Begin typing your search above and press return to search.

నిన్న అంగన్‌వాడీలు.. నేడు.. వర్గీకరణ

By:  Tupaki Desk   |   18 March 2015 7:03 AM GMT
నిన్న అంగన్‌వాడీలు.. నేడు.. వర్గీకరణ
X
ఏపీ అసెంబ్లీ సమావేశాలు తీవ్ర ఉద్రిక్తతల మధ్య సాగుతున్నాయి. ఓ పక్క సభలో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ అధినేత వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి ఎదురుదాడితో ఉక్కిరిబిక్కిరి అవుతున్న ఏపీ అధికారపక్షం మరోవైపు అసెంబ్లీ వెలుపల వరుస ఆందోళనలతో ఇబ్బంది పడుతోంది.

మంగళవారం వామపక్షాల నేతృత్వంలో అంగన్‌వాడీల ఛలోఅసెంబ్లీ కార్యక్రమం సాగి.. ప్రభుత్వానికి ఇబ్బందికరంగా మారింది. సీమాంధ్ర నుంచి వచ్చిన అంగన్‌వాడీ కార్యకర్తల నిరసనతో బాబు సర్కారు ఇబ్బంది పడుతోంది. దీనిపై కాస్తంత ఆలస్యంగా స్పందించిన చంద్రబాబు అంగన్‌వాడీలతో మాట్లాడి వారి సమస్యల్ని తీరుస్తానని ప్రకటించారు.

ఛలో అసెంబ్లీకి ముందే ఈ మాట చెప్పేసి ఉంటే బాగుండేది కదా అన్న అభిప్రాయం వ్యక్తమవుతున్న పరిస్థితి. ఇదిలా ఉంటే.. తాజాగా ఎస్సీ వర్గీకరణ కోసం ఎమ్మార్పీఎస్‌ కార్యకర్తల నేతృత్వంలో అసెంబ్లీ ముట్టడి కార్యక్రమం చేపట్టారు.

ఓ పక్క ఏపీ అసెంబ్లీ సాగుతుంటే.. మరోవైపు అసెంబ్లీ వెలుపల ఎమ్మార్పీఎస్‌ కార్యకర్తలు ఆందోళనతో అట్టుడికిపోతోంది. వందలాది మంది విడతల వారీగా అసెంబ్లీ వైపునకు దూసుకొస్తూ భద్రతా సిబ్బందికి చెమటలు పట్టిస్తున్నారు. ఏ వైపు నుంచి ఎవరు ఎలా వస్తారో అర్థం కాక.. వారు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు.

ఇలా ఒకరోజు అంగన్‌వాడీలు.. తాజాగా వర్గీకరణ ఇష్యూతో చంద్రబాబు సర్కారు తీవ్ర స్థాయిలో ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు. అంగన్‌వాడీల విషయంలో మాట ఇచ్చిన చంద్రబాబు.. తాజాగా వర్గీకరణ అంశంపై ఏం మాట్లాడతారో చూడాలి.