Begin typing your search above and press return to search.

ముద్రగడ చేత దీక్ష విరమింప చేయాలంటే..?

By:  Tupaki Desk   |   5 Feb 2016 9:55 AM GMT
ముద్రగడ చేత దీక్ష విరమింప చేయాలంటే..?
X
కాపుల్ని బీసీల్లో చేర్చాలన్న డిమాండ్ తో మాజీ మంత్రి.. కాపు నేత ముద్రగడ పద్మనాభం మరోసారి దీక్ష షురూ చేశారు. ఈసారి ఆయనతో పాటు.. తన సతీమణితో ఆయన ఆమరణదీక్ష ప్రారంభించటం తెలిసిందే. ఈ దీక్ష విషయంలో ఏపీ సర్కారు అత్యంత జాగ్రత్తగా వ్యవహరిస్తూ.. దీక్ష తీవ్రత పెరగకుండా కట్టుదిట్టమైన చర్యల్ని తీసుకుంటోంది. అయితే.. మీడియాలో ఈ దీక్ష మీద ప్రచారం ఎక్కువగా ఉండటంతో భావోద్వేగాలు పెరగటం పెద్ద విషయం కాదన్న మాట వినిపిస్తోంది. దీక్ష మొదలై కొన్ని గంటలే అయినప్పటికీ ఇప్పటికే ముద్రగడను పరామర్శించేందుకు.. పలుకరించేందుకు కాపు నేతలు పెద్ద ఎత్తున రావటం మొదలైంది.

ఈ దీక్ష మరింత ఉధృతంగా మారితే ఏపీ సర్కారుకు తిప్పలు తప్పనట్లే. దీక్షను విరమించుకోవాలంటూ ఏపీ ముఖ్యమంత్రి.. ముద్రగడ వద్దకు కొందరు ప్రభుత్వ ప్రతినిధుల్ని పంపిన సంగతి తెలిసిందే. వారితో భేటీ అయిన ముద్రగడ.. ఏపీ సర్కారు నుంచి వచ్చిన ప్రతిపాదనలు తనకు సబబుగా అనిపిస్తే దీక్ష విరమిస్తానని.. మొదట అయితే దీక్ష స్టార్ట్ చేస్తానని చెప్పటంతో ప్రతినిధుల నోటి నుంచి మాట రాని పరిస్థితి.

ఏపీ ప్రభుత్వ ప్రతినిధులతో ముద్రగడ చెప్పినట్లే దీక్ష మొదలు పెట్టారు. నిజానికి ఆయన దీక్ష మొదలు పెట్టటానికి కారణం లేకపోలేదు. ప్రభుత్వం నుంచి వచ్చే ప్రతిపాదనలు అస్పష్టంగా ఉండటం.. ప్రభుత్వ ఒత్తిడితో వెనక్కి తగ్గితే.. చెరుపుకోలేనంత చెడ్డపేరు వచ్చే ప్రమాదం ఉండటంతో దీక్షకు రెఢీ అయ్యారని చెప్పొచ్చు. తన దీక్ష కారణంగా జస్టిస్ మంజునాథ కమిషన్ కాలపరిమితిని ఆరు నెలల నుంచి మూడు నెలలకు తగ్గించటం.. కాపుల్ని బీసీల్లోకి చేర్చే విషయానికి సంబంధించిన కచ్ఛితమైన హామీని పొందాలని భావిస్తున్నారు.

ముద్రగడ దీక్షను విరమించేలా చేయాలంటే మంత్రులు స్వయంగా రంగంలోకి దిగటంతో పాటు.. ఏపీ ప్రభుత్వం ఇచ్చే మాట నిర్మాణాత్మకంగా ఉండటంతో పాటు.. తప్పనిసరిగా అమలు అవుతుందన్న భరోసా కలిగించేలా ఉంటేనే దీక్షను విరమించే అవకాశం ఉందని తెలుస్తోంది. మరి.. ఆ కోణంలో చంద్రబాబు దృష్టి సారిస్తారా? అన్నదే ముద్రగడ దీక్ష విరమణను ప్రభావితం చేసే వీలుంది.