Begin typing your search above and press return to search.

పెదరాయుడు తీర్పంటే ఇదేనేమో ?

By:  Tupaki Desk   |   6 April 2021 10:35 AM GMT
పెదరాయుడు తీర్పంటే ఇదేనేమో ?
X
శ్రీకాకుళం టీడీపీ ఎంపి కింజరాపు రామ్మోహన్ నాయుడు పెదరాయుడి తీర్పిచ్చారు. పరిషత్ ఎన్నికలను బహిష్కరించటంపై ఎంపి తనదైన శైలిలో విచిత్రమైన వ్యాఖ్యలు చేశారు. పరిషత్ ఎన్నికలను బహిష్కరిస్తున్నట్లు చంద్రబాబునాయుడు ఎందుకు చెప్పారు ? అక్రమాలు, ధౌర్జన్యాలతో అధికారపార్టీ ఎన్నికలను ఏకపక్షంగా చేసుకున్నదనే ఆరోపణలపై.

ఇదే విషయాన్ని ఎంపి మాట్లాడుతు ఎన్నికలకు భయపడి తమ పార్టీ బహిష్కరించలేదన్నారు. అధికారపార్టీ అరాచకాలకు నిరసనగానే తమ అధినేత బహిష్కరణ పిలుపిచ్చినట్లు చెప్పారు. కాబట్టి తమ అధినేత చంద్రబాబు పిలుపులో న్యాయముందన్నారు.

మరి చంద్రబాబు పిలుపును లెక్కచేయకుండా చాలామంది సీనియర్ నేతలే పోటీకి రెడీ అయిపోయారు. తమ మద్దతుదారుల కోసం సీనియర్లు ప్రచారం చేస్తున్నారు. ఇదే విషయాన్ని ప్రస్తావించినపుడు నేతల ప్రచారంలో కూడా న్యాయముందన్నారు. అంటే బహిష్కరణకు పిలుపిచ్చిన చంద్రబాబుది న్యాయమే. ఇదే సమయంలో అధినేత పిలుపును పెడచెవిన పెట్టి పోటీలోకి దిగిన నేతలదీ న్యాయమేనట. బహుశా ఇదేనేమో పెదరాయుడి తీర్పంటే.

అయితే ఈ పెదరాయుడి ప్రకటనలో ఓ విషయం గమనించాలి. రాష్రంలో రాజ్యాంగబద్ద పాలన జరగటం లేదన్నారు. ఎన్నికల కమీషన్ కూడా సక్రమంగా పనిచేయటం లేదన్నారు. పంచాయితి, మున్సినల్ ఎన్నికలు నిర్వహించిన నిమ్మగడ్డ రమేష్ కుమారేమో ఎన్నికలు ప్రశాంతంగా, సజావుగా జరిగిందని సర్టిఫికేట్ ఇచ్చారు. ప్రభుత్వానికి నిమ్మగడ్డకు ఎంత స్ధాయిలో వివాదాలు రేగాయో అందరికీ తెలిసిందే. అలాంటి నిమ్మగడ్డే బాధ్యతల నుండి తప్పుకునేటపుడు క్లీన్ సర్టిఫికేట్ ఇచ్చారు.

ఇక కొత్తగా బాధ్యతలు తీసుకున్న నీలం సహాని ఇంతవరకు ఒక్క ఎన్నిక కూడా నిర్వహించలేదు. పెండింగ్ లో ఉన్న పరిషత్ ఎన్నికల నిర్వహణకు నోటిఫికేషన్ మాత్రమే ఇఛ్చారు. ఇంతోటిదానికే ఎన్నికల కమీషన్ సక్రమంగా పనిచేయటం లేదని చెప్పటమంటే పెదరాయుడు కేవలం బురదచల్లేస్తున్నట్లు అర్ధమైపోతోంది.