Begin typing your search above and press return to search.

మొదటి రీల్ నుంచి చూడవా చంద్రబాబు

By:  Tupaki Desk   |   4 March 2016 12:06 PM IST
మొదటి రీల్ నుంచి చూడవా చంద్రబాబు
X
కాపుల రిజర్వేషన్లపై ఏపీ సర్కారుకు.. కాపు ఉద్యమ నేత కమ్ మంత్రి ముద్రగడ పద్మనాభంకు మధ్య మాటల యుద్ధం సాగుతున్న సంగతి తెలిసిందే. కాపుల్ని బీసీల్లో చేర్చాలంటూ ఉద్యమం చేయటం.. ఆయకు హామీలు ఇచ్చి దీక్షను విరమించేలా చేశారు. అయితే.. తనకిచ్చిన హామీల్ని అమలు చేసే విషయంలో చంద్రబాబు మోసం చేశారంటూ ఆరోపిస్తున్నముద్రగడ.. అందులో భాగంగా తీవ్ర పదజాలంతో ఇటీవల ఒక లేఖ రాశారు.

దీనిపై చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేయటంతో పాటు.. ఈ లేఖ వెనుక విపక్ష నేత జగన్ ఉన్నట్లుగా ఆరోపించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు మాటలకు తగ్గట్లే పలువురు మంత్రులు.. ముద్రగడపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. దీంతో.. వాతావరణం హాట్ హాట్ గా మరింది. ఇదిలా ఉంటే తాజాగా ముద్రగడ పద్మనాభం మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబుపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.

తన వెనుక జగన్మోహన్ రెడ్డి ఉన్నారన్న ఆరోపణపై స్పందించిన ఆయన.. తన రాజకీయ అనుభవమంత వయసు లేని జగన్ తో తాను ఉండాల్సిన అవసరం ఏమిటని ప్రశ్నించటంతోపాటు.. తన వెనుక కానీ జగన్ ఉన్నట్లుగా నిరూపిస్తే.. రాజకీయాల నుంచి తాను.. తన కుటుంబ సభ్యులు వైదొలుగుతామని.. ఒకవేళ ఆ ఆరోపణల్ని నిరూపించని పక్షంలో చంద్రబాబు ఆయన కుటుంబ సభ్యులు రాజకీయాల నుంచి వైదొలుగుతారా? అని ప్రశ్నించారు.

తానీ మధ్య రాసిన లేఖలో కొన్ని పదాల్ని ప్రస్తావించి.. ఫైర్ అయిపోతున్న ముఖ్యమంత్రి.. తన లెటర్ మొత్తం చదవాలని కోరారు. సినిమాను మొదటి రీలు నుంచి.. పుస్తకాన్ని మొదటి పేజీ నుంచి చదవకుండా మధ్య మధ్యలో చూసినా.. చదివినా అర్థం ఉండదని.. తాను ప్రస్తావించిన అంశాల్ని పట్టించుకోని ముఖ్యమంత్రి కొన్ని పదాల్ని మాత్రమే పట్టించుకోవటం ఏమిటని నిలదీశారు.

తన డిమాండ్లపై ముఖ్యమంత్రి స్పందించని పక్షంలో ఈ నెల 11 నుంచి ఆమరణ నిరాహార దీక్ష చేయనున్నట్లు ముద్రగడ వెల్లడించారు. కాపులకు ఇస్తున్న రుణాల మీద తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వైఎస్ అంటే తనకు ప్రేమ అని.. తాను కష్టాల్లో ఉన్నప్పుడు ఇంతమంది నేతలు ఉన్నా ఎవరూ పట్టించుకోకున్నా.. వైఎస్ మాత్రం తనకు సాయం చేసేందుకు నాలుగుసార్లు ప్రయత్నించినా.. తాను వద్దంటూ సున్నితంగా తిరస్కరించానని.. తన పట్ల ప్రేమ చూపిన వైఎస్ అంటే అందుకే ప్రేమ అని చెప్పుకొచ్చారు. వైఎస్ మీదున్న ప్రేమ కారణంగానే.. జగన్ తనను ఓదార్పు యాత్ర చేయమన్నప్పుడు అంగీకరించానే తప్పించి.. ఆ తర్వాత తాను జగన్ తో కలిసింది లేదన్నారు.

తన ఫోన్లు ట్యాప్ చేస్తున్నారని.. తనకు సంబంధించిన అన్ని వివరాలు ప్రభుత్వం దగ్గర ఉన్నాయని.. తన వెనుక జగన్ ఉంటే.. ఆధారాలతో నిరూపించాలని సవాలు విసిరారు. తన గురించి పిచ్చి పిచ్చిగా మాట్లాడొద్దు ముఖ్యమంత్రి గారు అంటూ ముద్రగడ మండిపడ్డారు.