Begin typing your search above and press return to search.

పవన్ పై ముద్రగడ లేఖాస్త్రం... తెరపైకి కొత్త సంగతులు!

By:  Tupaki Desk   |   20 Jun 2023 12:00 PM GMT
పవన్ పై ముద్రగడ లేఖాస్త్రం... తెరపైకి కొత్త సంగతులు!
X
వారాహి యాత్రలో భాగంగా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో వరుస బహిరంగ సభలతో జనసేన అధినేత ఎన్నికల ప్రచారాలు మొదలుపెట్టేశారు. ఈ సభల్లో ప్రసంగిస్తున్న పవన్.. అధికార పార్టీ నేతలపై దుమ్మెత్తిపోస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా సర్పవరం జంక్షన్ లోని సభలో కాపునేతలపై కూడా పవన్ కామెంట్స్ చేశారు.

దీంతో... పవన్ వి శృతిమించిన విమర్శలు, సినిమా డైలాగులను ప్రతిబింబించే వ్యాఖ్యలు అనే కామెంట్లు చేస్తున్నారు అధికారపార్టీ నేతలు. ఈ నేపథ్యంలో కాపు ఉధ్యమ నేత ముద్రగడ పద్మనాభం పవన్ పై లేఖాస్త్రం సంధించారు!

ఈ సందర్భంగా పవన్ పై పలు ప్రశ్నలు సంధిస్తూనే.. మరికొన్ని కీలక సూచనలు కూడా చేశారు ముద్రగడ పద్మనాభం. ఇందులో ముందుగా... పవన్ ఉపయోగిస్తున్న బాషపై స్పందించారు.. ఇది పూర్తి అభ్యంతరకరమైనదిగా ఆయన అభిప్రాయపడ్డారు.

"మీ ప్రసంగాల్లో పదే పదే కొన్ని పదాలు తరచుగా వస్తున్నయండి. తొక్క తీస్తా, నార తీస్తా, క్రింద కుర్చోబెడతా, చెప్పుతో కొడతా, గుండు గీయిస్తా అంటున్నారు కదండి... ఇప్పటివరకూ ఎంతమందికి తీయించి క్రింద కుర్చోబెట్టారో, గుండ్లు ఎంతమందికి గీయించారో, ఎంతమందిని చెప్పుతో కొట్టారో సెలవివ్వాలండి" అంటూ సూటిగా ప్రశ్నించారు ముద్రగడ.

ఈ సందర్భంగా ముద్రగడ.. పవన్ పై సంధించిన ప్రశ్నలు తీవ్ర చర్చనీయాంశం అవుతున్నాయి.

బీసీ రిజర్వేషన్ కోసం రోడ్లమీదకు వచ్చే పరిస్థితిని ఎవరు కల్పించారు? 2014 లో చంద్రబాబు ఇచ్చిన ఎన్నికల వాగ్ధానం, ఆ సమయంలో బాబుకు పవన్ మద్దతు.. అనంతర పరిణామాలకు సంబంధించి ఈ కీలక ప్రశ్న వేశారు ముద్రగడ.

ఇక వైసీపీ ఎమ్మెల్యేలను తిట్టడం కోసం సమయం కేటాయించడం వల్ల కలిగే ప్రయోజనం శూన్యం అని కూడా అభిప్రాయపడిన ముద్రగడ... నిజంగా రాష్ట్రంపై ప్రేమ ఉంటే... విశాఖ స్టీలు ప్లాంటు, రైల్వే జోన్, కడప స్టీల్ ప్లాంట్ వంటి సమస్యలపై పోరాడాలని తెలిపారు.

ఇక తాను కాపు సభలు, ఉద్యమాలు జరిపినప్పుడు ఎన్నో సార్లు కాకినాడ ఎమ్మెల్యే చంద్రశేఖర్ రెడ్డి నుంచి, ఆయన కుటుంబం నుంచి జనాలను తరలించడానికి వాహనాలు సహాయంగా పోందేవాడినంటూ ముద్రగడం గుర్తుచేసుకున్నారు. ఈ సందర్భంగా “కాపుల తరుపున చేసిన ఉద్యమాలకు నాడు మీరెందుకు రాలేదని” తాను ప్రశ్నించదలచుకోలేదని ముద్రగడ తనదైన శైలిలో స్పందించారు.

ఇదే సమయంలో... 175 స్థానాలకు పోటీ చేసినప్పుడు "ముఖ్యమంత్రిని చేయండి" అనే పదం వాడాలి తప్ప.. కలిసి పోటీ చేసేటప్పుడు మీకు మీరే ముఖ్యమంత్రి అనుకోవడం హాస్యాస్పదంగా ఉందంటూ ముద్రగడ స్పందించారు. ఈ సమయంలో... తన కంటే చాలా బలవంతుడైన పవన్‌.. నేను వదిలేసిన ఉద్యమాన్ని చేపట్టి యువతకు రిజర్వేషన్‌ ఎందుకు తీసుకురాలేదో చెప్పాలని ముద్రగడ సూటిగా ప్రశ్నించారు.

అయితే ఈ లేఖ ప్రారంభంలో... "ఈ లేఖ మీకు రాసినందుకు ఎక్కడ లేని కోపం రావొచ్చు.. రాష్ట్రంలో ఉన్న మీ కోట్లాదిమంది అభిమానులకు అయితే నన్ను తుది ముట్టించాలని ప్రయత్నం చేయవచ్చు.. అయినా నిజాన్ని నిర్భయంగా రాయాలనిపించి రాయక తప్పలేదండి" అని మొదలుపెట్టడం గమనార్హం!!

ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లోనే కాకుండా... కాపు సామాజికవర్గ ప్రజల్లో కూడా ఈ లేఖ చర్చనీయాంశమైంది. మరి ముద్రగడ సంధించిన ఈ లేఖాస్త్రంపై పవన్ స్పందిస్తారా లేదా అన్నది వేచి చూడాలి.