సంక్రాంతి పండుగ చేసుకుందామని అనుకున్న వైసీపీ తిరుగుబాటు ఎంపీ రఘురామకృష్ణంరాజు తిరిగి ఢిల్లీకి వెళ్ళిపోయారు. నరసాపురం నియోజకవర్గం ఎంపీగా గెలిచిన దగ్గర నుండి ఇప్పటివరకు రఘురామ ఒక్కసారి కూడా నియోజకవర్గంలో కనిపించలేదు. 2019లో వైసీపీ ఎంపీగా గెలిచిన వెంటనే జగన్మోహన్ రెడ్డితో విభేదాలు మొదలవ్వటంతో పార్టీతో బాగా గ్యాప్ వచ్చేసింది. దాంతో ఎంపీకి, ఎంఎల్ఏలు, నేతలకు వివాదాలు మొదలయ్యాయి. దాని దెబ్బకు నియోజకవర్గం వైపు చూడలేదు.
ఆమధ్య ఏదో పనిమీద హైదరాబాద్ వచ్చిన ఎంపీని సీఐడీ అధికారులు అరెస్టు చేశారు. విచారణ సందర్భంగా జరిగిన వివాదం, కోర్టు కేసులు అన్నీ తెలిసినవే. దాని తర్వాత నియోజకవర్గానికి రావాలని ఎంపీ అనుకున్నారు. 13వ తేదీన భీమవరం వస్తున్నట్లు ముందుగానే ప్రకటించారు. ఇందులో భాగంగా ఎంపీ హైదరాబాద్ కు రాగానే ఇంటిదగ్గర సీఐడీ అధికారులు మళ్ళీ ప్రత్యక్షమయ్యారు. విచారణకు హాజరవ్వాలంటు నోటీసులిచ్చారు.
నోటీసుల ప్రకారం విచారణకు హాజరైతే ఏమవుతుందో అని ఎంపీ ఆలోచించినట్లున్నారు. అందుకనే భీమవరం పర్యటనను రద్దు చేసుకుని వెంటనే ఢిల్లీకి వెళ్ళిపోయారు. తన లాయర్లను కలిశారు. నోటీసుల విషయాలను చర్చించారు. సీఐడీ విచారణకు 17వ తేదీన హాజరవ్వనున్నట్లు చెప్పారు. ఈసారి విచారణకు హాజరయ్యేటపుడు ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని ఎంపీ అనుకుంటున్నట్లు సమాచారం. కోర్టులో కేసు వేసి విచారణ సందర్భంగా తన లాయర్ పక్కనే ఉండేట్లుగా ఉత్తర్వులు తీసుకోవాలని ఎంపీ అనుకుంటున్నారట.
ఏదేమైనా ఫిబ్రవరి 5వ తేదీ తర్వాత ఎంపీ పదవికి రాజీనామా చేయబోతున్నట్లు రఘురామ పదే పదే చెబుతున్నారు. ఈ మాట ఎంతవరకు నిజమో తెలీదు కానీ రాజీనామా చేసిన తర్వాత ఉప ఎన్నికల్లో మళ్ళీ పోటీ చేసి గెలుస్తానని మాత్రం చాలెంజ్ చేస్తున్నారు. స్వతంత్ర అభ్యర్ధిగా కానీ లేదా ఏదో పార్టీలో చేరి పోటీ చేయాలని రఘురామ ఆలోచిస్తున్నారు. ఎంపీ తాజా వ్యాఖ్యల ప్రకారమైతే జనసేనలో చేరి పోటీ చేసే అవకాశం ఉందనిపిస్తోంది. మరి ఫిబ్రవరి 5 తర్వాత ఎలాంటి డెవలప్మెంట్లు ఉంటుందో చూడాల్సిందే.