టీడీపీ అధినేత - ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడుపై ఇప్పుడు అన్ని వర్గాలు ఒక్కుమ్మడిగా దాడికి దిగుతున్నాయి. ఏపీకి ప్రత్యేక హోదా విషయంలో నాలుగేళ్ల పాటు తనదైన వితండ వైఖరితో వ్యవహరించిన చంద్రబాబు... ఇప్పుడు హోదా కోసం వైసీపీ తీవ్రతరం చేసిన ఉద్యమం దెబ్బకు దిగిరాక తప్పలేదన్న వాదన వినిపిస్తోంది. ప్రత్యేక హోదా ఇవ్వని కేంద్ర ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం పెడతామని - అంతకూ మోదీ సర్కారు దిగిరాకపోతే... ఎంపీలతో రాజీనామాలు చేయించి ఆమరణ దీక్షలకు దిగుతామని విపక్ష వైసీపీ ప్రకటించగానే చంద్రబాబు గుండెల్లో రైళ్లు పరుగెత్తాయని చెప్పాలి. అసలే ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ... రాష్ట్రానికి అన్యాయం చేస్తూ సాగుతున్న బీజేపీతో కలిసి సాగితే మొదటికే మోసం వస్తుందన్న విషయాన్ని గ్రహించిన మీదటే... చంద్రబాబు ఎన్డీఏకు గుడ్ బై చెప్పారన్న వాదన లేకపోలేదు. ఈ క్రమంలో ప్రత్యేక హోదా కోసం తాను కూడా ఉద్యమం చేపడతాని ప్రకటించిన చంద్రబాబు.. తన పార్టీ ఎంపీలతో పార్లమెంటులో వీధి నాటకాలు వేయించారని కూడా పెద్ద ఎత్తున విమర్శలు చెలరేగిన సంగతి తెలిసిందే.
ఈ క్రమంలో ఏపీకి అన్యాయం చేసిన ప్రధాని నరేంద్ర మోదీకి - గడచిన ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అటకెక్కించిన చంద్రబాబుకు ఏమాత్రం తేడా లేదన్న వాదన కూడా ఇప్పుడు బలంగానే వినిపిస్తోంది. ఈ క్రమంలో కాపు ఐక్య వేదిక నేత - మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం... చంద్రబాబుకు మరో లేఖాస్త్రం సంధించారు. ఈ లేఖలో చంద్రబాబుపై ముద్రగడ చాలా ఘాటు వ్యాఖ్యలు చేశారు. అంతేకాకుండా చంద్రబాబుపై తాను చేసిన వ్యాఖ్యలు ముమ్మాటికీ నిజమేనన్న రీతిలో ముద్రగడ తనదైన శైలిలో విశ్లేషణ చేశారు. చంద్రబాబును మోసగాడిగా అభివర్ణించిన ముద్రగడ... చంద్రబాబు మోసం కేన్సర్ వ్యాధి కంటే ప్రమాదకరమని తేల్చేశారు. కేన్సర్ వ్యాధికి మందులుంటే.. చంద్రబాబు మోసాని మందే లేదని సంచలన వ్యాఖ్య చేశారు.
అయినా ఆ లేఖలో చంద్రబాబును ముద్రగడ ఏ రేంజిలో కడిగేశారన్న విషయానికి వస్తే.. *మీరు మేధావి అని అందరూ భావించారు. కానీ మీ మేధావితనంతో మీకు కావాల్సిన వారికి - మీ కుటుంబానికి కోట్ల రూపాయలు దోచిపెట్టారని అర్ధమైంది. మా జాతికి ఇచ్చిన హమీలను అమలు చేయమని అడిగితే అన్నదమ్ముల్లాంటి మా సోదరులతో తిట్టించి పబ్బం గడుపుకుంటున్నారు. మా జాతిలో కొందరి ఆర్ధిక మూలలను దెబ్బతీశారు. కొందరిపై తప్పుడు కేసులు పెట్టి రౌడీ షీట్లు తెరిపించారు. కామన్వెల్త్ క్రీడల్లో రెండు సార్లు స్వర్ణం సాధించిన కాపు క్రీడాకారుడు వెంకట రాహుల్ కు ఎందుకు అభినందనలు చెప్పలేదో లోకానికి చెప్పండి. మీ సంతానం తెలుగు నేర్చుకోవడానికి ప్రజల ఆస్తి కోట్ల రూపాయలు ఖర్చు చేయడం సిగ్గుగా లేదా? హమీలు అమలు చేయకుండా ప్రజలను మభ్యపెట్టాడానికి మీరు చేస్తున్న గోబెల్స్ ప్రచారం రాష్ర్టానికే కాదు..దేశానికే ప్రమాదం. మీ మోసం కన్నా క్యాన్సర్ వ్యాధే మంచిది. మీ మోసానికి మందులు కూడా ఉండవు. ఇలా మోసం చేసే పార్టీని ప్రజలు భూస్ధాపితం చేస్తే మంచిది. ఏపీలో రైళ్ళని ఆపితే ప్రత్యేక హోదా ఎందుకు రాదు? * అని ఆ లేఖలో చంద్రబాబును ముద్రగడ కడిగిపారేశారని చెప్పాలి.