Begin typing your search above and press return to search.

ఈసారి హ‌రీశ్‌ ను ఎమ్మార్పీఎస్ అడ్డుకుంది

By:  Tupaki Desk   |   10 Nov 2015 9:33 AM GMT
ఈసారి హ‌రీశ్‌ ను ఎమ్మార్పీఎస్ అడ్డుకుంది
X
వ‌రంగ‌ల్ ఉప ఎన్నిక‌ల్లో దూసుకెళ్లాల‌ని భావిస్తున్న టీఆర్ ఎస్ నేత‌ల‌కు రోజుకో ఇబ్బంది ఎదురువుతోంది. ఆస‌క్తిక‌ర‌మైన విష‌యం ఏమిటంటే.. అధికార‌ప‌క్షానికి ఇంత‌గా చిరాకు పుట్టిస్తున్న వారు విప‌క్షాలు కాకుండా ఉండ‌టం. అధికార‌ప‌క్షానికి పంటి కింద రాయిలా.. కంట్లో న‌లుసులా విప‌క్షాలు ఉంటాయి. దీనికి భిన్నంగా రైతులు.. సామాన్యులు ఉండ‌టం కాస్తంత చిత్ర‌మైన వ్య‌వ‌హారంగా చెప్పాలి.

వ‌రంగ‌ల్ ఉప ఎన్నిక‌ల ప్ర‌చారంలో ఉప ముఖ్య‌మంత్రి క‌డియం శ్రీహ‌రి.. మంత్రి హ‌రీశ్ రావు మొద‌లుకొని ప‌లువురు ఎమ్మ‌ల్యేలు.. ఎమ్మెల్సీల‌ను రైతులు.. సామాన్యులు ఇంత‌కాలం అడ్డుకోవ‌టం.. ప్ర‌శ్నించ‌టం.. ప్ర‌భుత్వం మీద త‌మ అసంతృప్తిని వ్య‌క్తం చేయ‌టం తెలిసిందే. తాజాగా వారికి తోడుగా ఎమ్మార్పీఎస్ కార్య‌క‌ర్త‌లు చేరారు. మొన్నామ‌ధ్య మంత్రి హ‌రీశ్ ను త‌మ ప్ర‌శ్న‌ల‌తో సాదాసీదా ప్ర‌జ‌లు ఉక్కిరిబిక్కిరి చేస్తే.. నేడు ఎమ్మార్పీఎస్ కార్య‌క‌ర్త‌లు అడ్డుకునే ప్ర‌య‌త్నం చేశారు. ఎన్నిక‌ల ప్ర‌చారానికి వ‌చ్చిన మంత్రి హ‌రీశ్‌ ను అడ్డుకున్న ఎమ్మార్పీఎస్ కార్య‌క‌ర్త‌లు.. వ‌ర్గీక‌ర‌ణ‌పై త‌మ‌కు స్ప‌ష్ట‌మైన మాట చెప్పాల‌ని హ‌రీశ్ ను డిమాండ్ చేశారు. మొత్తానికి వ‌రంగ‌ల్ ఉప ఎన్నిక‌ల ప్ర‌చారంలో తెలంగాణ అధికార ప‌క్షానికి మ‌రెన్ని చికాకులు ఎదురుకానున్నాయో..?