Begin typing your search above and press return to search.

బాబును భ‌లే ఇరకాటంలో ప‌డేసిన ముద్ర‌గ‌డ‌

By:  Tupaki Desk   |   14 July 2017 2:10 PM GMT
బాబును భ‌లే ఇరకాటంలో ప‌డేసిన ముద్ర‌గ‌డ‌
X
కాపుల రిజ‌ర్వేష‌న్‌ కోసం పోరాటం చేస్తున్న మాజీ మంత్రి, కాపు సంఘ నాయకుడు ముద్రగడ పద్మనాభం ఏపీ ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడును ఇర‌కాటంలో ప‌డేశారు. జులై 26న చ‌లో అమ‌రావ‌తి పాద‌యాత్ర చేప‌ట్టేందుకు ముద్ర‌గ‌డ సిద్ధ‌మ‌యిన సంగ‌తి తెలిసిందే. ఈ యాత్ర‌కు అనుమ‌తి కావాల‌ని, లేని ప‌క్షంలో అడ్డుకుంటామ‌ని ఇటు ప్ర‌భుత్వం అటు పోలీసులు స్ప‌ష్టం చేస్తున్న నేప‌థ్యంలో ముద్ర‌గ‌డ మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వం అనుమతి ఇచ్చినా, ఇవ్వకపోయినా తన పాదయాత్ర ఆగదని స్పష్టం చేశారు. అనుమ‌తి విష‌యంలో ఇంత‌గా చెప్తున్న ప్ర‌భుత్వం - పోలీసులు - టీడీపీ నేత‌లు... గతంలో చంద్రబాబు పాదయాత్ర చేసినపుడు తెచ్చుకున్న అనుమ‌తి నమూనా కాపీ ఇస్తే తాను కూడా దరఖాస్తు చేసుకుంటానన్నారు. అలా అనుమ‌తి పొందిన త‌ర్వాత‌నే యాత్ర చేస్తాన‌ని ముద్ర‌గ‌డ ప‌ద్మ‌నాభం చెప్పారు.

ఎన్నిక‌ల స‌మ‌యంలో చంద్ర‌బాబు ఇచ్చిన కాపు రిజ‌ర్వేష‌న్ల హామీని నిల‌బెట్టుకోవాల‌నే తాను కోరుతున్నాన‌ని ముద్ర‌గ‌డ తెలిపారు. అయిన‌ప్ప‌టికీ తనపై ఉగ్రవాది ముద్ర వేయడం బాధాకరంగా ఉందని అన్నారు. 1994 నుంచి చరిత్ర తిరగేస్తే నేరస్తులెవరో తేలుతుందని ఆయన చెప్పారు. తన నేరచరిత్ర ఏంటో చంద్రబాబు నిరూపించాలని ముద్ర‌గ‌డ స‌వాల్ విసిరారు. 26లోగా కాపులను బీసీల్లో చేర్చుతూ అసెంబ్లిలో తీర్మానం చేసి కేంద్రానికి పంపాలని ఆయన డిమాండ్‌ చేశారు. లేనిప‌క్షంలో ప్రభుత్వం ఎన్ని అడ్డంకులు సృష్టించినా జులై 26న చేపట్టనున్న పాదయాత్రను ఆపేది లేదని ముద్రగడ పద్మనాభం స్పష్టం చేశారు.

త‌మ సామాజిక‌వ‌ర్గానికి న్యాయం చేసేందుకు అంటూ ప్ర‌భుత్వం నియ‌మించిన‌ మంజునాధ కమిషన్‌ నివేదికను సమర్పించినా నేటికీ ఎందుకు అమలు చేయడంలేదని ముద్ర‌గ‌డ ప‌ద్మ‌నాభం ప్రశ్నించారు. జీఓ 30 అమలు చేస్తామని చెప్పిన చంద్రబాబు సెక్షన్‌ 30 పెట్టి పోలీసులతో తమను భయభ్రాంతులకు గురిచేయడంలో అర్థం ఏమిటని ఆయ‌న నిల‌దీశారు. త‌మ హ‌క్కుల సాధ‌న కోసం శాంతియుతంగా పాదయాత్ర చేపడతామని, ఎన్ని కేసులు పెట్టినా వెనుకాడేదిలేదని స్పష్టం చేశారు. కేసుల విష‌యంలో ప్ర‌భుత్వ‌ బెదిరింపులు స‌రికాద‌ని అన్నారు.