Begin typing your search above and press return to search.

50 దంచాడు.. ద్రవిడ్ ను మించాడు.. ధోని లేటు వయసు రికార్డు

By:  Tupaki Desk   |   27 March 2022 7:44 AM GMT
50 దంచాడు.. ద్రవిడ్ ను మించాడు.. ధోని లేటు వయసు రికార్డు
X
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 15వ ఎడిషన్ శనివారం సాదాసీదాగా ప్రారంభమైంది. గత ఎడిషన్ ఫైనలిస్టులు కోల్ కతా నైట్ రైడర్స్ (కేకేఆర్), చెన్సై సూపర్ కింగ్స్ (సీఎస్కే) మధ్య జరిగిన తొలి మ్యాచ్ చప్పగా సాగింది. సిక్సర్ల హోరు లేదు.. ఫోర్ల మెరుపులు లేవు.. టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన చెన్సై.. తొలి ఓవర్లోనే రుతురాజ్ గైక్వాడ్ (0) వికెట్ ను కోల్పోయింది.

ఆపై ఇక కోలుకోనేలేదు. మరో ఓపెనర్ డెవాన్ కాన్వె (3) కూడా తొందరగానే వెనుదిరిగాడు. ఉతప్ప (28), రాయుడు (15) నిలిచినా.. భారీ స్కోర్లు సాధించలేకపోయారు. 11 ఓవర్లలోపే 61 పరుగులకే 5 వికెట్లు కోల్పోయిన సీఎస్కే.. కనీసం వందైనా చేస్తుందా? అనిపించింది. అయితే, కెప్టెన్ గా తొలి మ్యాచ్ ఆడుతున్న రవీంద్ర జడేజా (26 నాటౌట్), మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని (38 బంతుల్లో 50, 7 ఫోర్లు, సిక్స్) వికెట్ల పతనానికి అడ్డుగోడలా నిలిచి 70 పరుగులు జోడించారు.

దీంతో చెన్సై 131 పరుగులు చేయగలిగింది. కానీ, ఈ మోస్తరు లక్ష్యాన్ని కోల్ కతా అవలీలగా ఛేదించింది. దీంతో డిఫెండింగ్ చాంపియన్ సీఎస్కేకు పరాజయం తప్పలేదు. అయితే, ఈ మ్యాచ్ లో ధోని ఆట చివరకు హైలైట్ గా నిలిచింది. ఎన్నాళ్లకెన్నాళ్లకో..? వయసు పైబడి.. ఆటలో దూకుడు తగ్గి.. టచ్ కోల్సోయి.. కేవలం కీపింగ్, కెప్టెన్సీ నైపుణ్యాలతో జట్టులో ఉంటున్న ధోని.. విమర్శలకు తనదైన స్టైల్ లో సమాధానమిచ్చాడు. చెన్నై ఓడినప్పటికీ.. ఆ జట్టు ఫ్యాన్స్ ను ధోనీ బ్యాటింగ్ అలరించింది.

అన్నట్లు.. ఐపీఎల్ 14 సీజన్లలోనూ కెప్టెన్ గానే బ్యాటింగ్ కు దిగిన ధోని.. ఈసారి కేవలం బ్యాట్స్ మన్ గా క్రీజులో అడుగుపెట్టాడు. వాస్తవానికి గత రెండు సీజన్లలో పరుగులు చేయడానికి ధోని ఇబ్బంది పడ్డాడు. బ్యాటింగ్ అనుకూల వికెట్ పైనా నిరాశపర్చాడు. కానీ, నిన్నటి మ్యాచ్ లో మాత్రం మిగతా అందరికంటే ఎక్కువ ఆకట్టుకున్నాడు. 38 బంతుల్లో 50 పరుగుల అజేయ ఇన్నింగ్స్ తో మైమరిపించాడు. ఈ హాఫ్ సెంచరీతో ధోని ఖాతాలో అదిరిపోయే రికార్డు చేరింది.

ఐపీఎల్‌లో అతి పెద్ద వయసులో హాఫ్ సెంచరీ చేసిన బ్యాటర్‌గా సరికొత్త రికార్డు క్రియేట్ చేశాడు ఎమ్మెస్ ధోనీ. ధోనీ వయసు ప్రస్తుతం 40 ఏళ్ల 262 రోజులు. దీంతో రాహుల్ ద్రావిడ్ రికార్డును బ్రేక్ చేశాడు మహేంద్రుడు. ఐపీఎల్‌లో 40 ఏళ్లు దాటిన తర్వాత నాలుగు హాఫ్ సెంచరీలు చేసిన రాహుల్ ద్రావిడ్, 40 ఏళ్ల 116 రోజుల వయసులో ఆఖరి హాఫ్ సెంచరీ కొట్టాడు. ఆ రికార్డును బ్రేక్ చేశాడు ఎమ్మెస్ ధోనీ.

మూడేళ్ల తర్వాత ధోని అర్ధ శతకం అంతర్జాతీయ వన్డే క్రికెట్ కు రిటైర్మెంట్ కు ముందు.. వన్డే ప్రపంచ కప్ కు ముందు.. జరిగిన 2019 ఐపీఎల్ లో ధోని చివరిసారిగా హాఫ్ సెంచరీ చేశాడు. అంటే.. 2019 సీజన్‌లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరుపై బెంగళూరులో దీనిని సాధించాడు. నాడు 48 బంతుల్లో 84 పరుగులు చేశాడు. అయితే, రెండు సీజన్లలో హాఫ్ సెంచరీ సాధించలేకపోయాడు.

గత ఐపీఎల్‌లో అయితే మాహీ అత్యధిక స్కోరు 18 పరుగులే. కానీ, ఈసారి మాత్రం తొలి మ్యాచ్ లోనే హాఫ్ సెంచరీతో దుమ్మురేపాడు. అన్నిటికి మించి.. ధోని బ్యాటింగ్ లో గేరు మార్చిన తీరు హైలైట్ గా నిలిచింది. 5వ బంతికి ఖాతా తెరిచిన అతడు.. 20 బంతుల వరకు చేసింది 15 పరుగులే. అయితే, చివరి మూడు ఓవర్లలో 35 పరుగులు సాధించి అర్ధ సెంచరీని అందుకున్నాడు.

ఇందులో 6 ఫోర్లు, సిక్సర్ ఉండడం విశేషం. మొత్తమ్మీద ఐపీఎల్ లోనే కాదు.. క్రికెట్ లోనే మూడేళ్ల తర్వాత ధోని బ్యాట్ పైకెత్తడాన్ని (అర్ధ సెంచరీ అభివాదం) చూశాం. అన్నట్లు.. ధోని చివరిసారిగా 2019 వన్డే ప్రపంచ కప్ సెమీస్ లో అంతర్జాతీయ మ్యాచ్ ఆడాడు. ఆ మ్యాచ్ లోనూ సరిగ్గా 50 పరుగులే చేశాడు. చివరి ఓవర్లో గప్టిల్ అద్భుత త్రోకు రనౌట్ గా వెనుదిరిగాడు.