Begin typing your search above and press return to search.

ఆర్మీలో ధోని ఎక్కడ.. ఏం చేయబోతున్నాడంటే?

By:  Tupaki Desk   |   26 July 2019 7:00 AM IST
ఆర్మీలో ధోని ఎక్కడ.. ఏం చేయబోతున్నాడంటే?
X
ప్రపంచకప్ తర్వాత రిటైరవుతాడనే ఊహాగానాలకు కాస్త బ్రేక్ ఇస్తూ మహేంద్రసింగ్ ధోని.. కొన్ని రోజుల పాటు సైన్యంలో సేవలందించడానికి సిద్ధమైన సంగతి తెలిసిందే. అతను ఎక్కడ పని చేయబోతున్నాడు.. ఏం చేయబోతున్నాడు అన్నది ఆసక్తికరంగా మారింది. ఈ విషయంలో సైన్యం నుంచే సమాచారం బయటికి వచ్చింది. లెఫ్టినెంట్‌ కల్నల్‌ హోదా కలిగిన ధోని జులై 31 నుంచి ఆగస్ట్‌ 15 వరకు కశ్మీర్‌ లోయలో సేవలందించనున్నాడు. దీనికి సంబంధించి ఆర్మీ ఓ ప్రకటన విడుదల చేసింది. కశ్మీర్‌ లోయలోని సైనికులతో కలిసి పెట్రోలింగ్‌ - గార్డ్‌ - పోస్ట్‌ గార్డ్‌ డ్యూటీల్లో ధోని పాల్గొనబోతున్నాడని వెల్లడైంది.

కశ్మీర్‌ వ్యాలీలోని సైనిక శిబిరాల్లో సైనికులతో కలిసి దేశ రక్షకుడిగా ధోనీ విధులు నిర్వహించనున్నాడు. 2011 సంవత్సరంలోనే గౌరవ లెఫ్టినెంట్ కల్నల్ హోదా పొందిన ధోని.. టెరిటోరియల్ ఆర్మీకి చెందిన 106 ఇన్ ఫాంట్రీ బెటాలియన్‌ కు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. ఈ బెటాలియన్ బెంగళూరు హెడ్ క్వార్టర్స్ కేంద్రంగా పని చేస్తుంది. 2015లో ధోని తొలిసారి సైనిక పారాట్రూపర్‌ గా నెలరోజుల పాటు శిక్షణ కూడా తీసుకున్నాడు. అప్పుడతను పెద్ద సాహసమే చేశాడు. 250 అడుగుల ఎత్తులో ఏఎన్ 32 సైనిక విమానం నుంచి ధోని.. ప్యారాచూట్ సహాయంతో కిందకు దూకి.. నేల మీద సురక్షితంగా ల్యాండయ్యాడు. దీంతో అతడికి ప్యారాట్రూపర్‌ గా అర్హత వచ్చింది.