Begin typing your search above and press return to search.

జనసేన కూడా ఎన్నికలను బహిష్కరిస్తుందా ?

By:  Tupaki Desk   |   3 April 2021 2:30 AM GMT
జనసేన కూడా ఎన్నికలను బహిష్కరిస్తుందా ?
X
ఈనెల 8వ తేదీన జరగబోయే జిల్లా పరిషత్, మండల పరిషత్ ఎన్నికలను జనసేన పార్టీ కూడా బహిష్కరించబోతోందా ? క్షేత్రస్ధాయిలో జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే అందరిలోను ఇదే అనుమానాలు పెరిగిపోతున్నాయి. ఇప్పటికే పరిషత్ ఎన్నికల్లో పాల్గొనకూడదని తెలుగుదేశంపార్టీ నిర్ణయించిందనే అనధికార సమాచారం చక్కర్లు కొడుతున్న విషయం అందరికీ తెలిసిందే.

ఎన్నికలను బహిష్కరించాలనే తెలుగుదేశంపార్టీ వాదన ఏమిటంటే స్టేట్ ఎలక్షన్ కమీషనర్ గా కొత్తగా బాధ్యతలు తీసుకున్న నీలం సాహ్ని నేతృత్వంలో వైసీపీ మరింతగా అధికార దుర్వినియోగానికి పాల్పడుతుందట. నిమ్మగడ్డ రమేష్ కుమార్ కమీషనర్ గా ఉన్నపుడే అధికార దుర్వినియోగానికి పాల్పడిన అధికార పార్టీ తమ మనిషినే కమీషనర్ గా వేసుకున్న తర్వాత ఎన్నికల్లో అక్రమాలకు పాల్పడకుండా ఉంటుందా అనే లాజిక్ వినిపిస్తోంది.

ఇక జనసేన వాదన ఏమిటంటే పరిషత్ ఎన్నికలను పాత నోటిఫికేషన్ తో కాకుండా కొత్తగా నోటిఫికేషన్ ఇవాలని. ఇదే విషయమై గతంలో జరిగిన ఏకగ్రీవాలను రద్దు చేయాలని, కొత్తగా నోటిఫికేషన్ ఇవ్వాలని కోరుతు కోర్టులో కేసు కూడా వేసింది. అయితే ఏకగ్రీవాల విషయంలో జనసేన వాదనను కోర్టు కొట్టేసింది. ఏకగ్రీవాలను రద్దు చేసే అవకాశం లేదని కోర్టు తేల్చేసింది.

అలాగే కొత్త నోటిఫికేషన్ జారీ విషయంలో కూడా పిటీషనర్ల వాదన సరికాదని అభిప్రాయపడింది. కాకపోతే తీర్పు ఇంకా ఇవ్వలేదు. కొత్త నోటిఫికేషన్ అవసరం లేదని నీలం అనుకోవటంతోనే పాత నోటిఫికేషన్ తోనే ఎన్నికలు నిర్వహించేందుకు రెడీ అయిపోయారు. దీన్నే వ్యతిరేకిస్తు శుక్రవారం నిర్వహించనున్న అఖిలపక్ష సమావేశాన్ని బహిష్కరిస్తున్నట్లు ప్రకటించింది. సమావేశాన్నే బహిష్కరించిన జనసేన ఇక రేపటి ఎన్నికల్లో మాత్రం ఎలా పాల్గొంటుంది ? అన్నదే అసలైన ప్రశ్న.