Begin typing your search above and press return to search.

ఇలాంటి వాటికా సీమాంధ్రుల్లో సురుకు పుట్టేది?

By:  Tupaki Desk   |   9 Jun 2016 4:29 PM GMT
ఇలాంటి వాటికా సీమాంధ్రుల్లో సురుకు పుట్టేది?
X
సీమాంధ్రులు తాము కోరుకున్నది ఎందుకు సాధించలేరు? రాజకీయంగా పోటుగాళ్లమని చెప్పుకునే వారు.. తమ రాష్ట్ర ప్రయోజనాల్ని పరి రక్షించుకునే విషయంలో.. రాష్ట్రానికి ఇచ్చిన డిమాండ్ల సాధన విషయంలో వారు ఎందుకు సక్సెస్ కారన్న సందేహం పలువురిలో ఉంటుంది. బలమైన నేతలున్నా.. వారికి క్యాడర్ ఉన్నా.. జాతీయస్థాయిలో వారికి ఎప్పుడూ చుక్కెదురే ఎందుకన్నది చాలామంది అర్థం కాదు. తాజాగా చోటు చేసుకున్న సంఘటన చూసినప్పుడు సీమాంధ్రుల లోపం ఏమిటో ఇట్టే అర్థమవుతుంది.

రాష్ట్ర విభజన సందర్భంగా ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామంటూ ప్రధాని హోదాలో ఉన్న వ్యక్తి రాజ్యసభలో హామీ ఇస్తే.. ప్రధాని అభ్యర్థిగా బరిలో ఉన్న మోడీ తాను పీఎం అయితే.. ఆ హామీని ఐదేళ్లు కాదు.. అంతకంటే ఎక్కువే చేస్తానని హామీలు ఇచ్చారు. అది కూడా ఎక్కడో కాదు.. సీమాంధ్ర గడ్డ మీద నిలబడే. అలాంటి వారి మాటలన్నీ పవర్ చేతికి రాగానే తూచ్ అన్నాయి. అసలు విభజన కారణంగా జరిగిన నష్టం ఒక ఎత్తు అయితే.. నేతలు ఇచ్చిన హామీలు విస్మరించటం వల్ల జరుగుతున్న నష్టం అంతాఇంతా కాదు.

కానీ.. అదేమీ పట్టనట్లుగా అటు నేతలే కాదు.. ఇటు ప్రజలు కూడా వ్యవహరించటం సీమాంధ్రులకే చెల్లింది. తమకు జరుగుతున్న కష్టనష్టాలకు కారణం మీరు కాదా? అంటూ అధికారపక్షమైన తెలుగుదేశం.. బీజేపీ నేతల గల్లా పట్టుకొని అడగాలి కదా? మరీ అంత మొరటుగా ఏం చేస్తామనుకుంటే.. ఏపీకి ప్రత్యేక హోదా ఇచ్చేది లేదు తూచ్ అంటూ నిర్మోహమాటంగా మాటలు అనేస్తే.. సీమాంధ్ర మొత్తం ఎంతగా రగిలిపోవాలి? తమను ఇంత మోసం చేస్తారా? అని ఎంతగా ఉడికి పోవాలి? కానీ.. అలాంటిది ఏమీ లేకుండా ఎవరి పని వారు చేసుకునే పరిస్థితి. ఒక్కరంటే ఒక్కరు కూడా బంద్ కో.. నిరసనలకో పిలుపు ఇవ్వని దుస్థితి.

దీన్ని ఇలా కట్ చేస్తే.. తాజాగా కాపుల రిజర్వేషన్ల కోసం ముద్రగడ దీక్ష చేయటం.. అలా చేసిన క్రమంలో తునిలో విధ్వంసకాండ సృష్టిస్తే.. అలా చేసిన వారిని పోలీసులు అరెస్ట్ చేసినందుకు నిరసనగా ముద్రగడ మరోసారి దీక్షకు కూర్చున్న పరిస్థితి. అలా కూర్చున్న వెంటనే.. శాంతిభద్రతల సమస్య వస్తుందన్న ఉద్దేశ్యంతో పోలీసులు ఆయన్ను అరెస్ట్ చేస్తే.. అందుకు నిరసనగా రేపు కోనసీమ బంద్ కు పిలుపునివ్వటం చూస్తే.. సీమాంధ్రుల ప్రాధాన్యత దేనికన్న విషయం అర్థమై షాక్ తినే పరిస్థితి. రాష్ట్రం మొత్తానికి.. రాష్ట్రంలోని ప్రజలందరికి తీరని నష్టం జరిగితే స్పందించని సీమాంధ్రులు.. ఒక కుల నాయకుడు.. అది కూడా చట్టాన్ని లెక్క చేయకుండా తమ ఆవేశంతో ఇష్టారాజ్యంగా విధ్వంసకాండ చేస్తే.. దానికి అండగా నిలిచిన నేత అరెస్ట్ కు నిరసనగా బంద్ పిలుపునివ్వటం ఒక పట్టాన మింగుడుపడని వ్యవహారంగా చెప్పాలి. ఇలాంటివి సీమాంధ్రుల్ని చులకన చేయవా..? ప్రాంత ప్రయోజనాలకు తీవ్ర భంగం వాటిల్లితే రగిలిపోని సీమాంధ్రులు.. కులం ప్రాతిపదికన ఒక అంశానికి మరీ ఇంతలా రియాక్ట్ అవుతారా..?