Begin typing your search above and press return to search.

మళ్లీ టీమిండియా జెర్సీలో మిస్టర్ కూల్ !

By:  Tupaki Desk   |   18 Oct 2021 8:34 AM GMT
మళ్లీ టీమిండియా జెర్సీలో మిస్టర్ కూల్ !
X
ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రికెట్ లవర్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న ధనాధన్ టోర్నీ టీ -20 వరల్డ్ కప్ మొదలైంది. ఇక, టీ20 వరల్డ్ కప్‌లో తొలి మ్యాచ్‌ లో టీమిండియా పాకిస్తాన్‌ తో తలపడనుంది. అక్టోబర్ 24న దుబాయ్ వేదికగా ఈ మ్యాచ్ జరుగుతంది. ఆ తర్వాత అక్టోబర్ 31న న్యూజిలాండ్‌ తో, నవంబర్ 3న అఫ్గానిస్తాన్‌ తో, నవంబర్ 5న రౌండ్‌ 1లో గ్రూప్ బిలో టాప్-2గా నిలిచిన జట్టుతో, నవంబర్ 8న రౌండ్‌ 1లో గ్రూప్ ఏలో టాప్-2గా నిలిచిన జట్టుతో భారత్ తలపడనుంది. మరోవైపు, టీమిండియా ఈ మెగా టోర్నీలో హాట్ ఫేవరెట్ గా బరిలోకి దిగుతోంది. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్, రవీంద్ర జడేజా, ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, వరుణ్ చక్రవర్తి లాంటి గేమ్ చేంజర్లు టీమిండియాలో ఉన్నారు.

ఇక, టీమిండియా మెంటార్ గా ధోనీ ఉండటం కోహ్లీసేనకు అదనపు బలం. టీమిండియా ఈ మెగా టోర్నీ కోసం ప్రాక్టీస్ మొదలుపెట్టింది. కోహ్లీసేన మొదటి సారి గ్రౌండ్ లోకి అడుగుపెట్టి ట్రైనింగ్ సెషన్ లో బిజీ అయింది. అయితే, ఈ సెషన్‌ లో అతిపెద్ద ఆకర్షణ మాత్రం టీమిండియా మాజీ కెప్టెన్, మిస్టర్ కూల్ ధోనినే. రెండు రోజుల క్రితం చెన్నై సూపర్ కింగ్స్ కి నాలుగో ఐపీఎల్ టైటిల్ గెలిచిన తర్వాత, భారత మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ (ఎంఎస్ ధోనీ) టీమిండియాతో మరోసారి మైదానంలోకి అడుగుపెట్టాడు. రెండు సంవత్సరాల తరువాత, ధోనీ మెన్‌ ఇన్ బ్లూ టీంకు ట్రైనింగ్ ఇచ్చాడు. అలాగే టీమిండియా దుస్తుల్లో కనిపించాడు. టీ 20 వరల్డ్‌కప్‌కు ధోనీ టీమిండియాతో మెంటార్‌గా ఉంటాడు. 2007 లో తన కెప్టెన్సీలో భారత ఛాంపియన్‌గా నిలిచిన టీమిండియాతో రెండేళ్ల తర్వాత మొదటిసారి కనిపించాడు.

2019 జూలై 10 న ప్రపంచ కప్ సెమీ ఫైనల్ ఓటమి తరువాత, భారత మాజీ కెప్టెన్ టీమిండియా నుంచి దూరమయ్యాడు. 15 ఆగస్టు 2020 న అంతర్జాతీయ క్రికెట్‌ కు పూర్తి వీడ్కోలు పలికాడు. ఐపీఎల్‌ లో మాత్రమే ఆడుతున్నాడు. అక్టోబర్ 18న సోమవారం జరిగే తొలి వార్మప్ మ్యాచ్‌ లో ఇంగ్లండ్‌ తో తలపడాల్సి ఉంది. ఈ మ్యాచ్‌ కు ఒక రోజు ముందు ఆదివారం సాయంత్రం టీమిండియా మొత్తం జట్టు సన్నాహాల కోసం దుబాయ్‌ లోని ఐసీసీ అకాడమీ మైదానంలో కసరత్తులు ప్రారంభించింది. బీసీసీఐ తన అధికారిక ట్విట్టర్ హ్యాండిల్‌ లో టీమిండియా, ధోనీ ఫోటోలను పోస్ట్ చేసింది.

2013 నుంచి భారత జట్టు ఎటువంటి ఐసీసీ టైటిల్ గెలవలేదు. కెప్టెన్ విరాట్ కోహ్లీ, రవిశాస్త్రి పదవీకాలంలో మూడు వైఫల్యాల కారణంగా బీసీసీఐ అభ్యర్థన మేరకు ధోని టీమిండియాతో చేరాడు. ఈ ప్రపంచ కప్‌ వరకు టీంతోనే ఉంటాడు. ఈ వరల్డ్ కప్ తర్వాత కోహ్లీ టీ-20 ఫార్మాట్ లో కెప్టెన్సీ కు గుడ్ బై చెప్పనున్నాడు. దీంతో జట్టులో ఉన్న విబేధాల్ని కంట్రోల్ చేయడానికే ధోనీని మెంటార్ గా బీసీసీఐ తీసుకువచ్చిందన్న టాక్ విన్పిస్తోంది. ఈ మెగా టోర్నీలో టీమిండియా బ్యాటింగ్ లో రోహిత్ శర్మ కీలకం. అతని ఇచ్చే ఓపెనింగ్ భాగస్వామ్యాల మీద టీమిండియా గెలుపోటములు ఆధారపడి ఉంటాయ్. హిట్ మ్యాన్ తో పాటు కేఎల్ రాహుల్, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్ లు కీలకం కానున్నారు.