Begin typing your search above and press return to search.

చంద్రబాబుకు ముద్రగడ కొత్త ఫిటింగ్!

By:  Tupaki Desk   |   23 Nov 2017 1:08 PM GMT
చంద్రబాబుకు ముద్రగడ కొత్త ఫిటింగ్!
X
కాపు లకు బీసీ రిజర్వేషన్ కల్పించే విషయంలో తాను ఇచ్చిన హామీ చంద్రబాబునాయుడుకు చిన్న చికాకులు సృష్టించడం లేదు. ‘‘కాలికి చుట్టుకున్న పాము కరవక మానదు ’’ అని సామెత. అలాగే చంద్రబాబునాయుడుకు కూడా.. ఇచ్చిన హామీ.. ఆయనను ఇబ్బంది పెట్టక తప్పదు అన్నట్లుగా పరిస్థితి తయారవుతోంది. కాపు రిజర్వేషన్ ల గురించి అలుపెరగని పోరాటం సాగిస్తున్న ముద్రగడ పద్మనాభం.. చంద్రబాబునాయుడుకు ఒక తాజా అల్టిమేటం జారీ చేశారు. అందులో ఒక కొత్త ఫిటింగ్ కూడా పెట్టారు. అసలు ఇచ్చిన మాట గురించే చంద్రబాబునాయుడు కిందా మీదా అయిపోతున్నారు. అలాంటిది.. అందులో కొత్త క్లాజులు కూడా కావాలని ఇప్పుడు ముద్రగడ తెరమీదికి తెస్తున్నారు. బీసీల్లో ఉన్న కేటగిరీల్లో భాగంగా కాకుండా.. తమకు ప్రత్యేకంగా ఒక కేటగిరీ క్రియేట్ చేసి ఇవ్వాలని ఆయన అంటున్నారు.

ఇప్పటికే కాపుల రిజర్వేషన్ వ్యవహారం చంద్రబాబు మెడపై కత్తిలా వేలాడుతున్న సంగతి తెలిసిందే. కాపులలో ఒక వర్గాన్ని రకరకాల మార్గాల్లో దువ్వడానికి చంద్రబాబు నాయుడు ఎంతగా ప్రయత్నిస్తున్నప్పటికీ.. డిసెంబరు 6వ తేదీలోగా.. రిజర్వేషన్ అనుకూల ప్రకటన రావాలనే ఫత్వా ఉండనే ఉంది. అప్పటికీ రాకపోతే.. కాపుల ఉద్యమాలు తీవ్రరూపం దాలుస్తాయనే హెచ్చరిక ఉంది. కానీ.. అప్పటిలోగా.. పరిస్థితి తేలే అవకాశం మాత్రం కనిపించడం లేదు.

ఇలాంటి సంక్లిష్ట నేపథ్యంలో ముద్రగడ కొత్త ఫిటింగ్ పెడుతున్నారు. బీసీలకు ప్రస్తుతం ఉన్న ఏబీసీడీల కేటగిరీల్లో తమకు కల్పించే రిజర్వేషన్లు కలపవద్దని ఆయన అంటున్నారు. దీనివలన బీసీ కులాల వారు తమ మీద కక్ష పెంచుకుని కొట్లాడుకునే పరిస్థితి వస్తుందని, ఈ దుస్థితి తలెత్తకుండా ఉండాలంటే.. ఆ కేటగిరీల్లో ఎక్కడో ఒకచోట తమను కలపకుండా.. తమకు ప్రత్యేకంగా ఒక కేటగిరీ సృష్టించి ఇవ్వాలని ముద్రగడ కోరుతున్నారు.

చంద్రబాబునాయుడు కాపులకు రిజర్వేషన్ కల్పిస్తానని హామీ ఇచ్చారు. ముద్రగడ పద్మనాభం.. తమకు బ్రిటిషు కాలంలోనే రిజర్వేషన్ ఉండేది అంటూనే.. ప్రస్తుతం తమ కులంలో పేదలకు మాత్రం ఇస్తే చాలునని అంటుంటారు. అది లాజికల్ గా కుదురుతుందా? లేదా అనే మీమాంస నడుస్తున్న సమయంలోనే.. మళ్లీ తమకు కొత్త కేటగిరీ కావాలంటూ.. ముద్రగడ కొత్త ఫిటింగ్ పెట్టడం చర్చనీయాంశం అవుతోంది.