Begin typing your search above and press return to search.

తెలుగోడి చేతికి టీమిండియా సెలెక్ష‌న్ బాధ్య‌త‌లు

By:  Tupaki Desk   |   21 Sep 2016 9:34 AM GMT
తెలుగోడి చేతికి టీమిండియా సెలెక్ష‌న్ బాధ్య‌త‌లు
X
టీమిండియా మాజీ క్రికెట‌ర్ ఎంఎస్కే ప్ర‌సాద్(మ‌న్న‌వ శ్రీ‌కాంత్ ప్ర‌సాద్‌)కు అరుదైన గౌర‌వ ద‌క్కింది. టీమిండియా చీఫ్ సెలెక్ట‌ర్‌ గా ఆయ‌న‌ను ఎంపిక చేస్తూ కొద్దిసేప‌టి క్రితం బీసీసీఐ కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ఇప్ప‌టిదాకా బీసీసీఐ చీఫ్ సెలెక్ట‌ర్ గా కొన‌సాగిన సందీప్ పాటిల్ స్థానంలో ఎంఎస్‌కే ప్ర‌సాద్ కొత్త‌గా బాధ్య‌త‌లు స్వీక‌రించ‌నున్నాడు. ప్ర‌స్తుతం సందీప్ పాటిల్ ఆధ్వ‌ర్యంలోని సెలెక్ష‌న్ క‌మిటీలో ప్ర‌సాద్ కూడా స‌భ్యుడిగా ఉన్నాడు. 90వ ద‌శ‌కంలో స్వ‌ల్ప‌కాలం పాటు టీమిండియాలో స‌భ్యుడిగా కొన‌సాగిన ఎంఎస్కే.. భార‌త్ త‌ర‌ఫున వ‌న్డే - టెస్టు మ్యాచ్ లు ఆడాడు.

1998లో బంగ్లాదేశ్ తో జ‌రిగిన మ్యాచ్ లో వ‌న్డేల్లో అరంగేట్రం చేసిన ఎంఎస్కే... ఆ మ‌రుస‌టి ఏడాదే న్యూజిల్యాండ్ తో మొహాలీలో జ‌రిగిన మ్యాచ్ తో టెస్టు క్రికెట్ లోకి అడుగుపెట్టాడు. చాలా స్వ‌ల్ప‌కాలమే జ‌ట్టులో కొన‌సాగిన ఎంఎస్కే... 2000 ఏడాదిలో టెస్టు జ‌ట్టులో స్థానం కోల్పోయాడు. ఆ త‌ర్వాత జ‌ట్టులో తిరిగి స్థానం సాధించ‌లేక‌పోయాడు. ఫస్ట్ క్లాస్ క్రికెట్ లో మొత్తంగా 96 మ్యాచ్ లు ఆడిన ఎంఎస్కే... 27.73 స‌గ‌టుతో 4021 ప‌రుగులు చేశాడు.బ్యాట్స్ మ‌న్ గానే కాకుండా వికెట్ కీప‌ర్ గా త‌న‌దైన ప్ర‌త్యేక‌త చాటుకున్న ఎంఎస్కే... కీప‌ర్ గా 266 మందిని ఔట్ చేశాడు. 2007-08 మ‌ధ్య కాలంలో ఆంధ్రా క్రికెట్ జ‌ట్లు కెప్టెన్ గా బాధ్య‌త‌లు నిర్వ‌ర్తించిన ఎంఎస్కే... 2008లో జెంటిల్మ‌న్ గేమ్ కు రిటైర్ మెంట్ ప్ర‌క‌టించాడు. ఆట‌లో అంత‌గా స‌త్తా చాట‌లేక‌పోయిన... జెంటిల్మ‌న్ గేమ్‌ నిర్వ‌హ‌ణ‌లో మాత్రం స‌త్తా క‌లిగిన వ్య‌క్తిగా పేరు సాధించాడు. ఆంధ్రా క్రికెట్ అసోసియేష‌న్ త‌ర‌ఫున బీసీసీఐలో ఎంట‌రైన ఎంఎస్కే... తాజాగా జ‌ట్టునే ఎంపిక చేసే చీఫ్ సెలెక్ట‌ర్ హోదాను పొంద‌డం గ‌మ‌నార్హం.