ప్రస్తుత కేంద్ర మంత్రి - బీజేపీ సీనియర్ నేత బండారు దత్తాత్రేయ గతంలో వైఎస్ అధికారంలో ఉన్నప్పుడు తన లేఖలతో ఆయన్ను ఉక్కిరి బిక్కరి చేశారు. నిత్యం ప్రజాసమస్యలు - ఇతర అంశాలపై వైఎస్ ప్రభుత్వ తీరును ఎండగడుతూ వందలాది లేఖలు రాశారు. దాంతో దత్తన్నకు లేఖల వీరుడిగా పేరొచ్చింది. ఆ తరువాత ఆయన లేఖాస్త్రాలు బాగా తగ్గించారు. అయితే.. ఏపీలో ఇప్పుడు కొత్త లేఖల వీరుడు పుట్టుకొచ్చారు. కాపు ఉద్యమ నేత - మాజీ మంత్రి ముద్రగడ చంద్రబాబు వరుసగా లేఖలు రాస్తూ అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు.
కాపుల సంక్షేమం.. నిధులు.. తదితర విషయాల్లో చంద్రబాబుకు ఇప్పటికే పలు లేఖలు రాసిన ముద్రగడ తాజాగా మరో లేఖ రాశారు. అందులో ఆయన తాను వైఎస్ జగన్ గైడెన్సులో నడుస్తున్నానన్న ఆరోపణలు తిప్పికొట్టారు. ‘‘చంద్రబాబుగారూ.... మీ ప్రత్యర్థి అయిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి వయసు నా రాజకీయ జీవితమంత లేదు. ఆయన నాకు సలహాలివ్వడమేంటి?’’ చంద్రబాబును ప్రశ్నిస్తూ ముద్రగడ ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను జగన్ పక్షమని కనుక రుజువు చేస్తే కాపు ఉద్యమం ఆపేస్తానని, అదేకనుక నిరూపించలేకపోతే, మీరు ఏం చేస్తారో చెప్పాలని ఆ లేఖలో ముద్రగడ ప్రశ్నించారు.
పనిలో పనిగా చంద్రబాబు ప్రభుత్వంపై విమర్శలు కురిపించారు. ప్రభుత్వ సొమ్ముతో కడుతున్న కాపు భవనాలకు ‘చంద్రన్న’ పేరు పెట్టాలని జీవోలు విడుదల చేసి, ఇప్పుడు భుజాలెందుకు తడుముకుంటున్నారని ప్రశ్నించారు. కాగా ఇటీవల ముద్రగడ కాపులు - ఎస్సీలు కలిసి రాజకీయ వేదిక ఏర్పాటు చేయాలన్న ప్రయత్నాల్లో ఉన్నారు. దీంతో ఆయన రాష్ట్రంలోని కాపు నేతలతో పాటు ఎస్సీ నేతలనూ కలుస్తున్నారు. ఇదంతా ఎలా ఉన్నా నిత్యం లేఖాస్త్రాలు సంధిస్తూ ముద్రగడ దత్తన్న వారసత్వాన్ని పునికిపుచ్చుకుంటున్నట్లుగా ఉంది.