Begin typing your search above and press return to search.

సభ అని పిలిచి సమరానికి దిగారు

By:  Tupaki Desk   |   31 Jan 2016 11:01 AM GMT
సభ అని పిలిచి సమరానికి దిగారు
X
కొద్దిరోజులుగా ఏపీ రాజకీయాల్లో వేడి పుట్టిస్తున్న కాపు గర్జన మొదలైంది.. తూర్పు గోదావరి జిల్లా తునిలో ప్రారంభమైన ఈ కాపు ఐక్యగర్జన సభ ను సభలా కాకుండా ఉద్యమ పంథాలోకి తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం ఆధ్వర్యంలో తునిలోని వి.కొత్తూరు వద్ద గల మైదానంలో సభ మొదలైన తరువాత ముద్రగడ ఒక్కసారిగా రూటు మార్చారు. ఇప్పుడే ప్రత్యక్ష ఉద్యమానికి దిగుదామంటూ సభకు వచ్చినవారిని రెచ్చగొట్టారు. దీంతో సభకు వచ్చినవారంతా రోడ్లు - రైళ్ల రోకోలకు అక్కడి నుంచి బయలుదేరారు.

కాపు ఐక్య గర్జన సభలో ముద్రగడ పద్మనాభం ఉద్యమ కార్యాచరణను మొదలుపెట్టారు. కాపులను బీసీల్లో చేర్చేవరకు తమ ఉద్యమం ఆగదని చెప్పిన ఆయన అందుకు అవసరమైన జీవోలు ఇచ్చేవరకు రాస్తారోకో - రైళ్ల రోకోలు చే్ద్దామని పిలుపునిచ్చారు. అయితే... అందుకు అనుమతులేవీ తీసుకోకుండానే అప్పటికప్పుడు కార్యాచరణ అమలు చేయడానికి రెడీ అయిపోయారు. ''బహిరంగ సభ నుంచి రైలు పట్టాలపైకి వెళ్దాం రండి'' అంటూ ఆయన పిలుపునివ్వడంతో సభకు వచ్చిన వేలాది మంది ఆయన హైవేలు, రైల్వే ట్రాకులు దిగ్బంధించడానికి బయలుదేరారు.

అయితే... ముద్రగడ ఇలా కాపు గర్జన అంటూ పిలిచి తక్షణ ఉద్యమం చేపట్టడం వెనుక ఇతర రాజకీయ ప్రయోజనాలు, కారణాలు ఉండొచ్చన్న వాదన వినిపిస్తోంది. సీనియర్ నేత అయిన ముద్రగడ ఇలా అకస్మాత్తుగా కార్యాచరణకు దిగడం సరైన విధానం కాదని తెలిసీ అలా చేశారంటే ఇతర ప్రభావాలు ఉండొచ్చని అంటున్నారు. ముఖ్యంగా జీహెచ్ ఎంసీ ఎన్నికల్లో టీడీపీ పూర్తిగా ఇన్వాల్వ్ అయి పెద్ద ఎత్తున ప్రచారం చేస్తూ అనుకున్న కంటే ఎక్కువ సీట్లు సాధించే పరిస్థితులు కనపించడంతో తెలంగాణ పాలక పక్షాలతో సన్నిహితంగా ఉన్న ఏపీలోని టీడీపీ వ్యతిరేక పార్టీలు ఈ తక్షణ కార్యాచరణకు వ్యూహరచన చేసి ముద్రగడను రెచ్చగొట్టి ఉంటారని భావిస్తున్నారు.