Begin typing your search above and press return to search.

వైసీపీలోకి ముద్రగడ...జగన్ ఓకే...?

By:  Tupaki Desk   |   26 May 2023 8:31 PM GMT
వైసీపీలోకి ముద్రగడ...జగన్ ఓకే...?
X
కాపు రిజర్వేషన్ పోరాట సమితి నాయకుడు ముద్రగడ పద్మనాభం తొందరలోనే వైసీపీ కండువా కప్పుకోబోతున్నారా అంటే జవాబు అవును అనే వస్తోంది అని అంటున్నారు. ఏపీలో సార్వత్రిక ఎన్నికలకు గడువు దగ్గర పడుతోంది. అదే టైం లో రాజకీయ పార్టీలు తమ వ్యూహాలను రెడీ చేసి పెట్టుకుంటున్నాయి.

కాపుల చుట్టూ గోదావరి జిల్లాలు తిరిగుతున్నాయి. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అయితే టీడీపీతో పొత్తుకు సుముఖంగా ఉన్నారని అంటున్నారు. ఈ నేపధ్యంలో కాపులను తమ వైపునకు తిప్పుకోవడం కోసం వైసీపీ ముద్రగడను పార్టీలోకి ఆహ్వానిస్తోంది అని అంటున్నారు.

కాపులలో ఈ రోజుకీ ముద్రగడకు మంచి పట్టు ఉంది. ఆయన మూడు దశాబ్దాలుగా కాపుల కోసం ఎన్నో ఉద్యమాలు చేశారు. కాపు రిజర్వేషన్లు అనుకుంటూ ఆయన రాజకీయాలను వదిలేశారు. 2014లో చంద్రబాబు కాపులను బీసీలలో చేరుస్తాను అని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చారు. అయితే ఆ హామీని నెరవేర్చాలని ముద్రగడ డిమాండ్ చేస్తూ పెద్ద ఉద్యమమే చేపట్టారు. దాంతో ముద్రగడను అరెస్ట్ చేయడం జరిగింది.

ఈ సందర్భంగా ముద్రగడ బాగా హర్ట్ అయ్యారు. తుని ఘటనకు సంబంధించి కూడా ముద్రగడ మీద అనేక కేసులు పెట్టి అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం వేధించింది అని ఆయన అభిమానులు ఇప్పటికీ బాధపడుతూంటారు. ఇక ముద్రగడ కుటుంబం మొత్తాన్ని కూడా పోలీసులను పెట్టించి నానా రకాలుగా నరకం చూపించారని కూడా అంటారు.

ఇదిలా ఉంటే 2014 ఎన్నికల్లో ముద్రగడ తెలుగుదేశానికి మద్దతుగా నిలిచారు. తదనంతర పరిణామాల నేపధ్యంలో చంద్రబాబు మీద ఆయన విమర్శలు చేస్తూ వచ్చారు. తుని రైలు దహనం కేసు తరువాత మాత్రం ముద్రగడ బాబుతో అన్ని బంధాలు తెంచుకున్నారు. ఈ రోజున తుని ఘటన కేసు నుంచి ఆయన విముక్తి పొందారు. ఈ కేసు విషయంలో జగన్ సర్కార్ అధికారంలోకి వచ్చిన తరువాత ముద్రగడ తదితరుల మీద కేసులను ఉప సంహరించుకుంది.

ఆ విధంగా జగన్ సర్కార్ తో సానుకూలంగా ముద్రగడ స్పందించేందుకు వీలు కలిగింది. ఇపుడు ఎన్నికల వేళ ముద్రగడ రాజకీయంగా రీ ఎంట్రీ ఇవ్వాలని చూస్తున్నారు. ఆయన వద్దకు తాజాగా ఎంపీ పెద్దిరెడ్డి మిధున్ రెడ్డి వెళ్ళారని తెలుస్తోంది. కిర్లంపూడిలో ఉంటున్న ముద్రగడతోనూ ఆయన అనుచరులతోనూ మిధున్ రెడ్డి చర్చలు జరిపారని అంటున్నారు.

అదే విధంగా ముద్రగడను వైసీపీలోకి ఆహ్వానించారని తెలుస్తోంది. దీనికి సానుకూలంగా ముద్రగడ స్పందించారు అని అంటున్నారు. అయితే కాపుల విషయంలో కొన్ని డిమాండ్లు ముందు పెట్టి వాటిని జగన్ తో ఓకే చేయించుకున్న మీదటనే ఆయన వైసీపీ కండువా కప్పుకుంటారు అని అంటున్నారు. ఎన్నికలు సమీపిస్తున్న నేపధ్యంలో ముద్రగడ వంటి బిగ్ షాట్ ని తమ వైపునకు తిప్పుకుంటే గోదావరి జిల్లా రాజకీయం అనుకూలం అవుతుందని వైసీపీ భావిస్తోంది. మొత్తానికి చూస్తే తొందరలోనే ముద్రగడ వైసీపీ తీర్ధం పుచ్చుకుంటారని అంటున్నారు.