Begin typing your search above and press return to search.

కాపులకు ముద్రగడ నయా డైరెక్షన్ ....?

By:  Tupaki Desk   |   23 March 2022 1:30 AM GMT
కాపులకు ముద్రగడ నయా డైరెక్షన్ ....?
X
ముద్రగడ పద్మనాభం. ఈ పేరు ఎవరికీ పరిచయం అక్కరలేనిది. ఆయనది నాలుగు దశాబ్దాల రాజకీయం. పైగా ఆయన నీతీ నిజాయాతీ గురించి అందరూ గొప్పగా చెప్పుకుంటారు. ఈ రోజులలో కూడా ఒక లక్ష్యం కోసం చిత్తశుద్ధితో పనిచేసే వారు ఉన్నారా అంటే ముద్రగడను సాక్ష్యంగా చూపించవచ్చు. ఆయన కాపు జాతి మేలు కోసం గత ముప్పయ్యేళ్ళుగా పాటుపడుతున్నారు. అంతే కాదు, ఆయన తన రాజకీయ జీవితాన్ని కూడా త్యాగం చేశారు.

ఆయన కోరితే ముఖ్యమంత్రి తప్ప అన్ని పదవులూ గుమ్మం ముందు క్యూ కడతాయి. కానీ ముద్రగడ ఒకే ఒక టార్గెట్ పెట్టుకున్నారు. కాపులను ఉన్నతంగా చూడాలని. వారిని సామాజికంగా, ఆర్ధికంగా, రాజకీయంగా ముందు వరసలో నిలబెట్టాలని. ఈ విషయంలో ఆయన విజయం సాధించారా అంటే చేశారు అనే చెప్పాలి.

ఈ రోజుకు కాపులలో రాజ్య కాంక్ష గట్టిగా రగిలింది అంటే దానికి ముద్రగడ కారణం అని చెప్పాలి. ఇదిలా ఉండగా ముద్రగడ పద్మనాభం టీడీపీ హయాంలో కాపులను బీసీలలో చేర్చాలని పటుబట్టారు. ఆ దిశగా పోరాడారు. అయితే వైసీపీ పవర్ లోకి వచ్చాక ఆయన లేఖలు రాస్తూ వచ్చారు. ఇదే టైం లో ఆయన చిత్తశుద్ధిని కొందరు శంకించడంతో ఏకంగా కాపు ఉద్యమం నుంచి తప్పుకున్నారు.

అయితే ఇపుడు ఏపీలో కాపులు అంతా సంఘటితం అవుతున్నారు. కాపు నేతలు వరస మీటింగులు పెడుతున్నారు. వారి వెనక సలహా సంప్రదింపులు ఇస్తూ ముద్రగడ ఉన్నారని ప్రచారం ఉంది. అయితే కాపు సమావేశాలు బాగానే సాగుతున్నా కాపులను టీడీపీ వైపు మళ్ళీ మళ్ళించాలని చూసున్న వైఖరి పట్లనే ముద్రగడ తీవ్ర అసంతృప్తిగా ఉన్నారని అంటున్నారు.

అందుకే ఆయన మళ్ళీ కాపులకు నయా డైరెక్షన్ ఇవ్వడానికి రంగంలోకి దూకుతున్నారని అంటున్నారు. కాపులను టీడీపీ మోసం చేసిందని, మళ్ళీ ఆ పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి తమ సామాజికవర్గం ఎంతమాత్రం సహకరించవద్దు అన్నదే ముద్రగడ తాజా అజెండాగా ఉందని చెబుతున్నారు.

ఇక కాపులను, బీసీలను, మైనారిటీలు ఇతర వర్గాలని కలుపుకుని తామే అధికారంలోకి వచ్చేలా రాజకీయ అజెండాని సిద్ధం చేయడం మీద ప్రస్తుతం ముద్రగడ దృష్టి పెట్టారని అంటున్నారు. కాపులంతా కూడా ఐక్యంగా ఉంటే ఇది సాధ్యమని ఆయన నమ్ముతున్నారు. ఎవరో ఒకరి పల్లకీ మోసే కంటే కాపులే అధికారంలోకి రావాలన్నదే ముద్రగడ ఆలోచన అని తెలుస్తోంది.

తొందరలోనే ముద్రగడ డైరెక్ట్ గా కాపునాడు సమావేశాలకు హాజరవుతారని, ఇక మీదట ఆయన తరహా దూకుడుతో ఏపీ రాజకీయాల్లో కొత్త మార్పులు తీసుకువస్తారని అంటున్నారు. అదే కనుక జరిగితే అటు అధికార వైసీపీతో పాటు, ఇటు విపక్ష టీడీపీ కూడా రాజకీయంగా ఇబ్బందులను ఎదుర్కోవడం ఖాయమని అంటున్నారు.