూపించుకోండి

By:  Tupaki Desk   |   29 April 2018 7:05 AM GMT
బాబు.. పెద్ద హాస్పిట‌ల్ లో చూపించుకోండి
X
ఆవేశంగా తిట్ట‌టం.. దుమ్మ దులిపేయ‌టం లాంటివి రాజ‌కీయాల్లో మామూలే. కొంద‌రునేత‌లు మాత్రం మిగిలిన వారికి భిన్నంగా వ్యంగ్యంగా విమ‌ర్శ‌లు చేస్తూ చురుకుపుట్టిస్తారు. అలాంటి కోవ‌కే చెందుతారు కాపు ఉద్య‌మ‌నేత‌.. మాజీ మంత్రి ముద్ర‌గ‌డ ప‌ద్మ‌నాభం. ఆవేశ‌పూరిత ప్ర‌సంగాలు.. తిట్లు.. శాప‌నార్థాల‌తో పాటు వ్యంగ్య వ్యాఖ్య‌లు చేయ‌టంలో ఆయ‌న ముందుంటారు.

మిగిలిన వారి సంగ‌తేమో కానీ ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబుపై విమ‌ర్శ‌లంటే తెలియ‌ని ఉత్సాహం ముద్ర‌గ‌డ‌లో కొట్టొచ్చిన‌ట్లు క‌నిపిస్తుంది. తాజాగా బాబుకు ఒక లేఖాస్త్రాన్ని సంధించారు. ముంద‌స్తు ఎన్నిక‌లు రాకుంటే బాబు ప‌ద‌వి ముగిసిన అధ్యాయం లాంటిద‌ని ఆయ‌న వ్యాఖ్యానించారు.

ఇటీవ‌ల కాలంలో చంద్ర‌బాబు తీసుకుంటున్న నిర్ణ‌యాల‌పై ఆయ‌న బోలెడ‌న్ని సందేహాలు వ్య‌క్తం చేశారు. ఎన్నిక‌లు ద‌గ్గ‌ర‌కు వ‌చ్చిన వేళ‌.. రెండేళ్ల కాల‌ప‌రిమితితో నామినేటెడ్ ప‌ద‌వులు ఇవ్వ‌టం స‌బ‌బేనా? అని ప్ర‌శ్నించారు. కార్య‌క‌ర్త‌ల‌కు ప‌ద‌వుల‌నే తేనెను చేతుల‌కు రాసి.. మోచేతుల నుంచి నాకించేస్తున్నార‌న్న ముద్ర‌గ‌డ‌.. ఎన్నిక‌ల ముందు నామినేటెడ్ ప‌ద‌వుల్ని కేటాయించ‌టంలో ఏమైనా అర్థ‌ముందా? అని ప్ర‌శ్నించారు.

బాబు న‌ట‌న అపూర్వ‌మ‌ని.. 2023 వ‌ర‌కు లిక్క‌ర్ షాపుల లైసెన్స్ ల‌ను రెన్యువ‌ల్ చేస్తున్న‌ట్లుగా ప్ర‌చారం జ‌రుగుతోంద‌ని.. ఒక‌వేళ రేపొద్దున ఎన్నిక‌ల్లో మ‌రోపార్టీ ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చి.. మ‌ద్య నిషేధాన్ని అమ‌లు చేస్తే.. లిక్క‌ర్ షాపుల రెన్యువ‌ల్ చేసుకున్న వారి ఫ్యూచ‌ర్ ఏంది? అన్న డౌట్ ను తెర మీద‌కు తెచ్చేశారు.

ఒక‌వేళ అలాంటిదే జ‌రిగితే వ్యాపార‌స్తుల ప‌రిస్థితి దారుణంగా ఉంటుంద‌న్నారు. నాలుగేళ్ల పాటు ప్ర‌జ‌ల్ని మ‌భ్య పెట్టిన చంద్ర‌బాబు.. ఎన్నిక‌ల భ‌యంతో ప్ర‌స్తుతం యూట‌ర్న్ తీసుకొని ప్ర‌త్యేక హోదా పేరుతో నాట‌కాలు ఆడుతున్నార‌న్నారు.

ఎన్నిక‌ల సంద‌ర్భంగా ఇచ్చిన ఏ హామీని అమ‌లు చేయ‌లేదంటూ మండిప‌డిన ముద్ర‌గ‌డ‌.. ఇటీవ‌ల కాలంలో చంద్ర‌బాబు నిర్ణ‌యాల్లో స్థిర‌త్వం మిస్ అయ్యింద‌న్నారు. ఎందుకైనా మంచిది.. కాస్త పెద్ద ఆసుప‌త్రిలో ఒక‌సారి చూపించుకోండి చంద్ర‌బాబు అంటూ వ్యంగ్యంగా విరుచుకుప‌డ్డారు.