Begin typing your search above and press return to search.

బాబుకు ముద్ర‌గ‌డ‌ స‌వాల్ విసిరారే!

By:  Tupaki Desk   |   11 Aug 2017 6:55 AM GMT
బాబుకు ముద్ర‌గ‌డ‌ స‌వాల్ విసిరారే!
X
కాపు ఉద్య‌మ నేత‌ - మాజీ మంత్రి ముద్ర‌గ‌డ ప‌ద్మ‌నాభం... త‌న ఉద్య‌మ తీవ్ర‌త‌ను మ‌రింత‌గా పెంచేశార‌నే చెప్పాలి. గ‌డ‌చిన ఎన్నిక‌ల్లో కాపుల‌ను బీసీల్లో చేరుస్తామంటూ టీడీపీ త‌న ఎన్నిక‌ల మేనిఫెస్టోలో ప్ర‌క‌టించిన విష‌యం తెలిసిందే. అయితే ఎన్నిక‌లు ముగిసి టీడీపీ చేతికి అధికారం వ‌చ్చి ఇప్ప‌టికే మూడేళ్లు గ‌డిచిపోయాయి. కొత్త‌గా అధికార ప‌గ్గాలు చేప‌ట్టిన చంద్ర‌బాబు స‌ర్కారుకు ఓ ఆరు నెలల పాటు స‌మ‌య‌మిచ్చిన ముద్ర‌గ‌డ‌... ఆ త‌ర్వాత త‌న ఉద్య‌మ పంథాను ప్ర‌క‌టించేశారు. ఎన్నిక‌ల్లో ఇచ్చిన హామీ మేర‌కు కాపుల‌ను బీసీల్లో చేర్చాల్సిందేన‌ని, అప్ప‌టిదాకా త‌న ఉద్య‌మం ఆగ‌బోద‌ని కూడా ఆయ‌న ప్ర‌క‌టించారు. ముద్ర‌గ‌డ ప్ర‌క‌ట‌నతో ఒక్క‌సారిగా మేల్కొన్న ప్ర‌భుత్వం జ‌స్టిస్ మంజునాథ క‌మిష‌న్‌ ను వేసి ఈ వ్య‌వ‌హారంపై అధ్య‌యనం చేయాల‌ని ఆదేశాలు జారీ చేసింది. అయితే ఎప్ప‌టిక‌ప్పుడు వాయిదాల మంత్రాన్నే చంద్ర‌బాబు ప‌ఠిస్తుండ‌టంతో చిర్రెత్తుకొచ్చిన ముద్ర‌గ‌డ‌... టీడీపీ స‌ర్కారుపై భీక‌ర పోరునే సాగించారు.

ఉద్య‌మాలంటే అస‌లు గిట్ట‌ని చంద్రబాబు కాపుల ఉద్య‌మాన్ని ఎప్ప‌టిక‌ప్పుడు అణచివేస్తూనే వ‌స్తున్నారు. ఈ క్ర‌మంలోనే తునిలో విధ్వంసం చోటుచేసుకోవ‌డంతో ముద్ర‌గ‌డ కాస్తంత వెన‌క్కు త‌గ్గినా... తిరిగి ఆయ‌న త‌న ఉద్య‌మాన్ని కొన‌సాగించారు. అయినా స‌ర్కారు నుంచి ఆయ‌న‌కు నిత్యం ఆటంకాలే ఎదుర‌వుతున్నాయి. ఈ క్ర‌మంలో నిన్న తూర్పుగోదావ‌రి జిల్లా కిర్లంపూడిలోని త‌న స్వ‌గృహంలో నిర్వ‌హించిన కాపు నేత‌ల స‌మావేశంలో ముద్ర‌గ‌డ కీల‌క నిర్ణ‌య‌మే తీసుకున్నారు. మొత్తం 13 జిల్లాల‌కు చెందిన కాపు నేత‌ల‌తో స‌మావేశ‌మైన ముద్ర‌గ‌డ‌... కాపులకు రిజ‌ర్వేష‌న్లు సాధించే క్ర‌మంలో ప‌క్కా ప్ర‌ణాళిక‌నే ర‌చించుకున్న‌ట్లుగా స‌మాచారం. ఈ క్ర‌మంలో స‌మావేశం ముగిసిన అనంత‌రం బ‌య‌ట‌కు వ‌చ్చిన ముద్ర‌గ‌డ‌... అక్క‌డే మీడియాతో మాట్లాడుతూ చంద్ర‌బాబుకు భారీ స‌వాల్‌ నే విసిరారు. కాపుల‌కు రిజ‌ర్వేష‌న్లు సాధించే వ‌రకు తాను విశ్ర‌మించే ప్ర‌సక్తే లేద‌ని ప్ర‌క‌టించిన ముద్ర‌గ‌డ‌... ఈ సంద‌ర్భంగా చంద్ర‌బాబుకు ఓ పెద్ద స‌వాల్‌ నే విసిరారు.

ఆ స‌వాల్ విష‌యానికి వ‌స్తే... ప్ర‌భుత్వం ఎన్ని అడ్డంకులు క‌ల్పించినా... తాను అమ‌రావ‌తికి పాద‌యాత్ర చేసి తీర‌తాన‌ని ఆయ‌న ప్ర‌క‌టించారు. అమ‌రావ‌తి దాకా న‌డిచే స‌త్తా త‌న‌కు ఉంద‌ని కూడా ఆయ‌న వ్యాఖ్యానించారు. అయితే గియితే... ప్ర‌భుత్వం త‌న యాత్ర‌ను అడ్డుకోవాల‌ని, అలా అడ్డుకుంటే తాను ఉద్య‌మాన్నే వ‌దిలేస్తాన‌ని కూడా ముద్ర‌గ‌డ ప్ర‌క‌టించారు. ఒక‌వేళ తాను ప్ర‌భుత్వ అడ్డంకుల‌ను అధిగ‌మించి అమరావ‌తి దాకా న‌డిచి వ‌స్తే... చంద్ర‌బాబు త‌న సీఎం ప‌ద‌వికి రాజీనామా చేయాల‌ని కూడా ఆయ‌న డిమాండ్ చేశారు. త‌న పాద‌యాత్ర‌తో సీఎం ప‌ద‌వికి లింకు పెట్టిన ముద్ర‌గ‌డ... టీడీపీ స‌ర్కారుకు నిజంగానే పెద్ద స‌వాల్‌ నే విసిరిన‌ట్టుగా విశ్లేష‌ణ‌లు సాగుతున్నాయి. మ‌రి ముద్ర‌గ‌డ స‌వాల్‌కు అటు టీడీపీ నుంచి గానీ, సీఎం చంద్ర‌బాబు నుంచి గానీ ఎలాంటి రిప్లై వస్తుంద‌న్న విష‌యం ఇప్పుడు ఆస‌క్తిక‌రంగా మారింద‌నే చెప్పాలి.