కాపుల్ని బీసీల్లో చేర్చాలంటూ ఆ మధ్యన తునిలో భారీ సమావేశం నిర్వహించటం.. ఈ సందర్భంగా ఊహించని పరిణామాలు చోటు చేసుకోటం తెలిసిందే. ఈ సభ సందర్భంగా చోటు చేసుకున్న హింసా ఘటనలతో రత్నాచల్ ఎక్స్ ప్రెస్ ను దగ్థం చేయటంతో పాటు.. తుని పట్టణంలో ఆరాచకం సృష్టించటం తెలిసిందే. ఈ ఉదంతంపై పోలీసులు గత కొద్దిరోజులుగా కసరత్తు చేసి.. పలువురు బాధ్యుల్ని గుర్తించారు. ఇందులో భాగంగా పలువురి నిందితుల్ని పోలీసులు అదుపులోకి తీసుకునే ప్రక్రియను షురూ చేశారు. సుమారు ఆరుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లుగా చెబుతున్నారు.
దీనిపై కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. పోలీసుల అరెస్ట్ (?) లకు నిరసనగా ఇంట్లో దీక్ష చేస్తారన్న అంచనాలు వ్యక్తమయ్యాయి. దీనికి భిన్నంగా ఆయన.. మంగళవారం అమలాపురం పోలీసులకు ఊహించని షాకిచ్చారు. తుని ఘటనలో నిందితులుగా గుర్తించిన వారిని సోమవారం నుంచి పోలీసులు అరెస్ట్ లు చేస్తున్నారన్న నేపథ్యంలో పోలీసుల చర్యలకు నిరసనగా.. కొందరు నేతలతో కలిసి ముద్రగడ మంగళవారం ఉదయం అమలాపురం పోలీస్ స్టేషన్ కు వెళ్లారు.
తనను అరెస్ట్ చేయాలంటూ ముద్రగడ పోలీసుల్ని కోరారు. తన మీద కూడా కేసులు ఉన్నాయని.. తాను పోలీసుల ఎదుట లొంగిపోతున్నట్లుగా వెల్లడించి.. తనను అదుపులోకి తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. దీంతో.. పోలీసులకు నోట మాట రాని పరిస్థితి. ఇప్పుడున్న పరిస్థితుల్లో ముద్రగడను అదుపులోకి తీసుకుంటే రాష్ట్రంలో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో తెలియంది కాదు. దీనికి తోడు.. ముద్రగడను అరెస్ట్ చేయాలన్న ఆదేశాలు ఉన్నతాధికారుల నుంచి లేని నేపథ్యంలో.. ఏం చేయాలో అర్థం కాక పోలీసుల నోట మాట రాని పరిస్థితి.
ముద్రగడే స్వయంగా సీన్లోకి వచ్చి పోలీస్ స్టేషన్లో లొంగిపోయి తనను అరెస్ట్ చేయాలని ప్రకటించిన నేపథ్యంలో.. ఆయన మద్దతుదారులు పెద్ద ఎత్తున అమలాపురం పోలీస్ స్టేషన్ కు చేరుకున్నారు. తమను కూడా అరెస్ట్ చేయాలని కోరుతున్నారు. ముద్రగడ వ్యవహారంలో ఎలాంటి నిర్ణయం తీసుకోవాలో అర్థం కాక పోలీసులు ఉన్నతాధికారులతో సంప్రదింపులు జరుపుతున్నారు. ఇదిలా ఉంటే.. ఈ కేసు తమ పరిధిలోనిది కాదని.. రైల్వే పోలీసులదని అమలాపురం పోలీసులు చెబుతున్న మాటలకు ముద్రగడ తీసిన లా పాయింట్ కు పోలీసులు నీళ్లు నమిలే పరిస్థితి. కేసు మీ పరిధిలో లేనప్పుడు నిన్న ఆరెస్ట్ లు ఎలా చేశారని ఆయన సూటిగా ప్రశ్నిస్తున్నారు. పోలీస్ స్టేషన్ ఎదుట బైఠాయించిన ముద్రగడ తనను అరెస్ట్ చేసే వరకూ కదలనంటూ ధర్నా చేస్తున్నారు.
ఊహించని విధంగా వ్యవహరించిన ముద్రగడ ఏపీ సర్కారుకు.. పోలీసులకు తనదైన శైలిలో షాకిచ్చారన్న మాట వినిపిస్తోంది. చూస్తుంటే.. సోమవారం పోలీసులు అదుపులోకి తీసుకున్న వారిని విడిచి పెట్టే విషయంలో పోలీసులు కిందకు దిగటంతో పాటు.. ఆరోపణలు ఎదుర్కొంటున్న మిగిలిన వారిపై అరెస్ట్ లాంటి చర్యలు తీసుకోకుండా ఉండేందుకు వీలుగా ముద్రగడ తాజా ఆందోళన చేపట్టినట్లుగా భావిస్తున్నారు. షాకుల మీద షాకులు ఇస్తున్న ముద్రగడ విషయంలో ఏపీ పోలీసులు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్నది ఇప్పడు ఉత్కంటగా మారింది.