Begin typing your search above and press return to search.

ఇదే ఆఖ‌రు..ఇక ఓపిక లేదంటున్న ముద్ర‌గ‌డ

By:  Tupaki Desk   |   12 July 2017 5:44 AM GMT
ఇదే ఆఖ‌రు..ఇక ఓపిక లేదంటున్న ముద్ర‌గ‌డ
X
కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం త‌న పోరాట పంథాకు ఊహించ‌ని ట్విస్ట్ ఇచ్చారు. గ‌త రెండేళ్లుగా త‌మ సామాజిక‌వ‌ర్గానికి రిజ‌ర్వేష‌న్ల కోసం ఉద్య‌మిస్తున్న ముద్ర‌గ‌డ ఇక త‌న‌కు ఓపిక న‌శించి పోయింద‌ని ప్ర‌క‌టించారు. వ‌చ్చే నెల 26న త‌ల‌పెట్టిన చ‌లో అమరావ‌తి ఆఖ‌రిపోరాటంగా నిలిచి విజ‌యం సాధించాల్సిందేన‌ని ఆయ‌న స్ప‌ష్టం చేశారు. పిఠాపురంలో కాపు ఐక్యవేదికలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ కాపు ఉద్యమం ప్రారంభించి రెండేళ్లు పూర్తవుతున్న సందర్భంగా ఈ నెల 26న చలో అమరావతి - చావో రేవో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. ఈ సంద‌ర్భంగా ముద్ర‌గ‌డ ఆస‌క్తిక‌ర‌మైన వ్యాఖ్య‌లు చేశారు. `ఇక నాకు ఓపిక లేదు... ఉద్యమాలు చేసి అలసిపోయా... ఇదే ఆఖరి పోరాటం.. ఉద్యమాన్ని ఆపితే ఆ మరునాడే మళ్ళీ మొదలు పెడదాం.. మిలటరీ మాధవపురం స్ఫూర్తిగా ఇంటికి ఒక కాపు తరలి రావాలి`` అని పిలుపునిచ్చారు.

ఏపీ ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబునాయుడు ప్రభుత్వం కాపులను అణిచివేయడానికి ప్రయత్నిస్తోందని ముద్రగడ ఆరోపించారు. ప్రభుత్వం కాపులు - బీసీ - ఎస్సీల మధ్య చిచ్చు పెడుతోందని మండిప‌డ్డారు. ఉద్యమాన్ని ఆపడానికి ఇప్పటికే జిల్లా అంతటా పోలీసులను దింపేశారని వాపోయారు. అయితే చంద్ర‌బాబు ప్ర‌భుత్వం అణిచివేత విధానాల‌పై తాము ప్ర‌జాస్వామ్య‌యుతంగానే పోరాటం చేస్తామ‌ని, త‌మ హ‌క్కుల‌ను సాధించుకుంటామ‌ని ముద్ర‌గ‌డ ప్ర‌క‌టించారు. కాపు రిజర్వేషన్ కోసం ఇప్పటికే పలు రాష్ట్రాల న్యాయవాదులతో మేథోమధనం జరిపామన్నారు. ఎన్నో ఉద్యమాలు చేసి అలసిపోయిన తాను పిలిచినా ఇక జనం వస్తారన్న నమ్మకం లేద‌ని అందుకే ఇదే చివరి ఉద్యమం కావాల‌ని ముద్ర‌గ‌డ నిరాశ‌పూర్వ‌కంగా అన్నారు.