Begin typing your search above and press return to search.
బాబుకు మళ్లీ టైం పెట్టిన ముద్రగడ
By: Tupaki Desk | 16 Sept 2017 5:38 PM ISTకాపు ఉద్యమం! ఏపీలో చంద్రబాబు సర్కారును ముప్పతిప్పలు పెట్టి మూడు చెరువుల నీళ్లు తాగించిన ఉద్యమం. 2014 ఎన్నికల సమయంలో కాపులను బీసీల్లో చేర్చుతామని, వారికి కూడా రిజర్వేషన్లు కల్పిస్తామని పెద్ద ఎత్తున హామీలు గుప్పించిన బాబు.. తర్వాత వాటిని తుంగలో తొక్కిన వైనంపై కాపులు గళం విప్పి కదంతొక్కారు. ఫలితంగా బాబు ఇరకాటంలో పడిపోయారు. ఇక, కాపుల పక్షాన మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం బాబుకు సవాలుగా మారారు. ఆయన తనదైన శైలిలో బాబును హామీలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ క్రమంలోనే నిరాహార దీక్షకు దిగారు.
అయినా కూడా చంద్రబాబు ఈ ఉద్యమానికి స్పందించకపోగా రాష్ట్రంలో బీసీ కమిషన్‌ను నియమించామని అది చెప్పినట్టు నడుస్తామని ఆయన వెల్లడించారు. అయితే, ఈ నివేదిక ఎప్పుడు వస్తుందో చెప్పడం ఎవరి తరమూ కావడం లేదు. మరోపక్క, 2019 ఎన్నికలు ముంచుకొస్తున్నాయి. ఈ క్రమంలోనే తన పాదయాత్ర ద్వారా కాపులను చైతన్య పరచాలని భావించారు. అయితే, దీనికి రాజకీయ రంగు పులిమిన సీఎం చంద్రబాబు ఆయనను ఇంటి నుంచి కాలు బయటకు పెట్టకుండా అడ్డుకున్నారు. ఈ క్రమంలోనే కాకినాడ కార్పొరేషన్ ఎన్నికలు వచ్చాయి.
ఇక, ఈ కాపు ఉద్యమానికి ముద్రగడ తాత్కాలిక విరామం ప్రకటించారు. అయితే, తాజాగా ఆయన బాబుకు ఓ గడువు విధించారు. కాపు ఉద్యమానికి తాత్కాలిక విరామం ప్రకటించినా .. ఉద్యమం ఆగదని చెప్పారు. ప్రభుత్వం కాపులను పట్టించుకోకపోతే.,. తాము పక్కా ప్రణాళికతో ఉద్యమాన్ని మరింత తీవ్రం చేస్తామని హెచ్చరించారు. ఈ నేపథ్యంలోనే ముద్రగడ మాట్లాడుతూ.. ‘డిసెంబర్ ఆరో తేదీ వరకూ గడువు విధించుకున్నాం. అప్పటికి మా జేఏసీ రెండు ఆప్షన్లు పెట్టుకుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నుంచి సానుకూల స్పందన ఉంటే సరేసరి. మళ్లీ మొండిచేయి చూపిస్తే ఆ రెండు ఆప్షన్లలో ఒకటి ఎంచుకుంటాం’ అని ఆయన స్పష్టం చేశారు. అయితే, ఆ రెండు ఆప్షన్లు ఏమిటనేది ఆయన వెల్లడించలేదు. దీంతో రాబోయే రోజుల్లో బాబుకు కాపుల నుంచి గట్టి సెగ తగిలే సూచనలే కనిపిస్తున్నాయని తెలుస్తోంది. మరి బాబు ఎలా డీల్ చేస్తారో చూడాలి.
