Begin typing your search above and press return to search.

రాత్రంతా పార్లమెంట్ వద్దే ఎంపీల నిరసన..

By:  Tupaki Desk   |   22 Sep 2020 6:00 AM GMT
రాత్రంతా పార్లమెంట్ వద్దే ఎంపీల నిరసన..
X
రాజ్యసభలో వ్యవసాయ బిల్లుల ఆమోదం సందర్భంగా రచ్చ చేసిన 8 మంది ఎంపీలను సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే.. చైర్మన్‌ వెంకయ్యనాయుడు దీనిపై సీరియస్ అయ్యారు. ఈ సస్పెన్షన్ కు వ్యతిరేకంగా 8మంది ఎంపీలంతా నిన్న రాత్రి వరకు కూడా పార్లమెంట్‌ ఆవరణలో ఆందోళన చేస్తూ కనిపించారు. కేంద్ర ప్రభుత్వ వైఖరిని తప్పుబట్టారు. వారిని అక్కడినుంచి పంపేందుకు గార్డులు విశ్వప్రయత్నాలు చేసినా వినలేదు.

ఎంపీల దీోకు మద్దతుగా పలువురు లోక్ సభ, రాజ్యసభ ఎంపీలు సైతం దీక్షలో పాల్గొన్నారు. రాత్రంతా గాంధీ విగ్రహం వద్దే గడిపిన వారిని రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ హరివంశ్ సింగ్ పరామర్శించారు. వారి కోసం వేడి వేడి టీ తీసుకొచ్చారు.

వివాదాస్పద బిల్లు అయిన వ్యవసాయ బిల్లు ఆదివారం సభ ముందుకు వచ్చింది. అయితే సరైన విధానంలో బిల్లు తీసుకురాలేదని పలువురు సభ్యులు వెల్‌లోకి దూసుకొచ్చి పేపర్లు చించేశారు. టేబుళ్లను తోసి నినాదాలు చేశారు. రూల్ బుక్‌ను డిప్యూటీ చైర్మన్ హరివంశ్‌పై విసిరేశారు.

సభలో జరిగిన దుమారంపై చైర్మన్ వెంకయ్యనాయుడు లేఖ రాశారు. తనను అసభ్య పదజాలంతో దూషించారని తెలిపారు. దీంతో 8 మందిని వారం రోజులపాటు సస్పెండ్ చేస్తున్నట్టు చైర్మన్ వెంకయ్యనాయుడు ప్రకటించారు. దీనిని నిరసిస్తూ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు రాజీవ్, సయ్యద్ నాజీర్ హుస్సేన్, రిపూన్ బోర, టీఎంసీ నుంచి డెరెక్ ఒబ్రెయిన్, సీపీఎం నుంచి కేకే రగేశ్, ఎలమరన్ కరీం, సింగ్, ఆప్ నుంచి సంజయ్ సింగ్ పార్లమెంట్ ఆవరణలో నిరసన తెలియజేస్తున్నారు.

రాత్రి వరకు కూడా అక్కడే బ్లాంకెట్‌, పిల్లోలతో ఉండిపోయారు. గాంధీ విగ్రహం వద్ద పాటలు పాడుతూ నిరసన తెలిపారు. తమను సస్పెండ్ చేసి నోరు మూసే ప్రయత్నం చేయాలని అనుకుంటున్నారని విరుచుకుపడ్డారు. తాము రైతుల పక్షాన పోరాడుతామని తేల్చిచెప్పారు. రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ పార్లమెంటరీ విధానాలను తుంగలో తొక్కారని సీపీఎం ఎంపీ కరీం విమర్శించారు. నిరసన తెలుపుతున్న ఎంపీలు కూడా తాము ఉన్న ప్రాంగణం వద్ద ఒక అంబులెన్స్.. కావాల్సిన మంచినీరు ఏర్పాటు చేసుకున్నారని తెలిసింది.

కాగా తెల్లవారుజామున రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ నిరసన తెలిపిన ఎంపీలను పరామర్శించారు. వారి కోసం టీ బిస్కెట్లను తీసుకొచ్చారు. వారితో కలిసి టీ సేవించారు. వారిని అనునయించే ప్రయత్నం చేశారు.

బిల్లుల ఆమోదంతో ఆదివారం ఎంపీలు నిరసనలు తెలపడంతో సభలో రగడ నెలకొంది. సోమవారం సభలో ఒక్క అంశంపై కూడా చర్చించలేదు. జీరో అవర్‌లో కొన్ని అంశాలను లేవనెత్తుదామని ప్రయత్నించినా ఫలితం కనిపించలేదు.